బతుకు చిక్కు!
చేనేత రంగానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం సంక్షేమ పథకాల్లోనూ కోత విధిస్తోంది. ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ నేతన్నలను వీధిన పడేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పట్టుచీరలకు పుట్టినిల్లయిన అనంత చేనేత ప్రభుత్వ తాజా చర్యలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ముడిపట్టు రాయితీని అప్పుడప్పుడూ అందజేస్తున్నా.. తాజాగా సిల్క్ యార్న్ డిపోలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేయడం ఆందోళన కలిగిస్తోంది.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : సెరిఫెడ్ ఎక్సే్జీలుగా పని చేస్తున్న యార్న్ డిపోలు రెండు నెలలుగా మూతపడ్డాయి. వీటి నిర్వహణ ప్రభుత్వానికి ఆదాయ వనరు కాకపోవడం వల్లే వీటిని మూతవేసినట్లు తెలుస్తోంది. క్రమంగా ఎత్తేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నేతన్నలు వాపోతున్నారు. ఎన్‌హెచ్‌డీసీ(నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ స్కీం) కింద నిర్వహించే ఈ సిల్క్ యార్న్ డిపోల ద్వారా చేనేత కార్మికులు కొనుగోలు చేసే ముడిపట్టుపై ఆ రోజు ఉన్న ధరపై(5కిలోల వరకు) 10 శాతం రాయితీ ఇచ్చేవారు. ఉదాహరణకు.. ముడిరేషం ధర కిలో రూ. 4వేలు ఉంటే అందులో పదిశాతం రాయితీ అంటే రూ.400 చొప్పున 5 కిలోలకు రూ.2వేల వరకు రాయితీ అందుతుంది.
చేనేతకు ఆసరాగా ఉండాలనే తలంపుతో..
రాష్ట్ర వ్యాప్తంగా పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో సిల్క్ యార్న్ డిపోలను, ఎక్సే్చంజీలను ఏర్పాటు చేశారు. ధర్మవరంలో సిల్క్ ఎక్సే్చంజీని, ప్రయోగశాలను కూడా నెలకొల్పారు. ఇక జిల్లాలో చేనేతలు ఉన్న ప్రాంతాల్లో ఉరవకొండ, రాయదుర్గం, తాడిపత్రి, హిందూపురం పట్టణాల్లో ముడిరేషం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా సబ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సిల్క్ యార్న్, నాణ్యమైన ముడిరేషం అందజేసేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సెరిఫైడ్ చినాంబరి సిల్క్ ఎక్సే్చంజీలను ఏర్పాటు చేసి సిల్కు వస్త్రాలను కూడా కొనుగోలు చేశారు.
అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్న సమయంలో సెరిఫెడ్ శంకు చక్రాలు కలిగిన శేష వస్త్రాలను కొనుగోలు చేసి, ఆర్డర్ ద్వారా సిల్కు వీవర్స్‌కు ఉపాధి చూపించారు. ప్రస్తుతం సెరిఫైడ్ క్రయ విక్రయాలు పూర్తిస్థాయిలో తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వం గత రెండు నెలలుగా సిల్కు యార్న్ డిపోలను అనధికారికంగా మూసివేసింది. ఈ కారణంగా ఉరవకొండలోని గవిమఠం, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో పట్టు రాయితీ, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఆందోళనలో చేనేతలు
సిల్క్‌యార్న్ డిపోలు మూతపడటంతో చేనేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ముడిరేషం ధరలకు ఈ యార్న్ డిపోలలో కొనుగోలు చేస్తే ఎంతో కొంత ఆసరాగా ఉండేది. దీనికి తోడు నాణ్యమైన పట్టు అందేది. అయితే ఈ సెరిఫెడ్ వ్యవస్థ్థ నిర్వీర్యం కావడంతో నేతన్నల ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఉరవకొండలో సెరిఫెడ్ కార్యాలయం మూత
ఉరవకొండ పట్టణం గుంతకల్లు రోడ్డులోని సెరిఫెడ్ కార్యాలయాన్ని గత ఏప్రిల్ 3వ తేదీన ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మూసేశారు. దీనికితోడు జిల్లాలోని ధర్మవరం, తాడిపత్రి, యాడికి తదితర ప్రాంతాల్లో సెరిఫెడ్ కార్యాలయాలు మూతపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేట్ సిల్క్ ట్రేడర్స్‌కు కొమ్ముకాస్తూ సెరిఫైడ్ కార్యాలయాలను మూసివేసినట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.