
రాజుకుంటున్న రైతన్నల ఆగ్రహం
దేశ రాజధానిలో రైతులు పోటెత్తారు. గత మూడు రోజులుగా దేశం నలుమూలల నుండి భారత్ కిసాన్ యూనియన్‌కి చెం దిన
విశ్లేషణ
దేశ రాజధానిలో రైతులు పోటెత్తారు. గత మూడు రోజులుగా దేశం నలుమూలల నుండి భారత్ కిసాన్ యూనియన్‌కి చెం దిన వేలాదిమంది రైతులు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొలువుతీరారు. వారి ముఖాలనిండా పరచుకున్న దుఃఖం. తమకు పట్టనున్న దురవస్థల పట్ల ఆందోళన. తాము ఓటేసి గెలిపించిన ప్రభుత్వం తమ మాటలను కనీసం వినకపోతుం దా అనే ఆశ. తమకున్న చిన్న కమతాల నుంచి బలవంతంగా తమను దూరం చేయబోతున్నారన్న భీతి. దానికి కారణమవు తున్న అన్యాయపు చట్టంపై వారి ఆగ్రహం. తమకు జీవితాన్ని ప్రసాదిస్తున్న వ్యవసాయరంగంలో కొనసాగుతున్న సంక్షోభా నికి ముగింపు పలికేలా అధికారంలో ఉన్నవారి నుంచి కాస్తంత హామీ పొందాలన్న ఆశతో వారు వందలాది కిలోమీటర్ల దూరం నుంచి తరలి వచ్చారు.
రైతు దురవస్థపై ఉదాసీనత
పక్షం రోజుల క్రితం, భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా అన్నా హజారే తదితరులు ఢిల్లీలో తలపెట్టిన రెండు రోజుల నిరసన ప్రదర్శనలో పాలు పంచుకోవడానికి 5 వేల మంది గిరిజనులు ఏక్తా పరిషత్ నేతృత్వంలో తరలి వచ్చారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, అదే స్థాయిలో మధ్య తరగతి ఉదాసీనత కారణంగా తమ బాధలను విప్పి చెప్పుకుంటే కనీసం వినేవారు కూడా లేరన్న వాస్తవం ఆ గిరిజనులకు కట్టెదుట కనిపించడంతో వారు నిరుత్తరులయ్యారు. కొద్దిపాటి మినహాయింపుతో జాతీయ మీడియా కూడా వీరిని పట్టించుకోకపోవడం విషాదకరం.
నగరాల్లోని మధ్యతరగతికి, గ్రామీణ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న 60 కోట్ల మంది రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలతో కూడిన నిరు పేదలకు మధ్య తెగిపోయిన సంబంధం ప్రస్తుతం తారస్థాయికి చేరుకుందనే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే, చాలా కాలం నుండి చర్చనీయాంశంగా ఉన్న ‘ఇండియా’కు ‘భారత్’కు మధ్య అంతరం ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతోంది.
ప్రధానంగా ఈ కారణం వల్లే మన దేశంలో భూసేకరణపై జరుగుతున్న చర్చ వృద్ధి, అభివృద్ధి భావనలను దాటి వెళ్లడం లేదు. మరింతగా మౌలిక వస తుల కల్పనకోసం పాలకులు సాగిస్తున్న పరుగుపందెంలో రెండు పూటలా తమ చేతివేళ్లు నోట్లోకి పోవడం కోసం అనునిత్యం పోరాడుతూ పేదలు, సన్నజీవులు చేస్తున్న విలాపాలను, వారి జీవన విషాదాలను పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. అందుచేతనే ఢిల్లీకి తరలివచ్చిన ఆ గిరిజునులు కానీ, జంతర్‌మంతర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలుపు తున్న రైతులు కానీ అభివృద్ధి ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా గుర్తింపు పొందుతు న్నారు. వీళ్లు ఇప్పుడు మార్గ అవరోధకుల్లా కనబడుతున్నారు. ఈ అవరోధా లను ఎంత త్వరగా తొలగిస్తే, అభివృద్ధి ప్రక్రియ అంత వేగవంతమ వుతుందన్న భావన సర్వత్రా వ్యాపించిపోయింది.
చేతకాని రైతులూ.. చేతనైన పాలకులూ...
గడచిన కొన్ని సంవత్సరాలుగా అంటే మన ఘనత వహించిన ఆర్థికవేత్తలూ/ ప్రణాళికాకర్తలూ కలసి, భూమి ఆర్థిక సంపద అనీ, దురదృష్టవశాత్తూ అది చేతకాని వ్యక్తుల (రైతులు) చేతుల్లో ఉండిపోతోందనీ మనకు చెప్పడం మొదలైనప్పటినుంచీ, ఆ ఆస్తిని వీలైనంతగా సేకరించడానికి, మరోలా చెప్పా లంటే కొల్లగొట్టడానికీ దేశంలో రియల్ ఎస్టేట్ పిచ్చిపట్టిన వ్యాపార, పారిశ్రా మిక వర్గాల మధ్య పెనుగులాట మొదలయింది. ప్రపంచ బ్యాంకు సైతం ఈ ప్రజావ్యతిరేక వ్యూహానికి పూర్తి మద్దతునిచ్చింది. 2008వ సంవత్సరం నాటి ప్రపంచ అభివృద్ధి నివేదికను మీరు చదివినట్లయితే నేనెందుకు ఇలా చెబుతు న్నానో సులభంగా అర్థమవుతుంది. ఆ నివేదిక అత్యంత స్పష్టంగా భూ కిరాయిల కోసం పిలుపునిచ్చింది. తమ భూములకు దూరమైన నిర్వాసిత రైతులు పారిశ్రామిక శ్రామికులుగా మారేందుకోసం శిక్షణ ఇచ్చే శిక్షణా కేంద్రాల వ్యవస్థను ఏర్పర్చాలని ఆ నివేదిక సూచించింది.
భూసేకరణ ప్రపంచబ్యాంకు కుట్ర
ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఈ నివేదిక తర్వాతే నాటి యూపీయే కేంద్ర ప్రభుత్వం దేశంలో 1,000 పారిశ్రామిక శిక్షణా సంస్థల(ఐటీఐలు)ను నెల కొల్పడానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేసిందంటే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. దేశ వ్యవసాయరంగంలోని దాదాపు 70 శాతం మంది రైతాంగాన్ని పట్టణ కేంద్రాలకు తరలించేలా భారీ స్థాయిలో జనాభా తరలింపు కార్యక్ర మాన్ని వేగవంతం చేయాలని సాక్షాత్తూ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వయంగా పిలుపునిచ్చారు. పైగా, భారత్‌లో ఇలాంటి జనాభా తరలింపు జరగాలని ప్రపంచబ్యాంకు 1996 నుంచే పోరు పెడుతూ వచ్చిందన్న విషయాన్ని కూడా మరువరాదు. ఇప్పటి నుంచి వచ్చే 20 సంవత్సరాలలోగా అంటే 2015 నాటికి దేశంలోని 40 కోట్ల మంది ప్రజలను గ్రామీణ ప్రాంతా ల్లోంచీ బయటకు పంపాలని ప్రపంచ బ్యాంకు ఆనాడే భారత్‌కు సూచించింది. అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల జనా భాకు రెట్టింపు సంఖ్యలో భారతీయ రైతాంగాన్ని భూముల నుంచి తరిమివేసే భారీ పథకం ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో మొదలయిందన్నమాట.
మొత్తంమీద ఇది ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో భాగ మన్నమాట. పరిశ్రమల తరపున ప్రభుత్వం తమ భూములను లాక్కోవడం జరిగితే తాము మరింత వేరుపడిపోతామని, తమ జీవితాలకు ఇక లెక్కా జమా లేకుండా పోతుందని భీతి ల్లిన దేశదేశాల ప్రజానీకం ఆనాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పోరాటాలను కొనసాగించారు. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టే ప్రక్రియకు పాలకులు చక్కెరపూత లాంటి భావనలను తగిలించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచ కుండా దాన్ని ఉద్దేశపూర్వకంగా పతనం వైపుకు నెట్టే చర్యలు చేపట్టడం ద్వారా ఈ ప్రక్రియ మొదలైంది. దీని ఫలితంగా తమ భూములకు మంచి ధర పలికితే భూములను వదులుకోవడానికి సిద్ధమనే మానసికస్థితిని రైతుల్లో కలిగించారు. ఒక్కసారి ఇలాంటి భావనను వారిలో ప్రవేశపెట్టాక, రైతులను వారి భూముల నుంచి తరిమేయడం మరింత సులువు అవుతుంది.
భారత్ వెయ్యి తిరుగుబాట్ల పురిటిగడ్డ
అయితే ఇది పైకి కనిపించినంత సులువు కాదు. పేదలకు ఏకైక ఆర్థిక భద్రత భూమే కాబట్టి వారు ప్రతిచోటా భూసేకరణకు, భూ స్వాధీన పథకాలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. కొంతకాలం క్రితం న్యూస్‌వీక్ ఆంగ్ల పత్రికలో ఫరీద్ జకారియా రాసినట్లుగా, ఒక్క చైనాలోనే ప్రతి సంవత్సరం 75,000 భూ సంఘర్షణలు జరుగుతూ వచ్చాయి. అంటే రోజుకు 250 ప్రదర్శ నలన్నమాట. వీటిలో చాలావరకు రక్తపాతం చోటు చేసుకుంది. తాజా నివేది కను పరిశీలిస్తే, గత పది సంవత్సరాల కాలంలో చైనాలో 28 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు. వీటిలో 80 శాతం పైగా ఆత్మ హత్యలు, భూములనుంచి రైతులను బలవంతంగా వెళ్లగొట్టిన కారణంగానే చోటు చేసుకున్నాయని ఆ నివేదిక పేర్కొంది. గత కొన్నేళ్లుగా గ్రామీణ చైనా.. రైతాంగ నిరసనలతో, ఆగ్రహజ్వాలలతో కుతకుత ఉడికిపోతోంది. మన దేశం విషయానికి వస్తే 2013-14లో 165 జిల్లాల్లో 260 చోట్ల భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినట్లు నమోదైంది. ప్రస్తుతం కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ బిల్లును వాస్తవ రూపంలో అమలులోకి తీసుకువచ్చినప్పుడు భూమికోసం, భుక్తికోసం రైతుల పోరాటం తీవ్రతరం కాక తప్పదనిపిస్తోంది. అదే జరిగినట్లయితే ఇండియా అనబడే భారత్ వెయ్యి తిరుగుబాట్ల పురిటిగడ్డగా మారక తప్పదు.
(వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)
email: hunger55@gmail.com
మన దేశంలో భూసేకరణపై జరుగుతున్న చర్చ వృద్ధి, అభివృద్ధి భావనలను దాటి వెళ్లడం లేదు. మరింతగా మౌలిక వసతుల కల్పన
కోసం పాలకులు సాగిస్తున్న పరుగుపందెంలో.. రెండు పూటలా తమ చేతివేళ్లు నోట్లోకి పోవడం కోసం అనునిత్యం పోరాడుతూ పేదలు, సన్నజీవులు చేస్తున్న విలాపాలను, వారి జీవన విషాదాలను పట్టించుకునేవారే లేకుండా పోతున్నారు. అందుచేతనే ఢిల్లీకి తరలివచ్చినఆ గిరిజనులు కానీ, జంతర్‌మంతర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న రైతులు కానీ అభివృద్ధి ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా గుర్తింపు పొందుతున్నారు. రైతులు ఇప్పుడు మార్గ అవరోధకులట.. ఈ అవరోధాలను ఎంత త్వరగా తొలగిస్తే, అభివృద్ధి ప్రక్రియ అంత వేగవంతమవుతుందన్న భావన సర్వత్రా బలపడిపోయింది.
దేవీందర్ శర్మ