న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మహిళల భద్రత కోసం మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం అభిప్రాయపడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా మహిళలపై సాగుతున్న దౌర్జన్యాలను, దాడులను ఇకనైనా అరికట్టొచ్చని చెప్పారు. ఇలాంటి కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరాన్ని గుర్తించే ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు వెళ్లి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశాం.
వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరాం. అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ బృందంలో మెజిస్ట్రేట్‌తో పాటు పౌర రక్షణ సభ్యులు, హోంగార్డులు ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే ఈవ్‌టీజింగ్, సంఘ వ్యతిరేక శక్తులను ఈ బృందం అదుపులోనికి తీసుకుని అక్కడికక్కడే చర్యలు తీసుకునేలా చేయాలి. అలాగే మహిళల భద్రతకు సంబంధించి ఎమ్మెల్యేలు, అధికారులు బాధ్యత తీసుకునేలా వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులను వీలైనంత త్వరగా అమలు చేయాలని అధికారులను సిసోడియా కోరారు. ‘ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబరు 181, పోలీసుల ‘హిమ్మత్’ మొబైల్ అప్లికేషన్, అంతే కాకుండా అనేక హెల్ప్‌లైన్ నంబర్లు ఉన్నాయి.
ఇలా ఉండటం వల్ల మహిళలు ఒక దానికొకటి తికమకపడే అవకాశం ఉంది. అందుకని ఒకటే నంబరును దీని కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది’ అని సిసోడియా అన్నారు. అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే వేలంటైన్స్ డే, కిస్ ఆఫ్ లవ్ వంటి వాటిని నిషేధించాల్సిన అవసరం ఉందన్న ఏపీ సింగ్(నిర్భయ కేసులో దోషుల తరఫు న్యాయవాది) వ్యాఖ్యలను సిసోడియా ఖండించారు. అతని ఆలోచనలు ఫ్యూడలిస్టులను తలపిస్తున్నాయని విమర్శించారు. మహిళలపై దాడులను సమర్థించే ఇలాంటి వ్యక్తుల ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, యాసిడ్ దాడికి గురైన మహిళ, వ్యభిచార కూపంలోకి తెలియకుండా వెళ్లి బయటపడ్డ యువతి, సెక్స్ వర్కర్లకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలు రీతు మణిదాస్ తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా,శిశు అభివృద్ధి(డబ్ల్యూసీడీ) శాఖ మంత్రి సందీప్ కుమార్, డీసీడబ్ల్యూ చీఫ్ బర్ఖా శుక్లా సింగ్, డబ్ల్యూసీడీ కార్యదర్శి ధరంవీర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రతకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
Published Mon, Mar 9 2015 11:08 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement