మహిళలకు డీహెచ్‌ఎఫ్‌ఎల్ చౌక గృహరుణాలు
వడ్డీరేటులో పావు శాతం, ప్రోసెసింగ్ ఫీజులు 25% తగ్గింపు
10-11% రేటుకు ఆశ్రయ్ డిపాజిట్ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళలకు పావు శాతం తగ్గింపు రేటుకే గృహరుణాలను అందిస్తున్నట్లు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) ప్రకటించింది. పూర్తిగా మహిళ పేరు మీద లేదా భాగస్వామ్యంలో గృహరుణం తీసుకున్నపుడు మొదటి పేరు మహిళదైతే ఈ పావు శాతం తగ్గింపు వర్తిస్తుందని డీహెచ్‌ఎఫ్‌ఎల్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జీతం ఆదాయంగా ఉన్న వారికి 11.25 శాతం వడ్డీరేటుపై గృహరుణాలను అందిస్తోంది. మార్చి 25 వరకు ఈ తగ్గింపు ధరలు ఉంటాయని, ఈ సమయంలో రుణం తీసుకున్న వారికి ప్రోసెసింగ్ ఫీజులో 25% రాయితీని అందిస్తామని డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రెసిడెంట్ రాజేష్ మక్కర్ తెలిపారు.
కొత్త డిపాజిట్ పథకాలు
డీహెచ్‌ఎఫ్‌ఎల్ ‘ఆశ్రయ్’ డిపాజిట్ ప్లస్ పేరుతో కొత్త డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. 80 నుంచి 86 నెలల కాలపరిమితి కలిగిన ఈ డిపాజిట్ పథకాలపై 10 నుంచి 11 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం సగటున 93 నెలలకు డిపాజిట్ మొత్తం రెట్టింపు అవుతుంటే, ఆశ్రయ్‌లో 86 నెలలకే రెట్టింపు అవుతున్నట్లు రాకేష్ తెలిపారు.