ఎలాగంటే అలా మార్చేద్దామా?
ఇది మన అవసరాన్ని బట్టి ఆకారాన్ని మార్చుకునే సూట్‌కేసు. పేరు ఫుగు. దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఒకట్రెండు రోజుల టూర్ కోసమైతే.. చిన్నపాటి సూట్‌కేసులా ఉంటుంది. అదే.. వారం రోజుల టూర్ కోసమైతే.. ఒకేసారి పెద్దగా మారిపోతుంది. ఇందులో ఉండే బటన్ నొక్కితే.. గాలి కొడితే బూర ఎలా ఉబ్బుతుందో అలా ఉబ్బిపోతుంది.
ఇందులో వాడిన టెక్నాలజీ కూడా దాదాపుగా అలాంటిదే. ‘ఫుగు’లో ఉండే ఎలక్ట్రిక్ పంప్ గాలిని పంపడం ద్వారా సూట్‌కేస్ పెద్దదయ్యేలా చేస్తుంది. అంటే.. వివిధ అవసరాల కోసం వివిధ రకాల బ్యాగులు లేదా సూట్‌కేసులు కొనాల్సిన పనిలేదన్నమాట.
ఇదొక్కటి ఉంటే చాలు. దీన్ని ఇజ్రాయెల్‌కు చెందిన డిజైనర్ ఐజాక్ అట్లాస్ రూపొందించారు. ప్రస్తుతం ‘కిక్ స్టార్టర్’ సైట్ ద్వారా నిధులను సేకరిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభమవనుంది. ఫుగు ధర రూ.18 వేలు.