వాయనం: ‘లేబుల్’ చూసే కొంటున్నారా? | are you checking before purchasing of any product? | Sakshi
Sakshi News home page

వాయనం: ‘లేబుల్’ చూసే కొంటున్నారా?

Published Sun, Apr 27 2014 3:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

వాయనం: ‘లేబుల్’ చూసే కొంటున్నారా? - Sakshi

వాయనం: ‘లేబుల్’ చూసే కొంటున్నారా?

ఒకప్పుడు సరుకులు కొనాలంటే కిరాణా కొట్టుకు వెళ్లి, ఏది ఎంత కావాలో చెబితే... దుకాణదారుడు కాగితపు సంచుల్లో వేసి ఇచ్చేవాడు. తెచ్చి వాడుకునేవాళ్లం. డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ వచ్చాక ఈ పద్ధతి మారిపోయింది. ఈ స్టోర్స్ లేని పల్లెటూళ్లలో తప్ప ఎక్కడా ‘లూజ్’ కొనుక్కోవడం లేదు. స్టోర్‌కి వెళ్లడం, షాపంతా తిరుగుతూ నచ్చినవాటిని ఏరుకోవడం, అంతా అయ్యాక బిల్లు చెల్లించి వచ్చేయడం! ఈ పద్ధతి అందరికీ బాగా నచ్చింది.
 
  ఎందుకంటే... ఉన్న వాటిలో బెస్ట్ ఎంచుకోవచ్చు. మనకు నచ్చిన ధరలోనే తీసుకోవచ్చు. అయితే నచ్చినవి తెచ్చేసుకోవడమేగానీ... అవి సురక్షితమో కాదో గమనిస్తున్నామా? అంటే... అవి ఎప్పుడు తయారయ్యాయి, ఏయే పదార్థాలతో తయారయ్యాయి, ఎంతకాలం నిల్వ ఉంటాయి వంటివన్నీ చెక్ చేసుకుంటున్నామా? లేదు. ఈ అలవాటు ఎనభై ఆరు శాతం మందికి లేనేలేదని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇది చాలా తప్పు, ప్రమాదకరం కూడా!
 
 వస్తువులు కొనేటప్పుడు వారంటీ, గ్యారంటీ ఎలా చూస్తామో... తిను బండారాలు, దినుసులు, మందులు కొనేటప్పుడు చూసి తీరాల్సినవి కొన్ని ఉన్నాయి. మొదట చూడాల్సింది ఎక్స్‌పయిరీ డేట్. ఆ తేదీ ఇంకా కనీసం మూడు నాలుగు నెలలు ఉంటేనే కొనాలి. లేదంటే కొనకపోవడమే మంచిది. కొన్నిటికి డేట్ ఇవ్వకుండా... ‘బెస్ట్ బిఫోర్ సిక్స్ మన్త్స్, ఒన్ ఇయర్’ అంటూ రాస్తాడు. అలాంటప్పుడు తయారీ తేదీ (మానుఫ్యాక్చరింగ్ డేట్) చూసుకుని, అక్కడ్నుంచి లెక్కపెట్టుకోవాలి.
 
 తర్వాత చూసు కోవాల్సింది... తిను బండారాలను వేటితో తయారు చేశారు అని. డైటింగ్ చేస్తున్న వాళ్లు, చక్కెర వ్యాధిగ్రస్తులు, కొన్ని రకాల అలర్జీలు ఉన్నవాళ్లయితే ఇంగ్రీడియెంట్స్ చూడకుండా అస్సలు కొనకూడదు. ఎందుకంటే వాటిలో మనకు పడనివి ఏవైనా ఉన్నాయి అనుకుంటే... కొనడం మానేయవచ్చు. పైగా పోషకాలు ఏమున్నాయనేది కూడా తెలుసుకోవడం మంచిదే కదా! అందుకే ఏయే పదార్థాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇక మందులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు కొన్నిసార్లు కాంబినేషన్స్ చెబుతారు. వాటిని చెక్ చేసుకోవాలి. అలానే... డాక్టర్ ఎంత పవర్ ("mg') చెప్పారో అంతే ఉందా, ఎక్కువ తక్కువ ఉందా అని కూడా చూసుకోవాలి. కాస్మొటిక్స్ కూడా అంతే. ఎక్స్‌పయిరీ డేట్లు చూడకుండా కొనేస్తే... అందం పెరగడం పోయి ఉన్నది కాస్తా పాడవుతుంది. ర్యాషెస్, అలర్జీలు వంటివి వచ్చి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు టైమ్ వేస్ట్ అనుకోకుండా ‘లేబుల్స్’ తప్పక పరిశీలించండి. అయినా ఆరోగ్యం కంటే విలువైనది ఏముంది చెప్పండి!
 
 ఆదా + ఆరోగ్యం!
 దోశె వేస్తాం. రుచి బాగుంటుంది కదా అని చెంచాతో చుట్టూ నూనె పోస్తాం. చపాతీ చేస్తాం. బాగా కాలుతుంది కదా అని కాస్త నూనెను తగిలిస్తాం. అది కాస్త అని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఎక్కువ వేస్తుంటాం. చెంచాతో పోస్తే ఎంత పోస్తున్నామో తెలియదు. దాంతో తినాల్సిన దానికంటే ఎక్కువ నూనెను తినేస్తాం. అంటే... మన ఆరోగ్యాన్ని చేతులారా మనమే పాడు చేసుకుంటున్నామన్నమాట! తెలియకుండా జరిగిపోయే ఈ తప్పును ఆపడానికే ‘కుకింగ్ స్ప్రే’లను కనిపెట్టారు. వేరుశెనగ, సన్‌ఫ్లవర్, ఆలివ్ తదితర నూనెలతో పాటు వెన్న, నెయ్యి లాంటివి కూడా ఇప్పుడు ‘స్ప్రే’ల రూపంలో దొరుకుతున్నాయి.
 
 వీటి వల్ల ఉపయోగం ఏంటనే కదా! ఉంది.  చాలా ఉంది. అసలు స్ప్రేలను తక్కువ ద్రవాన్ని ఎక్కువ ప్రదేశంలో చల్లేందుకు కనిపెట్టారు. వంట నూనెను కూడా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే... ఒక్కసారి స్ప్రే చేయగానే నూనె దోశె/చపాతీ అంతటా పరచుకుంటుంది... అది కూడా అతి తక్కువ పరిమాణంలో. ఆదాకి ఆదా... ఆరోగ్యానికి ఆరోగ్యం! వీటి ధర 250 రూపాయల నుంచి మొదలువుతుంది. పరిమాణాన్ని బట్టి, నూనెను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఆన్‌లైన్‌లో అయితే కాస్త తక్కువలో కొనుక్కోవచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement