బెజవాడకు మహర్దశ
విజయవాడ - గుంటూరులను జంటనగరాలుగా అభివృద్థి చేస్తాం
కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడి
జిల్లా వాసుల హర్షాతిరేకాలు
సాక్షి, విజయవాడ : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలోని హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలకు దీటుగా విజయవాడ-గుంటూరు నగరాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి మధ్య మెట్రోరైలు ప్రతిపాదనను కూడా సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు.
జంటనగరాలుగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేయాలంటే ప్రత్యేక నిధుల అవసరం ఉంది. ఇప్పటికే విజయవాడ నగరానికి జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద వచ్చిన నిధులతో కార్పొరేషన్ అభివృద్ధి చెందకపోగా వెనక్కి వెళ్లిపోయింది. సిబ్బందికి జీతాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. పురోగతి పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు నగరాలు ఆర్థికంగా పరిపుష్టి చెందడం కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆర్థిక ప్యాకేజీ అవసరం..
స్థానిక రాజకీయాల కారణంగా విజయవాడను గ్రేటర్‌గా కూడా మార్చలేదు. ముందు గ్రేటర్ ప్రతిపాదనను కౌన్సిల్ ముందు ఉంచాల్సి ఉంది. గ్రేటర్‌గా మారితే కార్పొరేషన్ ఆదాయం పెరగడంతోపాటు కార్పొరేషన్‌కు పెద్దఎత్తున ల్యాండ్ బ్యాంక్ సమకూరుతుంది. ఈ నేపథ్యంలో జంటనగరాలుగా అభివృద్ధి చేయాలంటే ముందుగా కార్పొరేషన్‌కు 010 పద్దు ఇవ్వడంతో పాటు భారీగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సిఉంటుంది.
విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మహానగరపాలక సంస్థగా ఏర్పాటుచేసి సీనియర్ ఐఏఎస్‌లను నియమించాల్సిఉంటుంది. విజయవాడ నగరంలో నాలుగో వంతు ప్రజలు కొండ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉంది.
విజయవాడ నగరంలో గృహనిర్మాణం చేపట్టాలన్నా స్థలం లేక పదివేల ఇళ్లు ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటన చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం రాజధానిని ఇక్కడే ఏర్పాటుచేసే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.