Deputy Chief Manish Sisodia
-
మహిళల భద్రతకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మహిళల భద్రత కోసం మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం అభిప్రాయపడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా మహిళలపై సాగుతున్న దౌర్జన్యాలను, దాడులను ఇకనైనా అరికట్టొచ్చని చెప్పారు. ఇలాంటి కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరాన్ని గుర్తించే ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు వెళ్లి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరాం. అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ బృందంలో మెజిస్ట్రేట్‌తో పాటు పౌర రక్షణ సభ్యులు, హోంగార్డులు ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే ఈవ్‌టీజింగ్, సంఘ వ్యతిరేక శక్తులను ఈ బృందం అదుపులోనికి తీసుకుని అక్కడికక్కడే చర్యలు తీసుకునేలా చేయాలి. అలాగే మహిళల భద్రతకు సంబంధించి ఎమ్మెల్యేలు, అధికారులు బాధ్యత తీసుకునేలా వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులను వీలైనంత త్వరగా అమలు చేయాలని అధికారులను సిసోడియా కోరారు. ‘ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబరు 181, పోలీసుల ‘హిమ్మత్’ మొబైల్ అప్లికేషన్, అంతే కాకుండా అనేక హెల్ప్‌లైన్ నంబర్లు ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల మహిళలు ఒక దానికొకటి తికమకపడే అవకాశం ఉంది. అందుకని ఒకటే నంబరును దీని కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది’ అని సిసోడియా అన్నారు. అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే వేలంటైన్స్ డే, కిస్ ఆఫ్ లవ్ వంటి వాటిని నిషేధించాల్సిన అవసరం ఉందన్న ఏపీ సింగ్(నిర్భయ కేసులో దోషుల తరఫు న్యాయవాది) వ్యాఖ్యలను సిసోడియా ఖండించారు. అతని ఆలోచనలు ఫ్యూడలిస్టులను తలపిస్తున్నాయని విమర్శించారు. మహిళలపై దాడులను సమర్థించే ఇలాంటి వ్యక్తుల ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, యాసిడ్ దాడికి గురైన మహిళ, వ్యభిచార కూపంలోకి తెలియకుండా వెళ్లి బయటపడ్డ యువతి, సెక్స్ వర్కర్లకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలు రీతు మణిదాస్ తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా,శిశు అభివృద్ధి(డబ్ల్యూసీడీ) శాఖ మంత్రి సందీప్ కుమార్, డీసీడబ్ల్యూ చీఫ్ బర్ఖా శుక్లా సింగ్, డబ్ల్యూసీడీ కార్యదర్శి ధరంవీర్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర హోం మంత్రిని కలిసిన కేజ్రీవాల్
రాజధానిలో శాంతి భద్రతలు, సీఎస్ నియామకంపై చర్చ న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడటానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గురువారం కలిశారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. రాజధానిలో శాంతి భద్రత పరిరక్షణ కోసం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని హోం మంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియా శనివారం ఉద్యోగ విరమణ చేయనుండటంతో నూతన సీఎస్ నియామకంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నూతన సీఎస్ నియామక రేసులో 1984 బ్యాచ్ ఐఏఎస్ కేడర్‌కి చెందిన ఆర్.ఎస్.త్యాగి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
మాటలే కాదు చేతలు కూడా..
సాక్షి, న్యూఢిల్లీ: మాటలే కాదు తమది చేతల ప్రభుత్వం కూడా అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరోసారి రుజువు చేసింది. విద్యుత్తు, నీటి చార్జీలపై ఇచ్చిన ఎన్నికల హామీలను ఆప్ నెరవేర్చనుంది. 400 యూనిట్ల వరకు విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గించడంతో పాటు ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ఆప్ సర్కారు బుధవారం ప్రకటించింది. వీటిని మార్చి 1 నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమవేశం తర్వాత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ విషయాన్ని విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెబుతూ 400 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలను సగానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, 401 యూనిట్ల పైగా విద్యుత్ వినియోగించే వారు పూర్తి చార్జీలను చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. తగ్గించిన విద్యుత్తు చార్జీలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. డిస్కంల ఆడిట్‌పై సీఏజీ నివేదిక వచ్చేంతవరకు విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని పేర్కొన్నారు. దాని వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 70 కోట్ల భారం పడుతుందని చెప్పారు. మార్చి నెలలో బడ్జెట్ అంచనాలను సవరించి విద్యుత్తు సబ్సిడీ కోసం రూ. 70 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ సబ్సిడీ కోసం రానున్న వార్షిక బడ్జెట్లో రూ. 1,470 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. తగ్గించిన విద్యుత్ చార్జీల వల్ల నగరంలో 36,06,428 కుటుంబాలకు అంటే 90 శాతం వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని సిసోడియా చెప్పారు. ప్రస్తుతం నగరంలో విద్యుత్ వినియోగదారులు 200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 2.80 చొప్పున చెల్లిస్తున్నారు. మార్చి 1 నుంచి యూనిట్‌కు రూ. 2 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. 201 నుంచి 400 యూనిట్ల వరకు ప్రస్తుతం యూనిట్‌కు రూ. 5.15 చెల్లిస్తుండగా మార్చి 1 నుంచి యూనిట్‌కు రూ. 2.98 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత నీటితో 18 లక్షల కుటుంబాలకు లబ్ధి: నీటి మీటర్లు ఉన్న ప్రతి కుటుంబానికి మార్చి 1 నుంచి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించనున్నట్లు సిసోడియా తెలిపారు. నీటి, సీవర్ చార్జీలను రద్దు చేస్తామన్న హామీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. 49 రోజుల పాలనా కాలంలో ఉచిత నీటి ప్రయోజనం 13,31,000 కుటుంబాలకు లభించిందని, ఈ సారి 18 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని తాము అంచనా వేసినట్లు సిసోడియా తెలిపారు. గతంలో ఉచిత నీటి సరఫరా చేసినందుకు ప్రభుత్వ ఖజానాపై మూడు నెలలకు రూ. 31 కోట్ల భారం పడిందని చెప్పారు. ఈ సారి వినియోగదారుల సంఖ్య పెరిగిందని, దీంతో వ్యయం మరింతగా పెరిగి ఏడాదికి రూ. 250 కోట్లు ఖర్చు కావచ్చని చెప్పారు. రానున్న బడ్జెట్లో ఉచిత నీటి సరఫరాకి రూ. 250 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. మార్చి నెలకి రూ. 20 కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. గ్రూపు హౌజింగ్ సొసైటీలకు కూడా ఈ ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. నీటి సమస్యలు, సీవర్ సమస్యలకు సంబంధించి ఢిల్లీ జల్ బోర్డు హెల్ప్‌లైన్ 1916కు ఫోన్ చేయాలని సిసోడియవా సూచించారు.