Desilting
-
చెరువుల్లో పూడికతీత షురూ
సాక్షి, విజయవాడ : పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని చెరువుల్లో పూడికతీత పనులకు జలవనరుల శాఖ శ్రీకారం చుట్టింది. గత ఆరేడేళ్లుగా పూడికతీత పనులు జరగకపోవడంతో అనేక చెరువులు పూడిపోయి నీరు నిల్వ చేయడం కష్టమౌతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నీరు-చెట్టు పథకం కింద చెరువుల పూడికతీత పనులు వారం క్రితమే చేపట్టారు. వచ్చే వర్షాకాలంలోగా వీటిని పూర్తి చేసేందుకు జలవనరుల శాఖ ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. 51 చెరువుల్లో మాత్రమే పనులు ప్రారంభం... జిల్లాలో ఎక్కువగా పశ్చిమకృష్ణా ప్రాంతంలోనే చెరువులు ఉన్నాయి. 23 మండలాల్లో మొత్తం 910 చెరువులు ఉన్నాయి. చెరువు కింద వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉంటే వాటిని పెద్ద చెరువులు (ఎంఐ)గా భావిస్తారు. అలాంటివి 235 ఉండగా, మిగిలిన 675 చిన్న చెరువులు. వాస్తవంగా చిన్న చెరువుల మరమ్మతులు, పూడికతీత పనులు ఉపాధి హామీ పథకం కింద కూలీలతో చేయించాలని ప్రభుత్వం భావించింది. వచ్చే రెండు నెలల్లో పనులు కావని భావిస్తున్న జలవనరుల శాఖ అధికారులు వాటిలో కొన్ని చెరువులను పొక్లెయిన్లతో చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 13 మండలాల్లోని కేవలం 51 చెరువుల్లో మాత్రమే పూడిక పనులు ప్రారంభించారు. మరో 375 చెరువుల్లో నీరు ఉండటం, ఆయా చెరువుల కింద రైతులు దాళ్వా వేయడంతో జాప్యం జరుగుతోంది. మరో నెల రోజుల్లో చెరువుల్లో నీరు తగ్గినా, ఎండిపోయినా పూడిక పనులు ప్రారంభించాలని అదికారులు భావిస్తున్నారు. త్వరలోనే మిగిలిన 10 మండలాల్లో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. చెరువులన్నింటిలోనూ కలిపి సుమారు 400 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీయాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు వేశారు. చెరువు సైజు, లోతును బట్టి ఒకటి నుంచి ఐదు పొక్లెయిన్లు వాడే అవకాశం ఉంది. పొక్లెయిన్కు ఎంత రేటు చెల్లించాలనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దాంతో ఏఎస్ఆర్ రేట్ల ప్రకారమే చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు అధికారులు హామీ ఇస్తున్నారు. చెరువుల్లో పూడిక తీయడానికి సుమారు రూ.70 కోట్లు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. పూడిక మట్టి గ్రామాభివృద్ధికి... చెరువు పూడిక తీసేందుకు మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇరిగేషన్ ఇంజనీర్, పంచాయతీ కార్యదర్శితో కమిటీ వేస్తున్నారు. వారు నిర్ణయించిన ప్రకారమే పనులు చేపడతున్నారు. కొన్ని గ్రామాల్లో జలవనరుల శాఖ గుర్తింపు లేని చెరువుల పూడిక తీయాలంటూ రైతులు ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఈ ఏడాది పూడికతీత పనులు చేపట్టవద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పూడికతీతకు వాడే పొక్లెయిన్ ఖర్చును మాత్రమే నీరు-చెట్టు పథకం కింద ప్రభుత్వం భరిస్తుంది. రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లు పెట్టుకుని ఆ మట్టిని డొంకరోడ్లు మెరక చేసుకునేందుకు, శ్మశానాల మరమ్మతులకు, గ్రామాల్లో ఉండే పల్లపు ప్రాంతాలను మెరక చేసేందుకు, స్కూల్, పంచాయతీ భవనాల అభివృద్ధికి వాడుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో పల్లపు ప్రాంతంలో ఉన్న రైతులు ఈ మట్టిని తీసుకుని తమ పొలాలను మెరక చేసుకునేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు. -
చెరువులకు జీవకళ
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (వందెకరాల విస్తీర్ణంలో ఉన్నవి) 681. వీటికింద 1,56,334 ఎకరాలు సాగవుతోంది. ఇక చిన్న చెరువులు 5,819. వీటికింద 82,722 ఎకరాల పంట సాగవుతోంది. అయితే ఈ చెరువుల్లో 30 ఏళ్లుగా ఒండ్రుమట్టి పేరుకుపోయింది. వీటికి వరద వచ్చే కాల్వలు కూడా మట్టితో నిండుకున్నాయి. దీంతో చెరువులు కింద ఆయకట్టు అంతంత మాత్రంగానే సాగువుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెరువులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా మొదటి విడతలో 20శాతం చెరువులు బాగుచేయాలని భావించింది. అందుకోసం ఆయా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని చెరువులను మొదటి ప్రాధాన్యతగా వేటిని చేపట్టాలో సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు కూడా వారి ప్రాధాన్యం గల చెరువుల చిట్టాను అధికారులకు అందజేశారు. డివిజన్ల వారీగా.. మహబూబ్నగర్ డివిజన్ పరిధిలోకి మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, కల్వకుర్తి, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ని యోజకవర్గాలు, దేవరకద్ర నియోజకవర్గం లోని సగభాగం, నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు, తిమ్మాజిపేట మండలాలు వస్తాయి. వీటికి సంబంధిం చి ఎమ్మెల్యేల నుంచి చిన్నాపెద్దా అనే తేడాలేకుండా 713 చెరువుల ప్రతిపాదనలు వచ్చాయి. నాగర్కర్నూల్ డివిజన్ కిందికి నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చం పేట నియోజకవర్గాలు వస్తాయి. ఈ డివిజన్లో ఎమ్మెల్యేల నుంచి మొత్తం 576 చెరువుల ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే వనపర్తి డివిజన్ పరిధిలో కి వనపర్తి, అలంపూర్, గద్వాల, దేవరకద్ర నియోజకవర్గంలోని సగభాగం వస్తోంది. దీని పరిధిలో ఎమ్మెల్యేల నుంచి 280 చెరువుల పు నరుద్ధరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. ఇలా జిల్లావ్యాపంగా మొత్తం 1569 చిన్నాపెద్ద చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు అందాయి. నిండని చెరువులు ఈ ఏడాది వర్షాలు అంతంత మా త్రంగానే కురవడంతో జిల్లాలోని చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే మహబూబ్నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గానే వర్షాలు కురిశాయి. ఈ డివిజన్లో 318 పెద్దవి, 2,646 చిన్న చెరువులున్నాయి. వీటిలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 334 నిండాయి. 46 చెరువుల నిర్వహణ సరిగా లేకపోవడంతో గండ్లు పడ్డాయి. ఇక వనపర్తి డివిజన్లో 152 పెద్దవి, 1,069 చిన్నవి ఉన్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్కర్నూల్ డివిజన్లో 223 పెద్దవి, 2,104 చిన్న చెరువులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువూ పూర్తిస్థాయిలో నిండకపోగా.. ఐదు చెరువులకు గండ్లు పడి ఉన్న నీరంతా వెళ్లిపోయింది. చెరువులను అభివృద్ధి చేయడం పట్ల రైతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.