deposit schemes
-
ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలను ఆవిష్కరించండి
న్యూఢిల్లీ: నిధుల సమీకరణకు బ్యాంకులు ఆకర్షణీయమైన, వినూత్న డిపాజిట్ పథకాలను ఆవిష్కరించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు. తద్వారా బ్యాంకులు తమ రుణ వృద్ధిని కూడా సాధించగలుగుతాయని అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఎండీ, సీఈఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోసం, ఉద్దేశపూర్వక డిఫాల్ట్‌లకు సహకరించే అధికారులపై కఠిన పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. బ్యాంకింగ్ డిపాజిట్ వృద్ధి గత కొన్ని నెలలుగా క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా లేదు. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినప్పటికీ క్రెడిట్– డిపాజిట్ వృద్ధి మధ్య అంతరం ఇప్పటికీ 3 నుంచి 4 శాతంగా ఉంది. ఇటీవల ఎస్బీఐ (అరశాతం), బ్యాంక్ ఆఫ్ బరోడా (125 బేసిస్ పాయిట్ల వరకూ) తమ డిపాజిట్ రేట్లను పెంచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెరుగైన పనితీరు పట్ల ఆర్థికమంత్రి ఈ సమావేశంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బ్యాంకు మోసాలు వ్యక్తిగత ఖాతాదారులకు ఆర్థిక సంస్థల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందనీ ఆమె హెచ్చరించారు. అందువల్ల ఆయా పరిణామాలు తలెత్తకుండా బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు రూ. 68,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. వాణిజ్య బ్యాంకుల స్ధూల మొండిబకాయిల నిష్పత్తి 2023 మార్చి నాటికి 3.9 శాతం ఉంటే, సెపె్టంబర్ నాటికి 3.2 శాతానికి తగ్గాయి. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎఆర్‌సిఎల్) ఖాతాల సేకరణ పురోగతిపై కూడా చర్చ జరిగింది. -
పల్లెల్లో ‘సహారా’ కలకలం.. నాలుగేళ్లలో రెండింతలిస్తామంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘సహారా’డిపాజిట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. సహారా బ్యాంకు పేరిట సేకరించిన ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు తీరినా సొమ్ము చెల్లించకపోతుండటంతో డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సహారా ఏజెంట్లను నిలదీస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇల్లు, స్థలాల కొనుగోలు, కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకున్నామని.. ఇప్పుడు సొమ్ము రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. సంస్థలో పలు ఆర్థిక సమస్యల కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, సొమ్ము వస్తుందని ఏజెంట్లు పైకి సర్ది చెప్తున్నా.. లోపల వారు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే సంస్థలో పనిచేసే ఓ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ఇంటి నష్ట పరిహారం పైసలు డిపాజిట్ చేశా.. మిడ్‌మానేరు కింద అనుపురంలో ముంపునకు గురైన ఇంటి నష్ట పరిహారం కింద వచ్చిన రూ.4.70 లక్షలను సహారాలో డిపాజిట్ చేశాను. ఏజెంట్లు 5 ఏళ్ల 4 నెలల్లో రెట్టింపు డబ్బులు వస్తాయన్నారు. గడువు ముగిసి 16 నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇప్పించాలి. – తాండ్ర రజిత, అనుపురం, సిరిసిల్ల జిల్లా అప్పుచేసి బిడ్డ పెళ్లి చేయాల్సి వచ్చింది మాది బిహార్. 30 ఏళ్ల కింద సిరిసిల్లకు వచ్చి స్థిరపడ్డాం. వేములవాడ, సిరిసిల్లలోని సులభ్ కాంప్లెక్స్‌లను కాంట్రాక్టు తీసుకొని పనిచేయిస్తున్నాను. ఏడేళ్ల కింద సహారా ఏజెంట్లు వచ్చి రూ.4.40 లక్షలు ఎఫ్డీ చేస్తే 5 ఏళ్ల 4 నెలలకు రూ.10 లక్షలు వస్తాయని చెప్పి డిపాజిట్ చేయించుకున్నారు. గడువు దాటి 17 నెలలు అయినా డబ్బివ్వలేదు. నా బిడ్డ పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చింది. – సునీల్ మిశ్రా, సిరిసిల్ల దాదాపు ఏడాదిన్నర నుంచి.. ఐదున్నరేళ్లలో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పడంతో చాలామంది తమ కష్టార్జితాన్ని సహారాలో డిపాజిట్ చేశారు. కొందరు ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేస్తే.. చాలా మంది వారానికోసారి, నెలకోసారి కట్టే రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ)గా పొదుపు చేశారు. వీరిలో చాలా వరకు కూలీలు, పేదలే. చివరిలో పెద్దమొత్తంలో సొమ్ము చేతికి అందుతుందని ఆశపడ్డవారే. సహారా సంస్థ ఏజెంట్లు గ్రామాల్లో పర్యటిస్తూ.. తమకున్న పరిచయాలతో డిపాజిట్లు సేకరిస్తున్నారు. కొన్నిరోజులుగా డిపాజిట్లు మరింత పెంచేందుకు నాలుగేళ్లలోనే సొమ్ము డబుల్ అవుతుందని చెప్తున్నట్టు తెలిసింది. అయితే దాదాపు ఏడాదిన్నరగా డిపాజిట్లను తిరిగి చెల్లించడం లేదని.. గత ఏప్రిల్ నుంచి మొత్తంగా రావడం లేదని డిపాజిటర్లు చెప్తున్నారు. దీనితోపాటు డిపాజిటర్లు నెలనెలా చెల్లించే మొత్తానికి వారి పేరున కాకుండా ఏజెంట్ పేరుతో రశీదులు ఇవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై ఏజెంట్లను నిలదీయగా.. సంస్థకు సంబంధించిన పలు కారణాలతో ఇలా జరుగుతోందని పై అధికారులు చెప్పారని వివరిస్తున్నారు. సంస్థ అధికారులు ప్రతి శనివారం ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 17న జూమ్ మీటింగ్‌కు హాజరైన అనంతరం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలకు చెందిన సహారా మేనేజర్ కందాల సంపత్ (55) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన హన్మకొండ జిల్లా కమలాపూర్ సహారా బ్రాంచికి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డిపాజిటర్లకు మెచ్యూరిటీ తీరినా సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఉందని, పై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో సంపత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన కుమారుడు వినయ్ హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ ఘటన ఏజెంట్లలో ఆందోళన పెంచింది. సొమ్ము వస్తుంది.. ఆందోళన వద్దు! కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక చిక్కుల వల్ల మెచ్యూరిటీ పూర్తయినా డిపాజిట్లు చెల్లించలేకపోతున్న మాట వాస్తవమే. అయితే అత్యవసరమున్న వారికి సర్దుబాటు చేస్తున్నాం. డిపాజిటర్లు, ఏజెంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రశీదులు ఏజెంట్ పేరు మీద రావడమంటే అవన్నీ ముందస్తు చెల్లింపులే. దానిపై కంగారు వద్దు. డిపాజిటర్లకు భరోసా కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేనేజర్ సంపత్ ఆత్మహత్యకు ఇతర ఆర్థిక కారణాలే తప్ప.. సహారాకు సంబంధం లేదు. శ్రీనివాస్, సహారా సంస్థ రీజినల్ మేనేజర్, కరీంనగర్ సిరిసిల్లలో చీటింగ్ కేసులు సహారా సంస్థలో డిపాజిట్ చేసివారిలో ఎక్కువ మంది పేద, దిగువ మధ్య తరగతివారే. ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, చదువు, అనారోగ్యం తదితర అవసరాల కోసం.. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందన్న ఆశతో డిపాజిట్లు చేశారు. ఇప్పుడు సొమ్ము అందకపోవడంతో సంస్థపై, ఏజెంట్లపై చీటింగ్ కేసులు పెడుతున్నారు. ఇలా సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, వేములవాడ పోలీస్స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కరీంనగర్లో ఉన్న సహారా రీజనల్ మేనేజర్, ఇతర అధికారులను సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే పిలిపించి వివరణ కూడా తీసుకున్నారు. చదవండి: కథ కంచికి.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం -
గోల్డ్ స్కీమ్స్‌తో జాగ్రత్త!
బంగారు వర్తకులు ఆఫర్ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్‌గా లభించడం, ఎటువంటి తరుగు లేకుండా నగలు కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయా..? కానీ, జ్యుయలర్స్ ఆఫర్ చేసే సేవింగ్స్ పథకాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి అనుమతి లేని అన్ని పథకాలకు ఇది వర్తిస్తుందని భావించారు. జ్యుయలరీ సంస్థల పథకాలకు కూడా బ్రేక్ పడుతుందనుకున్నప్పటికీ... అవి మాత్రం ఇంతకుముందు మాదిరే నిధులను సమీకరిస్తూనే ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్న చిన్న వెసులుబాటును అనుకూలంగా మలచుకుని జ్యూయలరీ సంస్థలు తమ పొదుపు పథకాలను కేవలం పదకొండు నెలల కాలానికే పరిమితం చేస్తున్నాయి. చట్టానికి అతీతంగా జ్యుయలరీ సంస్థలు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీల చట్టం 2014... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించే ఇతర సంస్థలకు షరతులు విధించింది. 365 రోజులకు మించిన కాలానికి డిపాజిట్లు తీసుకునే రిజిస్టర్డ్ సంస్థలు అన్నీ కూడా కచ్చితంగా తిరిగి చెల్లించే సామర్థ్యంపై రేటింగ్ తీసుకోవడంతోపాటు, డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాలి. పైగా డిపాజిట్‌పై వడ్డీని ఎన్‌బీఎఫ్‌సీల కంటే ఎక్కువ ఆఫర్ చేయరాదు. కానీ, జ్యుయలరీ సంస్థలు మాత్రం గతంలో 12, 24, 36 నెలల పథకాలను నిర్వహించగా, చట్టంలోని నిబంధనలు కఠినతరం కావడంతో తమ పథకాల కాల వ్యవధిని 11 నెలలకు కుదించుకున్నాయి. సంస్థ బిచాణా ఎత్తేస్తే? ఆభరణాల సంస్థలు వినియోగదారులను మోసం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకు చెందిన నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ వ్యవహారమే. తమిళనాడులో బంగారు ఆభరణాల మార్కెట్లో మంచి పేరున్న సంస్థ. 75 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లో ఉన్న సంస్థ. కానీ 2017 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలను ఆర్థిక సమస్యల కారణంగా ఈ సంస్థ మూసేసింది. ఖాతాల్లో అవకతవకలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వెలుగు చూశాయి. నాదెళ్ల బంగారు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఉసూరుమనక తప్పలేదు. కంపెనీ 2018 మే నెలలో దివాలా పిటిషన్ వేసింది. ఈ తరహా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ సంఘటన ఓ హెచ్చరిక వంటిది. బంగారు ఆభరణాల సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేస్తే, ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోను, ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారు. మిగిలి ఉంటే సెక్యూర్డ్ రుణదాతలకు చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ రుణదాతల వంతు వస్తుంది. బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు అన్సెక్యూర్డ్ ఆపరేషనల్ క్రెడిటర్ల కిందకు వస్తారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కనుక కస్టమర్ల వంతు ఆఖరు అవుతుంది. లొసుగులు.. అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్... డిపాజిట్‌కు నిర్వచనం ఇచ్చింది. అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం లేదా రుణం, తిరిగి నగదు లేదా సేవ రూపంలో ఇస్తానన్న హామీతో తీసుకునే మొత్తాన్ని డిపాజిట్‌గా పేర్కొంది. ఎవరు డిపాజిట్ తీసుకున్నారన్నది ఇక్కడ అంశం కాదు. వ్యక్తి లేదా యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, కోపరేటివ్ సొసైటీ లేదా ట్రస్ట్ అయినా కావచ్చు. కనుక జ్యుయలర్స్ నిర్వహించే పథకాలు ఈ చట్టం పరిధిలోకే వస్తాయంటున్నారు కొందరు. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. బంధువుల నుంచి రుణాల రూపంలో తీసుకోవడం, వ్యాపార సరుకుల సరఫరా కోసం అడ్వాన్స్ రూపంలో తీసుకోవడానికి డిపాజిట్ నిర్వచనం నుంచి మినహాయింపు ఉంది. భవిష్యత్తులో ఆభరణాల కొనుగోలు సాధనాలుగా తాము బంగారం పొదుపు పథకాలను విక్రయిస్తున్నట్టు జ్యుయలరీ వర్తకులు సమర్థించుకుంటున్నారు. కనుక దీన్ని ముందస్తు వాణిజ్యంగా చూడాలని పేర్కొంటున్నాయి. డిపాజిట్లు కాదు... ‘‘జ్యుయలర్ల పొదుపు పథకాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురాలేదు. జ్యుయలర్స్ సమీకరించే నిధులు కేవలం ముందస్తు వాణిజ్య రూపంలోనే. దీన్ని డిపాజిట్‌గా చూడరాదు. ఈ పథకాల కింద కస్టమర్లకు తగ్గింపులు, బహుమానాలు ఆఫర్ చేయవచ్చా, స్పష్టం చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశాం’’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు వేరు అయితే, బంగారం డిపాజిట్ పథకాలు అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయా అన్న దానిపై అస్పష్టత నెలకొందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు వాణిజ్యం పేరుతో తప్పించుకోవడం కుదరదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఓ కస్టమర్ కొన్ని నెలల పాటు నగదు ఉంచి, చివర్లో ఏది కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఆ డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అన్ని నెలల పాటు అతడు చెల్లించినది డిపాజిట్‌కు భిన్నమేమీ కాదు. వస్తువులకు ముందస్తుగా చెల్లించడం అంటే... మా అభిప్రాయం ప్రకారం ఆ సరుకులు ఏంటన్నది ముందే గుర్తించాల్సి ఉంటుంది. ఏదన్నది గుర్తించకుండా ముందుగానే అడ్వాన్స్‌గా ఎవరూ చెల్లించరు. కనుక ఈ తరహా పథకాలను నిషేధించాలి’’ అని వినోద్ కొతారి అండ్ కంపెనీ సీనియర్ అసోసియేట్ సీఎస్ శిఖా బన్సాల్ అభిప్రాయపడ్డారు. ఎవరి నియంత్రణ? బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ లేదా కంపెనీల చట్టం కింద నమోదైన ఓ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంటే... సంబంధిత నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, కార్పొరేట్ శాఖ, సెబీ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత చూస్తాయి. బంగారం పొదుపు పథకాల విషయానికొస్తే వీటిని నియంత్రించే సంస్థ లేదు. చాలా వరకు ఈ జ్యుయలరీ సంస్థలు కంపెనీలుగా రిజిస్టర్డ్ అయినవి కావు. కనుక కార్పొరేట్ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోదు. ఈ తరహా అనియంత్రిత డిపాజిట్ పథకాలకు సంబంధించి సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప పరిష్కారం లేదు. కనుక పరిష్కారానికి సమయం తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
పోస్టాఫీసు డిపాజిట్లకు సేవింగ్స్ ఖాతాతో పనిలేదు
