Devindar Sharma
-
విషపు జల్లుల్లో కూలి బతుకులు
పురుగు మందు డబ్బాలపై ముద్రించి ఉండే ప్రాణాంతక మోతాదు సంగతి ఎలా ఉన్నా, ఈ రసాయనాలు ప్రాణాంతకమైనవనేది మాత్రం వాస్తవం. కాబట్టి వాటిని అత్యంత జాగ్రత్తగా వాడాలి. కానీ, మొహానికి మాస్క్‌ను ధరించి మందు చల్లుతున్న కూలీని మీరు ఎప్పుడైనా చూశారా? చేతులకు తొడుగులు తొడుక్కుని మందు చల్లుతున్న కూలీలను సైతం నేను చూడలేదు. మందు చల్లే కూలీలు అన్ని రక్షణ ఉపకరణాలను ధరించి ఉండటం తప్పనిసరి చేసి ఉంటే మహరాష్ట్ర విషాదాన్ని నివారించగలిగి ఉండేవారమే. పెస్టిసైడ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు 1980ల మధ్య ఒకసారి నన్ను క్షేత్ర స్థాయి పర్యటనకు తీసుకువెళ్లారు. వాళ్లు పంట పొలాల్లో తిప్పి, క్రిమిసంహారక మందులను చల్లే వ్యవసాయ కూలీలకు ఎలాంటి రక్షణ ఉపకరణాలను సమకూరుస్తున్నారో చూపించారు. పొలాల్లో పురుగు మందు చల్లుతున్న వ్యవసాయ కూలీలు సురక్షితమైన దుస్తులను ధరించి, చేతులకు తొడుగులు, ముఖానికి మాస్క్ (ముసుగు), కాళ్లకు గమ్బూట్లు (మోకాళ్ల కింది పిక్కల వరకు ఉండే బూట్లు) వేసుకుని, తలకు టోపీ పెట్టుకుని కనిపించారు. ఆ దృశ్యం చూస్తుంటే వారి ఆరోగ్య సంరక్షణపై భరోసా కలిగింది. నలభై ఏళ్లయినా అదే దుస్థితి దాదాపు నలభై ఏళ్ల తర్వాత, మహారాష్ట్రలో 50 మంది వ్యవసాయ కూలీలు క్రిమిసంహారక మందుల విషప్రభావం వల్ల చనిపోయారని భావిస్తున్నారనే వార్త చదివి నిర్ఘాంతపోయాను. మరో 80 మంది బాధితులను రాష్ట్రం లోని వివిధ ఆసుపత్రులలో చేర్పించినట్టు కూడా తెలిసింది. వారిలో దాదాపు 25 మంది కంటి చూపును కోల్పోగా, మరో 25 మంది అత్యవసర ప్రాణరక్షణ వ్యవస్థల సహాయంతో చావుబతుకుల మధ్య కొట్లాడుతున్నారు. ఈ విషాదాన్ని రైతు, సామాజిక కార్యకర్తలు ప్రాచుర్యంలోకి తేవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానే ఆయినా విచారణకు ఆదేశించింది. మృతుల దగ్గరి బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని కూడా ప్రకటించింది. ఇంచుమించుగా గత 40 ఏళ్లుగా పరిస్థితి పెద్దగా ఏం మారలేదనేది స్పష్టమే. మనుషుల ప్రాణాలంటే లెక్కలేని పరిస్థితి దేశమంతా ఉన్నందున ఒక్క మహారాష్ట్ర ప్రభుత్వాన్నే ఎందుకు ఎందుకు తప్పు పట్టాలి? ప్రత్యేకించి పేదల్లోకెల్లా కడుపేదల బతుకులపై దుష్ప్రభావాన్ని చూపి, తరచుగా ప్రాణనష్టానికి దారి తీసే లేదా శాశ్వత అంగవైకల్యాలను కలుగజేసే పరిస్థితుల గురించి సమాజానికి ఇసుమంతైనా పట్టింపు ఉండదు. క్రిమిసంహారక మందుల పరిశ్రమ, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు కలసి మందులు చల్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ కూలీలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టి ఉండాల్సింది. మందు చల్లడానికి పొలంలోకి దిగడానికి ముందే కూలీలు అన్ని రక్షణ ఉపకరణాలను ధరించి ఉండటం తప్పనిసరి చేసి ఉండాల్సింది. అదే జరిగి ఉంటే మహారాష్ట్ర విషాదాన్ని నివారించగలిగి ఉండేవారమే. విషంలో మునిగి తేలుతూ... బీటీ పత్తి పంట రెండేళ్లుగా భయంకరమైన బోలు పురుగు తెగులును తట్టుకోవడంలో విఫలం కావడమే మహారాష్ట్ర విషాదానికి ప్రధాన కారణం. దీని ఫలితంగానే రైతులు బోలు పురుగు పీడను వదిలించుకోవాలని ప్రాణాంతకమైన మందుల మిశ్రమాలను చల్లడానికి పాల్పడ్డారు. పురుగు మందులన్నీ విషాలే. క్రిమిసంహారిణుల డబ్బాలపై ముద్రించి ఉండే ‘లీథల్ డోస్ 50’ (ప్రాణాంతక మోతాదు) స్థాయి సంగతి ఎలా ఉన్నా, ఈ రసాయనాలు ప్రాణాంతకమైనవనేది మాత్రం వాస్తవం. కాబట్టి వాటిని అత్యంత జాగ్రత్తగా వాడాలి. కానీ, వ్యవసాయ కూలీ ఎవరైనా మొహానికి మాస్క్‌ను ధరించి మందులు ^è ల్లడాన్ని మీరు ఎప్పుడైనా చూసి ఉంటారా? మొహానికి మాస్క్ సంగతి మరచిపోండి, చేతులకు తొడుగులు తొడుక్కుని మందు చల్లుతున్న కూలీలను సైతం నేను చూడలేదు. నేను అన్యాయంగా ఆలోచిస్తున్నానని మీరు అనుకునేట్టయితే... మీరు ఈసారెప్పుడైనా రహాదారుల వెంట పోయేటప్పుడు మీ వాహనాన్ని ఎక్కడైనా ఆపి, పంటపై మందు చల్లుతున్న వ్యవసాయ కూలీని చూడండి. ఈ విషయానికి సంబంధించి రైతు తప్పు కూడా ఉంది. మందులను చల్లేది ఎప్పుడూ రోజు కూలీ శ్రామికులే. కొద్దిమంది రైతులు మాత్రమే కూలీలు తప్పక ముందు జాగ్రత్తలు తీసుకునేలా చేస్తారు. సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేసేయమని వారు కూలీలను తొందరపెడతారు తప్ప, వాళ్ల రక్షణ గురించి, ఆరోగ్యం గురించి ఏ మాత్రం చింత పడరు. శరీరంలోకి ఇంకిపోయే పురుగు మందుల అవశేషాలు హానికరమైన ప్రభావాలను చూపడానికి కొంత కాలం పడుతుంది. అప్పటికల్లా శ్రామికుడు పని పూర్తి చేసుకుని, డబ్బు తీసుకు వెళ్లిపోతాడు. అత్యధిక సందర్భాల్లో ఆ శ్రామికుడ్ని ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు సైతం అతని అనారోగ్యానికి కారణం పురుగు మందులేననేది కూడా తెలియదు. వాస్తవానికి, పురుగు మందు విషంవల్ల సంభవించే మరణాలు రైతు మరణాలుగా దాదాపుగా ఎప్పుడూ లెక్కలోకి రావు. పురుగు మందు ఎప్పుడు ఎలా చల్లాలి? పురుగు మందులు చల్లే పనిని తప్పనిసరిగా ఉదయాన్నే గానీ లేదా సాయంత్రం పొద్దుపోయాక గానీ చేయాలి. ఆ ముందు జాగ్రత్తను తీసుకోవాలని పురుగు మందుల నిబంధనలు చెబుతాయి. కానీ, చాలా అరుదుగానే ఆ వేళలను పాటిస్తుంటారు. ఉదాహరణకు, రుతువులను బట్టి ఉదయం 6–8 గంటల మధ్య కాలం లేదా సాయంత్రం 6 గంటల తర్వాత పురుగు మందులు ^è ల్లే పనిని చేపట్టడం ఉత్తమం. కారణం చాలా సామాన్యమైనదే. ఒకటి, ఉదయం వేళల్లో బలమైన గాలులు వీచే అవకాశం తక్కువ. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ పురుగు మందు రసాయనం మరింత ఎక్కువ విషపూరితం అవుతుంది. అంత ఉదయాన్నే కూలీలు దొరకరు కాబట్టి మందు చల్లే పనులను మధ్యాహ్నం వేళల్లో చేపట్టడం అనివార్యమౌతుంది. మహారాష్ట్రలోని వ్యవసాయ కూలీలు ఏకధాటిన 8 నుంచి 10 గంటలపాటూ పురుగు మందులు చల్లాల్సి వస్తోందని ప్రాథమిక విచారణ తెలిపింది. గాలి వీస్తున్న దిశగానే కూలీ కూడా పురుగు మందు చల్లుతూ పోవాలి. ఇలా చేయడం వల్ల పురుగు మందు శ్రామికునికి అతి తక్కువగా చెరుపు జరుగుతుందని హామీ ఉంటుంది. ఈ జాగ్రత్తను పాటించడం కూడా నేను ఎక్కడా చూడలేదు. గాలి దిశ ఎటు వీస్తున్నా రైతు మాత్రం పని పూర్తి కావాలనే హడావుడిలోనే ఎప్పుడూ ఉంటాడు. ఇంతకంటే అధ్వానంగా, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు టమాటా పంటకు 15 నుంచి 20 సార్లు పురుగు మందు చల్లిస్తుండటాన్ని చూశాను. ఆ పని చేసే కూలీల్లో చాలా మంది నేపాలీలు, ఈశాన్య రాష్ట్రాల వలస కూలీలు. అంతగా పురుగు మందులు చల్లడం ఎందుకంటే ఒక రైతు, మార్కెట్ డిమాండ్‌ను బట్టి అలా చేయడం అవసరం అవుతోందని చెప్పాడు. క్రిమిసంహారక మందుల కంపెనీలు మందు ప్యాకెట్లలో చేతి తొడుగులను కూడా ఉంచుతున్న మాట నిజమే. చేతి తొడుగులతో పాటూ, టోపీ, మొహానికి మాస్క్‌లను కూడా తప్పని సరిగా ప్రతి ప్యాకెట్‌లోనూ ఉంచడాన్ని తప్పనిసరి చేయాలి. శ్రామికుల కోసం గమ్ బూట్లను కొని ఉంచాలని రైతులకు నిర్దేశించాలి. ప్రతి రైతూ తన పొలం వద్ద కొన్ని జతల గమ్ బూట్లను ఉంచేలా చూసే బాధ్యత వ్యవసాయ అధికారులదే. హానికరమైన క్రిమిసంహారక మందుల వాడకం, చల్లడానికి సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శిక్షణ శిబిరాలను కలసి నిర్వహించాలని క్రిమిసంహారక మందుల కంపెనీలకు, వ్యవసాయ శాఖలకు నిర్దేశించాలి. పురుగుమందు లేని సేద్యమే పరిష్కారం వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా ఈ విషయంలో ముఖ్య పాత్రను పోషించాల్సి ఉంది. విశ్వవిద్యాలయాలు వాడవచ్చని చెప్పిన తర్వాతనే ఏ పురుగు మందుకైనా అనుమతులను జారీ చేస్తారు. ఇలా అనుమతులను మంజూరు చేసే క్రమంలోనే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను కూడా పేర్కొనాలి. కంపెనీలు వాగ్దానం చేసిన వాటికి కట్టుబడటంలో విఫలమైతే... వాటి మార్కెటింగ్ హక్కులను ఉపసంహరించుకునే నిబంధన కూడా ఉండాలి. పురుగు మందు రసాయనాలను వాడేవారికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు తెలిసి ఉండేలా చేయడానికి కంపెనీలు హామీని కల్పిం చాలి. అదే సమయంలో, వ్యవసాయ శాస్త్రవేత్తలు రసాయనిక క్రిమిసంహారిణులు తక్కువగా అవసరమయ్యే లేదా అవసరమేలేని పంటలపై దృష్టిని కేంద్రీకరించాలి. ఉదాహరణకు, ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఐఆర్ఆర్ఐ) ‘‘ఆసియా వరి పంటకు క్రిమిసంహారక మందులను వాడటం కాలాన్ని, పనిని వృ«థా చేసే చర్య మాత్రమే’’ అని తేల్చి చెప్పింది. ఆ సంస్థ వరి పరిశోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఫిలిప్పీన్స్‌లోని సెంట్రల్ లూజాన్ ప్రాంతం, వియత్నాం, బంగ్లాదేశ్, భారత్‌లు రసాయనిక క్రిమిసంహారిణులను వాడకుండానే అత్యధిక దిగుబడులను సాధించవచ్చని నిరూపించాయని సైతం ఆ సంస్థ తెలిపింది. అయినాగానీ, దాదాపు 45 పురుగుమందులను వరి పంటపై చల్లుతున్నట్టు తెలిసింది. ఇది ఎలాంటి శాస్త్రీయ తర్కానికైనా విరుద్ధమైన పనే. అయినా వరి పంటపై పురుగు మందులు చల్లటాన్ని పూర్తిగా మానేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎందుకు సూచించలేకపోతున్నాయి? వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్‌శర్మ ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఏలికల పాపం రైతుకు శాపం
రైతాంగం ప్రతి నీటి చుక్కను ఆదా చేసి, ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పడం కేవలం నూతన సాంకేతికతను అమ్ముకోవడం కోసమే. రైతుకు కావాల్సింది రుణం కాదు, ఆదాయం. చాలా ఏళ్లుగా మనం ఆహార ధరలను అదుపు చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే రైతుకు సమంజసమైన ఆదాయాన్ని ఇవ్వ నిరాకరిస్తున్నాం. ఇలా భారాన్నంతా పేద రైతులపై మోపేకంటే వారికి అధిక ధరను ఇచ్చి, రైతు ఉత్పత్తులపై వినియోగదారులకు సబ్సిడీని ఇవ్వాలి. జపాన్, తదితర సంపన్న దేశాల్లో జరుగుతున్నదదే. కానీ మన ప్రభుత్వాలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే రైతాంగం పేదరికంలో మగ్గిపోయేట్టు చేస్తున్నాయి. వ్యవసాయ ఆదాయాలు గణనీయంగా పెరగకపోతే వారి బాగు కోసం చేపట్టే ఏ చర్యా సఫలం కాదు. దేశ రాజధాని ఢిల్లీ దిగ్భ్రాంతికి గురైంది. రాజస్థాన్‌లోని దౌసా గ్రామానికి చెందిన రైతు గజేంద్రసింగ్ (41) దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా సాగుతున్న రైతు ఆత్మహత్యలను ఢిల్లీ దర్బారు వాకిట్లోకే తీసుకొచ్చాడు. రాజకీయాధికార కేంద్రానికి సుదూరంగా ఉన్న ఆ సమ స్య ఇప్పుడు ఏలికలకు ఇబ్బందికరమైనంత సన్నిహితం గా నిలచి వారి కళ్లలోకి గుచ్చి గుచ్చి చూస్తోంది. అదీ మరీ ఎంత ఇరకాటంగానంటే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ ఘటనకు తాను కుంగిపోయానని, నిరుత్సా హానికి గురయ్యానని అంగీకరించక తప్పింది కాదు. ‘‘కష్టించి పనిచేసే రైతు ఏ పరిస్థితుల్లోనూ తాను ఒంటరి నని ఆలోచించరాదు. భారత రైతాంగానికి మెరుగైన భవితను సృష్టించడం కోసం మనమంతా కలసికట్టుగా పనిచేస్తున్నాం’’ అని ఆయన ఆ తర్వాత ట్వీటర్లో వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలన్నీ రాజకీయ ప్రకటనలే పార్లమెంటు బయట రాజకీయవేత్తలంతా అవతలి పార్టీయే రైతులను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటుండగా... ప్రధాన రాజకీయ పార్టీ లన్నిటి చేతులు రైతుల నెత్తుటితో తడిసినవేననే వాస్తవం మాత్రం యథాతథంగా నిలిచి ఉంది. రైతు ఆత్మహ త్యలు ఇటీవలే తలెత్తిన సమస్య కాదు. గత 20 ఏళ్లుగా, దాదాపు మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సగటున ఏడాదికి 14 నుంచి 15 వేల మం ది, ప్రతి గంటకు ఇద్దరు రైతులు ప్రాణాలను తీసుకుం టూనే ఉన్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ఎంతో గొప్ప ధైర్యం కావాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం వాస్తవానికి తమ మరణం ద్వారా ఒక రాజ కీయ ప్రకటన చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ స్పం దన ఎరుగుని తోలు మందం వ్యవస్థను వేలాది రైతుల మరణాలు ఏ మాత్రం కదల్చలేకపోయాయి. కొత్త మొహం, కొత్త పేరు... పాత కథ జంతర్‌మంతర్ వద్ద గజేందర్ ఉరేసుకున్న తదుపరి వెంటనే టీవీ చానళ్లు రైతు ఆత్మహత్యలపై తీసిన వ్యంగ్య చిత్రం ‘పీప్లీ లైవ్’ సన్నివేశాలను తిరిగి కళ్లకు కట్టించడం మొదలెట్టేశాయి. చానళ్ల పీప్లీ లైవ్ సన్నివేశాల్లోని వారం తా రాజస్థాన్‌లోని గజేంద్రసింగ్ గ్రామస్తులు. చనిపోయే ప్పుడు అతను ఫలానా రంగు తలపాగాయే ఎందుకు చుట్టుకున్నాడు, వగైరా విషయాలను చర్చిస్తుండటాన్ని గొప్పగా చూపారు. ఇక ఆ తర్వాత ప్రతి చానలూ వివిధ రాజకీయ పార్టీల అధికారిక ప్రతినిధులను పిలిపించి చర్చాగోష్టులను నిర్వహించేస్తోంది. టీవీ షోలకు వచ్చిన ఆ ప్రతినిధులేమో రైతు ఆత్మహత్య నివారణకు తాము చేపట్టిన చర్యల జాబితాను ఏకరువు పెడుతూ, తమ చొక్కా ఎంత తెలుపో చెప్పుకోడానికి మీడియా వేదికను వాడుకుంటున్నారు. అంతే తప్ప ఈ వరుస మృత్యు నర్తనానికి వెనుక ఉన్న మౌలిక కారణాలేమిటో తెలుసు కునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. తమ పాత్రికే యులను ఏ ఏ ప్రాంతాలకు పంపాలంటూ పత్రికల నుంచి నాకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. మళ్లీ ఒక కొత్త మొహం, కొత్త పేరు... కథ మాత్రం అదే. వ్యవసాయ ఆదాయాల క్షీణతే అసలు కారణం గత రెండు దశాబ్దాలుగా నిరంతరాయంగా సాగుతున్న రైతుల ఆత్మహత్యలకు ప్రాథమికమైన, అత్యంత ముఖ్య మైన కారణంగా దేన్నయినా ఎత్తి చూపాలంటే... రైతాంగ ఆదాయాల క్షీణతనే చూపుతాను. 2014 నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) సమాచారం ప్రకారం రైతాంగ కుటుంబానికి వ్యవసాయ కార్యక లాపాల నుంచి లభించే సగటు ఆదాయం రూ. 3,078. కుటుంబ అవసరాలు తీరాలంటే రైతు కుటుంబం గ్రామీణ ఉపాధి కార్యక్రమం వంటి వ్యవసాయేతర కార్యకలాపాల్లో పాల్గొనడం తప్పనిసరి అవుతోంది. మొత్తంగా రైతు కుటుంబ రాబడి అలా సగటున నెలకు రూ.6,000కు చేరుతోంది. అంటే 58 శాతం రైతులు పస్తు పడుకోవాల్సి వస్తోంది. 76 శాతం వేరే అవకాశమేైదైనా దొరికితే వ్యవసాయాన్ని విడిచిపోవాలనుకునే వారే. అందరి ఆదాయాలు పెరుగుతున్నా... ఈ సమస్యను మరింత లోతుగా తరచి చూసినా సహ చరుడొకరు అద్భుతమైన తారతమ్య విశ్లేషణ చేసి చూపా డు. 1970లో గోధుమ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,450. కాగా నలభై ఐదేళ్ల తర్వాత, 2015 నాటికి గోధుమ సేకరణ ధర ఇంచుమించు 19 రెట్లు పెరిగింది. రైతులకు ఇచ్చే గోధుమ ధరలోని ఈ పెరుగుదలను వివిధ వర్గాల జీతాల పెరుగుదలతో పోల్చి చూద్దాం. ఈ 45 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సగటున 110 నుంచి 120 రెట్లు, స్కూల్ టీచర్ల జీతాలు 280 నుంచి 320 రెట్లు, కాలేజీలు, యూనివర్సిటీల అధ్యాపకుల జీతాలు 150 నుంచి 170 రెట్లు పెరిగాయి. ఇక మధ్యస్థ స్థాయి నుంచి ఉన్నత స్థాయి కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల జీతాలు 350 నుంచి 1,000 రెట్లు పెరి గాయి. అదే సమయంలో స్కూలు ఫీజులు 200 నుంచి 300 రెట్లు, వైద్య చికిత్స వ్యయం 200 నుంచి 300 రెట్లు, నగరాల్లో ఇంటి అద్దె సగటున 350 రెట్లు పెరిగాయి. రైతుపైనే ఆహార ధరల అదుపు భారం అంటే, ఆహార ధరలను తక్కువగా ఉంచడానికిగానూ రైతులు జరిమానా చెల్లించాల్సి వస్తున్నట్టే. ఆహార ద్రవ్యో ల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ఈ ఏడాది కూడా గోధుమ ధరను క్వింటాలుకు రూ. 50 మాత్రమే పెం చారు. ఈ పెరుగుదల స్వల్పం, 3.2 శాతం మాత్రమే. ఈలోగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండో దఫా డీఏ లభించి, 6 శాతం గంతేసింది. త్వరలోనే వారికి ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలు లభి స్తాయి. అతి తక్కువ స్థాయి ఉద్యోగియైన బంట్రోతుకు నెలకు రూ.26,000 జీతం కోరుతున్నారు. రైతుకు అధిక ధర... వినియోగదారులకు సబ్సిడీ గత 45 ఏళ్లలో అతి తక్కువగా జరిగిన వేతనాల పెరుగు దలనే పరిగణనలోకి తీసుకున్నాగానీ గోధుమ ధర 100 రెట్లు పెరగాల్సింది అంటే గోధుమకు నేడు రైతులకు లభిస్తున్న క్వింటాలుకు రూ. 1,450కు బదులు, 1970లో ఇచ్చిన క్వింటాలు రూ.76 ధరకు 100 రెట్ల ధర న్యాయంగా లభించాల్సింది. ఆ లెక్కన రైతుకు క్విం టాలు గోధుమ ధర రూ. 7,600 లభించాల్సింది. మనకు ఇష్టమున్నా లేకున్నా అది రైతుకు దక్కాల్సిన ధర. అలా అని తెగ ఆందోళన పడిపోకండి. నేనేమీ ఆహా ర ద్రవ్యోల్బణం చుక్కలు తాకాలని కోరుకోవడం లేదు. మొత్తం భారాన్నంతా పేద రైతుపై మోపేకంటే రైతుకు అధిక ధరను ఇచ్చి, వారి ఉత్పత్తులపై వినియోగ దారు లకు సబ్సిడీని ఇవ్వాలి. జపాన్‌లో జరుగుతున్నదదే. పలు ఇతర సంపన్న దేశాలు సైతం ఇదే పద్ధతిని అను సరిస్తున్నాయి. రైతు పేదరికంలో మగ్గేట్టు చేస్తున్నాం వ్యవసాయ ఆదాయాలు గణనీయంగా పెరగకపోతే, రైతుకు అనుకూలంగా తీసుకునే ఏ చర్య అయినా పని చేస్తుందని నేననుకోను. రైతులు పంటల ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందనీ, ప్రతి నీటి చుక్కను ఆదా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పడమంతా కేవలం సరికొత్త సాంకేతికతను అమ్ముకోవడం కోసమే. ఆ రెండూ రైతుకు మరింత పరపతిని అందించి, రుణ విష వలయం నుంచి బయటపడేలా చేసేవేమీ కావు. రైతుకు కావాల్సింది రుణం కాదు, ఆదాయం. చాలా ఏళ్లుగా మనం ఉద్దేశ పూర్వకంగానే రైతుకు సమంజసమైన మం చి ఆదాయాన్ని ఇవ్వ నిరాకరిస్తున్నాం. ఒక ప్రభుత్వం తర్వాత మరో ప్రభుత్వం వారిని ఉద్దేశ పూర్వకంగానే పేదరికంలో మగ్గిపోయేట్టు చేస్తున్నాయి. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు ఈమెయిల్: hunger55@gmail.com) దేవీందర్ శర్మ -
రాజుకుంటున్న రైతన్నల ఆగ్రహం
విశ్లేషణ దేశ రాజధానిలో రైతులు పోటెత్తారు. గత మూడు రోజులుగా దేశం నలుమూలల నుండి భారత్ కిసాన్ యూనియన్‌కి చెం దిన వేలాదిమంది రైతులు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొలువుతీరారు. వారి ముఖాలనిండా పరచుకున్న దుఃఖం. తమకు పట్టనున్న దురవస్థల పట్ల ఆందోళన. తాము ఓటేసి గెలిపించిన ప్రభుత్వం తమ మాటలను కనీసం వినకపోతుం దా అనే ఆశ. తమకున్న చిన్న కమతాల నుంచి బలవంతంగా తమను దూరం చేయబోతున్నారన్న భీతి. దానికి కారణమవు తున్న అన్యాయపు చట్టంపై వారి ఆగ్రహం. తమకు జీవితాన్ని ప్రసాదిస్తున్న వ్యవసాయరంగంలో కొనసాగుతున్న సంక్షోభా నికి ముగింపు పలికేలా అధికారంలో ఉన్నవారి నుంచి కాస్తంత హామీ పొందాలన్న ఆశతో వారు వందలాది కిలోమీటర్ల దూరం నుంచి తరలి వచ్చారు. రైతు దురవస్థపై ఉదాసీనత పక్షం రోజుల క్రితం, భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా అన్నా హజారే తదితరులు ఢిల్లీలో తలపెట్టిన రెండు రోజుల నిరసన ప్రదర్శనలో పాలు పంచుకోవడానికి 5 వేల మంది గిరిజనులు ఏక్తా పరిషత్ నేతృత్వంలో తరలి వచ్చారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, అదే స్థాయిలో మధ్య తరగతి ఉదాసీనత కారణంగా తమ బాధలను విప్పి చెప్పుకుంటే కనీసం వినేవారు కూడా లేరన్న వాస్తవం ఆ గిరిజనులకు కట్టెదుట కనిపించడంతో వారు నిరుత్తరులయ్యారు. కొద్దిపాటి మినహాయింపుతో జాతీయ మీడియా కూడా వీరిని పట్టించుకోకపోవడం విషాదకరం. నగరాల్లోని మధ్యతరగతికి, గ్రామీణ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న 60 కోట్ల మంది రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలతో కూడిన నిరు పేదలకు మధ్య తెగిపోయిన సంబంధం ప్రస్తుతం తారస్థాయికి చేరుకుందనే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే, చాలా కాలం నుండి చర్చనీయాంశంగా ఉన్న ‘ఇండియా’కు ‘భారత్’కు మధ్య అంతరం ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతోంది. ప్రధానంగా ఈ కారణం వల్లే మన దేశంలో భూసేకరణపై జరుగుతున్న చర్చ వృద్ధి, అభివృద్ధి భావనలను దాటి వెళ్లడం లేదు. మరింతగా మౌలిక వస తుల కల్పనకోసం పాలకులు సాగిస్తున్న పరుగుపందెంలో రెండు పూటలా తమ చేతివేళ్లు నోట్లోకి పోవడం కోసం అనునిత్యం పోరాడుతూ పేదలు, సన్నజీవులు చేస్తున్న విలాపాలను, వారి జీవన విషాదాలను పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. అందుచేతనే ఢిల్లీకి తరలివచ్చిన ఆ గిరిజునులు కానీ, జంతర్‌మంతర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలుపు తున్న రైతులు కానీ అభివృద్ధి ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా గుర్తింపు పొందుతు న్నారు. వీళ్లు ఇప్పుడు మార్గ అవరోధకుల్లా కనబడుతున్నారు. ఈ అవరోధా లను ఎంత త్వరగా తొలగిస్తే, అభివృద్ధి ప్రక్రియ అంత వేగవంతమ వుతుందన్న భావన సర్వత్రా వ్యాపించిపోయింది. చేతకాని రైతులూ.. చేతనైన పాలకులూ... గడచిన కొన్ని సంవత్సరాలుగా అంటే మన ఘనత వహించిన ఆర్థికవేత్తలూ/ ప్రణాళికాకర్తలూ కలసి, భూమి ఆర్థిక సంపద అనీ, దురదృష్టవశాత్తూ అది చేతకాని వ్యక్తుల (రైతులు) చేతుల్లో ఉండిపోతోందనీ మనకు చెప్పడం మొదలైనప్పటినుంచీ, ఆ ఆస్తిని వీలైనంతగా సేకరించడానికి, మరోలా చెప్పా లంటే కొల్లగొట్టడానికీ దేశంలో రియల్ ఎస్టేట్ పిచ్చిపట్టిన వ్యాపార, పారిశ్రా మిక వర్గాల మధ్య పెనుగులాట మొదలయింది. ప్రపంచ బ్యాంకు సైతం ఈ ప్రజావ్యతిరేక వ్యూహానికి పూర్తి మద్దతునిచ్చింది. 2008వ సంవత్సరం నాటి ప్రపంచ అభివృద్ధి నివేదికను మీరు చదివినట్లయితే నేనెందుకు ఇలా చెబుతు న్నానో సులభంగా అర్థమవుతుంది. ఆ నివేదిక అత్యంత స్పష్టంగా భూ కిరాయిల కోసం పిలుపునిచ్చింది. తమ భూములకు దూరమైన నిర్వాసిత రైతులు పారిశ్రామిక శ్రామికులుగా మారేందుకోసం శిక్షణ ఇచ్చే శిక్షణా కేంద్రాల వ్యవస్థను ఏర్పర్చాలని ఆ నివేదిక సూచించింది. భూసేకరణ ప్రపంచబ్యాంకు కుట్ర ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఈ నివేదిక తర్వాతే నాటి యూపీయే కేంద్ర ప్రభుత్వం దేశంలో 1,000 పారిశ్రామిక శిక్షణా సంస్థల(ఐటీఐలు)ను నెల కొల్పడానికి బడ్జెట్లో కేటాయింపులు చేసిందంటే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. దేశ వ్యవసాయరంగంలోని దాదాపు 70 శాతం మంది రైతాంగాన్ని పట్టణ కేంద్రాలకు తరలించేలా భారీ స్థాయిలో జనాభా తరలింపు కార్యక్ర మాన్ని వేగవంతం చేయాలని సాక్షాత్తూ నాటి ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా పిలుపునిచ్చారు. పైగా, భారత్‌లో ఇలాంటి జనాభా తరలింపు జరగాలని ప్రపంచబ్యాంకు 1996 నుంచే పోరు పెడుతూ వచ్చిందన్న విషయాన్ని కూడా మరువరాదు. ఇప్పటి నుంచి వచ్చే 20 సంవత్సరాలలోగా అంటే 2015 నాటికి దేశంలోని 40 కోట్ల మంది ప్రజలను గ్రామీణ ప్రాంతా ల్లోంచీ బయటకు పంపాలని ప్రపంచ బ్యాంకు ఆనాడే భారత్‌కు సూచించింది. అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల జనా భాకు రెట్టింపు సంఖ్యలో భారతీయ రైతాంగాన్ని భూముల నుంచి తరిమివేసే భారీ పథకం ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో మొదలయిందన్నమాట. మొత్తంమీద ఇది ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో భాగ మన్నమాట. పరిశ్రమల తరపున ప్రభుత్వం తమ భూములను లాక్కోవడం జరిగితే తాము మరింత వేరుపడిపోతామని, తమ జీవితాలకు ఇక లెక్కా జమా లేకుండా పోతుందని భీతి ల్లిన దేశదేశాల ప్రజానీకం ఆనాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పోరాటాలను కొనసాగించారు. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టే ప్రక్రియకు పాలకులు చక్కెరపూత లాంటి భావనలను తగిలించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచ కుండా దాన్ని ఉద్దేశపూర్వకంగా పతనం వైపుకు నెట్టే చర్యలు చేపట్టడం ద్వారా ఈ ప్రక్రియ మొదలైంది. దీని ఫలితంగా తమ భూములకు మంచి ధర పలికితే భూములను వదులుకోవడానికి సిద్ధమనే మానసికస్థితిని రైతుల్లో కలిగించారు. ఒక్కసారి ఇలాంటి భావనను వారిలో ప్రవేశపెట్టాక, రైతులను వారి భూముల నుంచి తరిమేయడం మరింత సులువు అవుతుంది. భారత్ వెయ్యి తిరుగుబాట్ల పురిటిగడ్డ అయితే ఇది పైకి కనిపించినంత సులువు కాదు. పేదలకు ఏకైక ఆర్థిక భద్రత భూమే కాబట్టి వారు ప్రతిచోటా భూసేకరణకు, భూ స్వాధీన పథకాలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. కొంతకాలం క్రితం న్యూస్‌వీక్ ఆంగ్ల పత్రికలో ఫరీద్ జకారియా రాసినట్లుగా, ఒక్క చైనాలోనే ప్రతి సంవత్సరం 75,000 భూ సంఘర్షణలు జరుగుతూ వచ్చాయి. అంటే రోజుకు 250 ప్రదర్శ నలన్నమాట. వీటిలో చాలావరకు రక్తపాతం చోటు చేసుకుంది. తాజా నివేది కను పరిశీలిస్తే, గత పది సంవత్సరాల కాలంలో చైనాలో 28 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు. వీటిలో 80 శాతం పైగా ఆత్మ హత్యలు, భూములనుంచి రైతులను బలవంతంగా వెళ్లగొట్టిన కారణంగానే చోటు చేసుకున్నాయని ఆ నివేదిక పేర్కొంది. గత కొన్నేళ్లుగా గ్రామీణ చైనా.. రైతాంగ నిరసనలతో, ఆగ్రహజ్వాలలతో కుతకుత ఉడికిపోతోంది. మన దేశం విషయానికి వస్తే 2013-14లో 165 జిల్లాల్లో 260 చోట్ల భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినట్లు నమోదైంది. ప్రస్తుతం కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ బిల్లును వాస్తవ రూపంలో అమలులోకి తీసుకువచ్చినప్పుడు భూమికోసం, భుక్తికోసం రైతుల పోరాటం తీవ్రతరం కాక తప్పదనిపిస్తోంది. అదే జరిగినట్లయితే ఇండియా అనబడే భారత్ వెయ్యి తిరుగుబాట్ల పురిటిగడ్డగా మారక తప్పదు. (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) email: hunger55@gmail.com మన దేశంలో భూసేకరణపై జరుగుతున్న చర్చ వృద్ధి, అభివృద్ధి భావనలను దాటి వెళ్లడం లేదు. మరింతగా మౌలిక వసతుల కల్పన కోసం పాలకులు సాగిస్తున్న పరుగుపందెంలో.. రెండు పూటలా తమ చేతివేళ్లు నోట్లోకి పోవడం కోసం అనునిత్యం పోరాడుతూ పేదలు, సన్నజీవులు చేస్తున్న విలాపాలను, వారి జీవన విషాదాలను పట్టించుకునేవారే లేకుండా పోతున్నారు. అందుచేతనే ఢిల్లీకి తరలివచ్చినఆ గిరిజనులు కానీ, జంతర్‌మంతర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న రైతులు కానీ అభివృద్ధి ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా గుర్తింపు పొందుతున్నారు. రైతులు ఇప్పుడు మార్గ అవరోధకులట.. ఈ అవరోధాలను ఎంత త్వరగా తొలగిస్తే, అభివృద్ధి ప్రక్రియ అంత వేగవంతమవుతుందన్న భావన సర్వత్రా బలపడిపోయింది. దేవీందర్ శర్మ