స్పెషల్‌గా పంపకాలు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జెడ్పీలో వర్కుల వేట కొనసాగుతోంది. మంజూరుకాక ముందే బీఆర్జీఎఫ్ పనులు చేతులు మారిపోతున్నాయి. పనుల దక్కని నేతల్లో ఆవేదన పెల్లుబుకుతోంది. మమ్మల్ని విస్మరించారని పలువురు లోలోపల మధనపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అమలవుతున్న బీఆర్జీఎఫ్ పథకం కింద 2014-15 సంవత్సరానికి జిల్లాకు రూ.22.94 కోట్లు కేటాయించారు.
ప్రాదేశిక ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు పనుల ప్రణాళికను రూపొందించి పంపించాలని జెడ్పీ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ సమయంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. నిబంధనల మేరకు పంచాయతీల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి, పనులు గుర్తించి, వాటికి తీర్మానం ద్వారా ఆమోదం తెలిపి, దశల వారీగా జిల్లా అధికారులకు పంపించాలి. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు ఆ పనిచేయలేదు. ఎలాగూ జెడ్పీకి కొత్త పాలకవర్గం వస్తోంది. వారికి చేతికి పనులు అప్పగించి మన్ననలు పొందవచ్చన్న ఉత్సాహంతో ప్రతిపాదనలు రూపొందించలేదని తెలిసింది.
అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన కీలక నేతలు దూరదృష్టితో వ్యవహరించారు. పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి, పనుల ప్రతిపాదన చేస్తే పోటీ పెరుగుతుందని, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తుందని, అలా చేస్తే బీఆర్జీఎఫ్ పనులపై గంపెడాశలు పెట్టుకున్న టీడీపీ ముఖ్య నేతలకు ఆశించిన విధంగా న్యాయం చేయలేమని పాలకవర్గంలో చాలామందికితెలియకుండానే కథ నడిపించారు. పాలకవర్గం ఆమోదం జోలికి వెళ్లకుండా, స్పెషల్ ఆఫీసర్ల హయాంలోనే తీర్మానం జరిగినట్టు చూపించారు. తమకు నచ్చిన పనులతో ప్రతిపాదనలు తయారు చేయించారు. కొంతమంది నేతలు చెప్పిన పనులకే ప్రాధాన్యం కల్పించారు. తాము చెప్పిన పనులనే ప్రభుత్వానికి నివేదించాలని మౌఖికంగా అధికారులను ఆదేశించారు.
వ్యూహాత్మకంగా ప్రతిపాదనలు
కీలక నేతలు చెప్పినట్టే అధికారులు నడుచుకున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా, టీడీపీ ముఖ్య నేతలు సూచించిన పనులకు నాలుగు గోడల మధ్య ప్రతిపాదనలు రూపొందించి, వాటికి ఆమోదం తెలుపుతూ గ్రామసభలు తీర్మానం చేసినట్టుగా కాగితాలు సృష్టించారు. వాటినే దశల వారీగా జిల్లా అధికారులకొచ్చేలా చేశారు. గుట్టు చప్పుడు కాకుండా, పాలకవర్గం సమావేశం పెట్టకుండా, స్పెషలాఫీసర్ పాలనలో జరిగినట్టు ప్రణాళికను రూపొందించి కీలక నేతల కనుసన్నల్లో ప్రభుత్వానికి నివేదించారు. ఈవిధంగా బీఆర్జీఎఫ్ పనులను దాదాపు వాటాలు వేసి పంపకాలు చేసేశారని సమాచారం. త్వరలోనే వీటికి ప్రభుత్వ ఆమోదం రానుంది. ఇదే అడ్డగోలు ప్రక్రియ అనుకుంటే తాజాగా మరో అక్రమానికి తెరలేచింది.
విక్రయాలకు పనులు
ఇలా పొందిన పనులను సొంతంగా చేసే ఓపికలేని వారు, కష్టపడకుండా డబ్బు సంపాదించుకోవాలనుకున్న వారు వాటిని వేరేవారికి బదలాయించేందుకు సిద్ధమయ్యారు. తమ వాటాకు వచ్చే పనులను... అంచనా విలువలో 10 శాతం కమీషన్‌కు కట్టబెట్టేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని పనులు చేతులు మారిపోయాయి. మరికొన్ని సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఇప్పుడిది అశోక్ బంగ్లాలో చర్చనీయాంశమైంది.
తెలుగు తమ్ముళ్లోనూ అసంతృప్తి
ఈ నోట, ఆ నోట ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో పనులు దక్కని నేతలంతా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అంతా వారే పంచేసుకుంటే తమ పరిస్థితి ఏంటని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నారు. కాంగ్రెస్ మాదిరిగానే వ్యవహారాలు నడుస్తున్నాయని తోటి నాయకుల వద్ద చెప్పుకుని బాధ పడుతున్నారు. ఇక, కొంతమంది టీడీపీ జెడ్పీటీసీలు కూడా అసంతృప్తితో ఉన్నారు.
తమకు తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా పనులను ప్రతిపాదించి, తమ మండలంలో ఉన్న ముఖ్య నేతలకు కట్టబెట్టారన్న అక్కసుతో ఉన్నారు. పాలకవర్గ సమావేశం పెట్టి, ఆమోదం తెలిపి ఉంటే తమ దృష్టికొచ్చేవని అందుకు భిన్నంగా చేయడంతో ఏకపక్షంగా సాగిపోయిందని లోలోపల బాధ పడుతున్నారు. ఇంకొందరు తమకు ప్రాధాన్యం కల్పించాలని అంతా అయిపోయాక పనుల జాబితాను అధికారులకు సమర్పిస్తున్నారు. ఇప్పుడేం చేయగలమని అధికారుల నుంచి సమాధానం వస్తుండడంతో కిమ్మనలేక సతమతమవుతున్నారు. మొత్తానికి పనుల ప్రతిపాదనలే అడ్డగోలుగా జరిగాయనుకుంటే ఇప్పుడా పనులు విక్రయాలకు పెట్టి మరింతంగా అక్రమాలకు తెరలేపారనే వాదన విన్పిస్తోంది.