న్యూఢిల్లీ: పోస్టాఫీసుల్లో డిపాజిట్ పథకాలను నిర్వహించే వారికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ఆ శాఖ తీసుకుంది. డిపాజిట్లపై వడ్డీని, కాల వ్యవధి తీరిన తర్వాత డిపాజిట్ మొత్తాన్ని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల్లోనే డిపాజిట్ చేయాలని ఆ శాఖా గతేడాది ఆగస్ట్ 3న ఆదేశాలు జారీ చేసింది. తొలుత జనవరి 15 గడువుగా నిర్ణయించగా, దాన్ని 2018 ఏప్రిల్ 1కు పొడిగిస్తూ తర్వాత ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిపాజిట్ చేసే వారు ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా కూడా తెరవాల్సి ఉంటుంది.అయితే, దీని పట్ల డిపాజిట్‌దారులు సంతృప్తిగా లేరని ఆ శాఖ గుర్తించింది. ప్రత్యేకంగా బేసిక్ సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు వారు సుముఖంగా లేనందున గత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు తపాలా శాఖ గత నెల 23న జారీ చేసిన ఆఫీస్ ఆఫ్ మెమొరాండంలో పేర్కొంది. గతేడాది నవంబర్ నుంచి పలువురు చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులు కాల వ్యవధి తీరిన తమ డిపాజిట్ల కోసం సేవింగ్స్ ఖాతాలను తెరిచేందుకు నిరాకరించడం వంటి సంఘటనలు ఎదురయ్యాయి. దీంతో తపాలా శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోస్టల్ డిపాజిట్ దారులు ఆధార్ సమర్పించాల్సిన గడువును కూడా నిరవధికంగా కొనసాగిస్తూ ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
ఎస్బీహెచ్ నుంచి కొత్త డిపాజిట్ పథకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎస్బీహెచ్ వృద్ధి’ పేరుతో 275 రోజుల డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొమ్మిది శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న ఈ డిపాజిట్ పథకంపై రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. డిపాజిట్ చేసిన 7 రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీలు ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ డిపాజిట్లో కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ.10,000, గరిష్ట ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ.99.99 లక్షలుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 2న ప్రారంభమయ్యే ఈ పరిమిత కాల డిపాజిట్ పథకం అక్టోబర్ 31తో ముగుస్తుంది. ఏడాదిలోపు కాలపరిమితిగల డిపాజిట్లకు సంబంధించి ఎస్బీహెచ్ ఈ తాజా డిపాజిట్ పథకం కింద అధిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. -
గోల్డ్ స్కీమా! జాగ్రత్త!!
బంగారం.. ఎవరిని ఆకర్షించదు చెప్పండి! అందుకే అది బంగారమైంది. బంగారంలానే బంగారం డిపాజిట్ స్కీమ్‌లు కూడా అందరినీ ఆకర్షిస్తుంటాయి. నె లనెలా కొంత కట్టడం... చివరికి ఆ మొత్తంతో ఏదో ఒక నగ కొనుక్కోవటం. ఇలా చేసేవారికి ఆ స్కీము నడిపే సంస్థ బోనస్ కూడా ఇస్తుంటుంది. సాధారణంగా ఓ 11 నెలల పాటు నెలకు ఇంత అని నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే... దానికి బోనస్‌గా 12వ నెల మొత్తాన్ని సదరు సంస్థ వేయటమో, వేరే ప్రోత్సాహం ఇవ్వటమో చేస్తుంటుంది. చాలా వరకూ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లను బంగారం దుకాణాలే నిర్వహిస్తుం టాయి. మరి ఈ స్కీములు మంచివేనా? చాలామంది ఇన్వెస్ట్మెంట్ నిపుణులు ఇలాంటి పథకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండమని చెబుతుంటారెందుకు? దీన్లో లాభనష్టాలేంటి? ఈ వారం చూద్దాం... ప్రయోజనాలు ఈ స్కీముల్లో ఉండే ప్రధానమైన లాభమేంటంటే వాయిదాల పద్ధతిపై కొనుక్కోగలగటం. ఎందుకంటే బంగారమంటే ఖరీదైంది. ఒకేసారి కొనుగోలు చేయాలంటే కష్టం కాబట్టి వాయిదా పద్ధతుల్లో సొమ్ము చెల్లించి, కొనుక్కోవడం కొంత ఈజీ. చాలా