Devarapally
-
దేవరపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ
దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఎంఎస్కే అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్, జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ తెలిపారు. దేవరపల్లిలోని హైవే సమీపంలో అకాడమీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. అనంతరం స్థానిక ఏఎస్ఆర్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో ఎం.ఎస్.కె.ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, యూఎస్ఏలో రెండు అంతర్జాతీయ క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారిణులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. అమరావతి సమీపంలోని నంబూరులో కూడా అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేవరపల్లి అకాడమీలో ప్రతి నెలా ఎనిమిది మ్యాచ్‌లు జరిగేలా చూస్తామన్నారు. త్రీ లెవెల్ కోచ్‌లు ఇద్దరు ఉంటారని, అకాడమీల వద్ద ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని చెప్పారు. మండలంలో జాతీయ మహిళా క్రికెట్ క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నందున ఈ ప్రాంతంలో వారిని ప్రోత్సహించి భారత జట్టులో ఆడే విధంగా తీర్చిదిద్దుతానని వివరించారు. తాను 11 ఏళ్ల వయస్సులో అండర్–12 క్రికెట్ ఆడానని ఆయన గుర్తు చేసుకున్నారు. శాప్ మాజీ డైరెక్టర్ పి.రవీంద్రనాథ్, రాష్ట్ర క్రికెట్ అకాడమీ సీనియర్ కోచ్ హమానుల్లా తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎం.ఎస్.కె.ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు మస్తాన్‌రెడ్డి, ప్రసన్న, పీడీలు ఓరుగంటి నాగరాజు, ఓరుగంటి రామకృష్ణ, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. -
దేవరపల్లిలో ‘దేశం’ దొంగాట
ఏలూరు: అధికారదాహంతో తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా అధికారం దక్కకుండా చేయాలని అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిషత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ ఎంపీపీ పదవిని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉద్రిక్తతలు సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేసిన ఆ పార్టీ నేతలు ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లోనూ శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వాన్ని, అల్లరి మూకలను ఆరోజు దేవరపల్లి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రయత్నాలనూ అడ్డుకుంటున్నారు. ఇదీ జరిగింది దేవరపల్లి మండల పరిషత్‌లో 22 ఎంపీటీసీ స్థానాలకుగాను 12 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన పెనుబోతుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీపీ పదవికి గన్నమని జనార్దనరావు పోటీకి దిగారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల్ని భయపెట్టో, ప్రలోభపెట్టో తమవైపు తిప్పుకొని ఎంపీపీ పదవి దక్కించుకోవాలని టీడీపీ పథకం వేసింది. ఈ కుతంత్రాలకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు లొంగలేదు. ఈనెల నాలుగున ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. టీడీపీ శ్రేణులు ఆ రోజున దేవరపల్లిలో అరాచకం సృష్టించాయి. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల సభ్యులపై దౌర్జన్యానికి దిగటమేగాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామారావుపైనా దాడిచేశారు. దీంతో ఎన్నికల్ని ఆపేసిన ఎన్నికల సంఘం.. అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. మళ్లీ ఈనెల 13న ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించటంతో ఆరోజున మళ్లీ దౌర్జన్యాలకు పాల్పడాలని టీడీపీ కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలని, లేకపోతే శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం మంత్రులు కూడా అక్కడే మకాం వేయనున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలు సక్రమంగా జరిగేలా రక్షణ కల్పించాలని వైఎస్సార్ సీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. టీడీపీకి కొమ్ముకాస్తున్న అధికారులు దేవరపల్లిలో ఈనెల 4న జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు టీడీపీకి చెందిన వారిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయని పోలీసు అధికారులు వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆరుగురిలో ఎంపీపీ అభ్యర్థి కుమారుడు గన్నమనేని వెంకటేశ్వరావు, వైఎస్సార్ సీపీ నేత కొఠారు దొరబాబులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వారు బుధవారం బెయిల్ తీసుకోవడానికి కోర్టుకు వెళితే అక్కడా పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆవరణలో నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమ హక్కులకు భంగం కలిగించిన కొవ్వూరు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలపై బాధితులు గురువారం ఎస్పీకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. కోర్టు ఆవరణలో పోలీసుల దౌర్జన్యాన్ని న్యాయవాదులు తీవ్రంగా పరిగణించారు. జిల్లా జడ్జికి, సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం వారంతా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ఆందోళన చేయనున్నారు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు తమ ప్రాణాలకు భద్రత, హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దేవరపల్లి మండల పరిషత్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోమని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో పొటీచేసే అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. అయితే.. అధికారం అండతో ఎవరినీ లెక్కచేయకుండా దాడులకు తెగబడుతున్న టీడీపీ వారు ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఏ అరాచకం సృష్టిస్తారోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.