గోడు పట్టదా!
పది రోజులకు పైగా దేశ రాజధాని వేదికగా నిరసనలు సాగిస్తున్నా, పాలకులు తమ గోడును పట్టించుకోక పోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జంతర్ మంతర్ వద్ద శనివారం చెట్టుపైకి ఎక్కి దూకేస్తామంటూ ఆత్మహత్యా బెదిరింపులు ఇవ్వడం ఉత్కంఠకు దారి తీసింది. సినీ నటుడు విశాల్ బుజ్జగించడంతో అన్నదాతలు శాంతించారు. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో విశాల్ భేటీ అయ్యారు.
సాక్షి, చెన్నై: నదుల అనుసంధానం, కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ, రుణాల మాఫీ, కరువు సాయం పెంపు, నష్టపరిహారం పెంపు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని ఆదుకోవాలన్న పలు డిమాండ్లతో పద కొండు రోజులుగా డెల్టాలోని అన్నదాతలు వంద మంది ఢిల్లీ వేదికగా నిరసనలు సాగిస్తూ వస్తున్నారు.
జంతర్ మంతర్ వద్ద వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నా, ఢిల్లీ పెద్దల్లో ఏ మాత్రం చలనం రాలేదు. అన్నదాతల ఆందోళనల సమాచారంతో సీనీ నటులు విశాల్, ప్రకాష్ రాజ్, రమణ, దర్శకుడు పాండియరాజన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొనడమే కాకుండా కేంద్రం దృష్టికి డిమాండ్లను తీసుకెళ్లే యత్నం చేశారు. అయినా, పాలకులు తమ గోడును పట్టించుకోక పోవడంతో అన్నదాతల్లో ఆందో ళన బయలు దేరింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఆత్మహత్యా బెదిరింపు: పన్నెండో రోజు నిరసనలో జంతర్ మంతర్ వద్ద ఉన్న అతి పెద్ద చెట్టు మీదకు శనివారం ఉదయం ముగ్గురు రైతులు ఎక్కారు. ఇక, ఓపిక నశించిందని, దూకి ఆత్మహత్య చేసుకోనున్నట్టు ప్రకటించారు. దీంతో అక్కడున్న ఇతర రైతుల్లో ఆందోళన బయలు దేరింది. వారిని బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకుని కిందకు దిగాలని హెచ్చరించినా ఫలితం శూన్యం. గంటన్నరకు పైగా అక్కడ ఉత్కంఠ బయలు దేరింది.
రైతులు చెట్టు మీదకు ఎక్కి ఆత్మహత్యా బెదిరింపు ఇస్తున్న సమాచారంతో నటుడు విశాల్, ప్రకాష్‌రాజ్ అక్కడికి పరుగులు తీశారు. వారిని బుజ్జగించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు రెండు గంటల అనంతరం ఓ రైతు కిందకు దిగి వచ్చాడు. మరి కాసేపటికి మిగిలిన ఇద్దరు కిందకు వచ్చారు. ఇంత రాద్దాంత జరిగినా, ఢిల్లీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. అయితే, ఇక్కడున్న నిరసన కారుల్ని బలవంతంగా తమిళనాడుకు పంపించేందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
అరుణ్ జైట్లీతో భేటీ : ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌లతో విశాల్, ప్రకాష్‌రాజ్‌లతో కూడిన బృందం భేటీ అయ్యాయి. మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. తమిళనాడులోని పరిస్థితులు, అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వివరాలతో వినతి పత్రాన్ని సమర్పించారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.