స్కీమ్‌లలో ధరకు రక్షణ ఉంటుంది. స్కీమ్ ప్రారంభమైనపుడు ఎంత ధర ఉందో, అదే ధరకు బంగారం మీ చేతుల్లోకి వస్తుంది. మధ్యలో ధర పెరిగినా దాన్ని దుకాణదారే భరిస్తాడు. నష్టాలు చాలానే.. దుకాణదారు చెల్లిస్తానని చెప్పే చివరి ఇన్స్టాల్మెంట్ పేపర్‌పై తప్ప డిపాజిట్‌దారుకు అందదు. కొన్ని స్కీమ్‌లలో ధర కు రక్షణ ఉండదు. ఈలోగా బంగారం రేటు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈపథకాల్లో బంగారాన్ని ఆభరణాల రూపంలో తప్ప నాణాలు, కడ్డీలుగా ఇవ్వరు. ఆభరణాలపై మేకింగ్ చార్జీలు భారీగా వడ్డిస్తారు. మీరు బంగారాన్ని సదరు దుకాణదారు దగ్గరే... అక్కడ ఉన్న మోడళ్లనే కొనుగోలు చేయాలి. ఈ స్కీమ్‌ల కింద డిపాజిట్లు వసూలు చేసేవారు ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రారు. ఈదుకాణదారు కనక రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలన్నదీ ప్రశ్నార్థకమే. సాధ్యాసాధ్యాలను బట్టి చూస్తే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ల కన్నా బంగారం కడ్డీలు, నాణేలు లేదా బంగారం ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) చాలావరకూ ఉత్తమమన్నది నిపుణుల సలహా. -
ఎస్బీహెచ్ 110 వారాల డిపాజిట్ స్కీమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) అధిక వడ్డీ, లిక్విడిటీతో కూడిన కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 110 వారాల కాలపరిమితి ఉండే ఈ డిపాజిట్‌పై 9.11 శాతం వడ్డీని, అదే సీనియర్ సిటిజన్స్ అయితే 9.41 శాతం వడ్డీని ఎస్బీహెచ్ ఆఫర్ చేస్తోంది. డిపాజిట్ చేసిన ఏడు రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందుగానే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీ లేకపోవడం ఈ డిపాజిట్ పథకంలోని ప్రధాన ఆకర్షణ. మార్చి 10 నుంచి ప్రారంభమైన ఈ డిపాజిట్ పథకం ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని ఎస్బీహెచ్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.99 లక్షలు వరకూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. -
మహిళలకు డీహెచ్ఎఫ్ఎల్ చౌక గృహరుణాలు
వడ్డీరేటులో పావు శాతం, ప్రోసెసింగ్ ఫీజులు 25% తగ్గింపు 10-11% రేటుకు ఆశ్రయ్ డిపాజిట్ స్కీం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళలకు పావు శాతం తగ్గింపు రేటుకే గృహరుణాలను అందిస్తున్నట్లు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రకటించింది. పూర్తిగా మహిళ పేరు మీద లేదా భాగస్వామ్యంలో గృహరుణం తీసుకున్నపుడు మొదటి పేరు మహిళదైతే ఈ పావు శాతం తగ్గింపు వర్తిస్తుందని డీహెచ్ఎఫ్ఎల్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జీతం ఆదాయంగా ఉన్న వారికి 11.25 శాతం వడ్డీరేటుపై గృహరుణాలను అందిస్తోంది. మార్చి 25 వరకు ఈ తగ్గింపు ధరలు ఉంటాయని, ఈ సమయంలో రుణం తీసుకున్న వారికి ప్రోసెసింగ్ ఫీజులో 25% రాయితీని అందిస్తామని డీహెచ్ఎఫ్ఎల్ ప్రెసిడెంట్ రాజేష్ మక్కర్ తెలిపారు. కొత్త డిపాజిట్ పథకాలు డీహెచ్ఎఫ్ఎల్ ‘ఆశ్రయ్’ డిపాజిట్ ప్లస్ పేరుతో కొత్త డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. 80 నుంచి 86 నెలల కాలపరిమితి కలిగిన ఈ డిపాజిట్ పథకాలపై 10 నుంచి 11 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం సగటున 93 నెలలకు డిపాజిట్ మొత్తం రెట్టింపు అవుతుంటే, ఆశ్రయ్‌లో 86 నెలలకే రెట్టింపు అవుతున్నట్లు రాకేష్ తెలిపారు.