దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఎంఎస్‌కే అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్, జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ తెలిపారు. దేవరపల్లిలోని హైవే సమీపంలో అకాడమీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. అనంతరం స్థానిక ఏఎస్‌ఆర్ జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సభలో ఎం.ఎస్.కె.ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, యూఎస్‌ఏలో రెండు అంతర్జాతీయ క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారిణులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.
అమరావతి సమీపంలోని నంబూరులో కూడా అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేవరపల్లి అకాడమీలో ప్రతి నెలా ఎనిమిది మ్యాచ్‌లు జరిగేలా చూస్తామన్నారు. త్రీ లెవెల్ కోచ్‌లు ఇద్దరు ఉంటారని, అకాడమీల వద్ద ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని చెప్పారు. మండలంలో జాతీయ మహిళా క్రికెట్ క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నందున ఈ ప్రాంతంలో వారిని ప్రోత్సహించి భారత జట్టులో ఆడే విధంగా తీర్చిదిద్దుతానని వివరించారు. తాను 11 ఏళ్ల వయస్సులో అండర్–12 క్రికెట్ ఆడానని ఆయన గుర్తు చేసుకున్నారు. శాప్ మాజీ డైరెక్టర్ పి.రవీంద్రనాథ్, రాష్ట్ర క్రికెట్ అకాడమీ సీనియర్ కోచ్ హమానుల్లా తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎం.ఎస్.కె.ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు మస్తాన్‌రెడ్డి, ప్రసన్న, పీడీలు ఓరుగంటి నాగరాజు, ఓరుగంటి రామకృష్ణ, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment