బాధ్యత గుర్తించాలి
రైతు వ్యతిరేక ధోరణి ఉన్నవారు ఆర్ధికమంత్రులవుతారో, ఆ పదవి తీసుకున్న వారు అలా మారతారో చెప్పడం కష్టం. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రైతు రుణాల మాఫీపై చేసిన ప్రకటన అలాంటి సందేహాన్ని రేకెత్తిస్తోంది. రుణమాఫీ సంగతిని రాష్ట్రాలే చూసుకోవాలని, అందుకోసం కేంద్రం ఎలాంటి సాయమూ చేయబోదని ఒక సమావేశంలో సోమవారం ఆయన చెప్పారు. రైతు రుణాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు ప్రక్రియ ప్రారంభించాక తమకూ అమలు చేయాలంటూ వేర్వేరు రాష్ట్రాల్లో రైతులు ఉద్యమిస్తున్నారు.
త్వరలో ఎన్నికలు జరగ బోతున్న కర్ణాటకలో బీజేపీ సైతం అలాంటి డిమాండే చేస్తోంది. యూపీ ఎన్ని కల్లో బీజేపీ చేసిన ఈ వాగ్దానాన్ని అక్కడి రాష్ట్ర నేతలే ప్రచారం చేసి ఉంటే ఎలా ఉండేదోగానీ ప్రధాని నరేంద్ర మోదీ నోటి వెంబడి రావడంతో తేనెతుట్టె రేగింది. రుణమాఫీ రాష్ట్ర బీజేపీ వాగ్దానం మాత్రమేనంటూ ఇస్తున్న సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచడం లేదు. పర్యవసానంగా పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు బయల్దే రాయి. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన పరిస్థితిని చక్కదిద్దకపోగా దాన్ని మరింత తీవ్రం చేస్తుంది.
నిజానికి జైట్లీ చేసిన ప్రకటనలో కొత్తేమీ లేదు. కేంద్రం గతంలోనూ ఆ సంగతి చెప్పింది. అయితే తమ పార్టీయే యూపీలో హామీ ఇవ్వడం, ప్రభుత్వం ఏర్పాటు చేశాక దాని అమలుకు పూనుకోవడం, కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో సైతం దాని అమలు కోసం డిమాండ్ చేయడం పర్యవసానంగా కొత్త పరిస్థితి తలెత్తింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం 2014 ఎన్ని కల్లో ఇలాగే హామీ ఇచ్చింది. దాన్ని మోదీ సమక్షంలో అనేక సభల్లో చంద్ర బాబునాయుడు పదే పదే చెప్పారు.
అమలులో బాబు ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యాక సహజంగానే తెలుగుదేశంతోపాటు బీజేపీపై కూడా ఆ మచ్చ పడింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ బాధ్యత రాష్ట్రాలదే అని చెప్పి చేతులు దులు పుకోవడం కాక మొత్తంగా రైతు సమస్య పట్ల స్పష్టతనివ్వాలి. రాష్ట్రాలదే బాధ్య తని చెప్పడం వల్ల అవి మహా అయితే మార్కెట్‌లో బాండ్లు విడుదల చేయడం ద్వారా నిధులు సమీకరించుకుని రుణమాఫీ చేపడతాయి. అన్ని రాష్ట్రాలూ ఆ పని చేస్తే ఇప్పటికే ఉన్న సర్కారీ రుణాల భారం అపరిమితంగా పెరిగిపోతుంది.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణ భారం స్థూల దేశీయోత్పత్తిలో 67 శాతంగా ఉంది. ఆసియా దేశాల్లో ఇదే అత్యధికం. ఇప్పుడు రాష్ట్రాలే రుణమాఫీ వనరులు చూసుకోవాలని చెప్పడంవల్ల ప్రతి రాష్ట్రమూ బాండ్లపై ఆధారపడుతుంది. వాటికి మళ్లీ కేంద్రమే పూచీ పడాల్సి వస్తుంది. ఇప్పటికే యూపీ రుణమాఫీకి అలా పూచీ ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి రైతు ఉద్యమం పర్యవసానంగా 40 లక్షలమంది చిన్న, సన్నకారు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇలాంటి రుణాలు దాదాపు రూ. 30,000 కోట్లని అంచనా వేసింది. అయినా ఆ ఉద్యమం ఆగలేదు. ఇక చేసేదేమీ లేక రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తానని అక్కడి సీఎం ఫడణవీస్ తాజాగా చెప్పకతప్పలేదు. ఉద్యోగులు, ఇతర వృత్తులు చేసుకుంటున్నవారు తదితరులను మినహాయిం చినా ఆ రుణాల మొత్తం కోటీ 40లక్షల రూపాయలు ఉండొచ్చనని ఒక అంచనా.
మరి ఈ మొత్తానికి కూడా కేంద్రం పూచీ పడుతుందా? అలా పూచీ పడితే ఇతర రాష్ట్రాలు తమకూ దాన్ని వర్తింపజేయాలని ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం లేదా? మధ్యప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఇప్ప టికే కొంత తేడాతో రుణమాఫీ దిశగా అడుగులేస్తున్నాయి. వీటన్నిటినీ గమనిస్తే ప్రస్తుతం అయిదు లక్షల కోట్ల మేర ఉన్న రాష్ట్రాల వార్షిక ద్రవ్యలోటు దాదాపు 8 లక్షల కోట్లు దాటేలా ఉంది. రాజ్యాంగంలోని 293(3) అధికరణ ప్రకారం రాష్ట్రాలు అదనంగా రుణాలు సేకరించాలంటే కేంద్రం ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు అరుణ్‌జైట్లీ సమస్యంతా రాష్ట్రాలదేనని చెప్పడం వల్ల ఏం పరిష్కార మైనట్టు? తిరిగి తిరిగి అది మళ్లీ కేంద్రం ముంగిటకే రాక తప్పదని జైట్లీకి తెలియదనుకోవాలా?
సాగు దిగుబడులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటే, దళారులు రైతులను పీల్చిపిప్పి చేసే స్థితిని నివారిస్తే రుణమాఫీ కావాలని రైతులు అడగరు. ప్రభుత్వాలు ఆ విషయంలో విఫలం కాబట్టే... విత్తనాలు మొదలుకొని ఎరు వులు, పురుగుల మందులు ఆకాశాన్నంటుతుండటంవల్లే రైతులు రుణాలు తీర్చలేకపోతున్నారు. ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు ఆత్మహత్యల గణాంకాలను గమనిస్తే సగటున ప్రతి 41 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని లెక్కేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర కావాలనడం గొంతెమ్మ కోర్కేమీ కాదు. 2014 ఎన్నికల్లో స్వయంగా బీజేపీయే తన మేనిఫెస్టోలో దిగుబడికైన వ్యయంపై 50 శాతం అదనంగా లెక్కేసి గిట్టుబాటు ధరను నిర్ణయిస్తామని చెప్పింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో సగటు రైతు వార్షికాదాయం రూ. 20,000 మించడం లేదని గత ఏడాది కేంద్రం విడుదల చేసిన ఆర్ధిక సర్వే చెప్పింది.
ఇంత తక్కువ ఆదాయంతో ఆ రైతు కుటుంబాలు ఎలా బతకాలో, తిరిగి వ్యవసాయంపై పెట్టుబడులెలా పెట్టాలో విధాన నిర్ణేతలు ఆలోచించవద్దా? రైతులు ఎప్పటికీ సంఘటితం కాలేరన్న ధీమా నేతలకు ఉండొచ్చు. మన దేశంలో ఉన్న కులాల అంతరాల వల్ల, రైతుల్లో అక్షరాస్యత పెద్దగా లేకపోవడంవల్ల వారికా ధీమా ఏర్పడి ఉండొచ్చు. కానీ పరిస్థితి మునుపటిలా లేదు. ఎక్కడో కోనసీమ రైతు నాలుగేళ్లక్రితం ఆగ్రహంతో అమలు చేసిన ‘సాగు సమ్మె’ మరింత తీవ్ర రూపంతో ఇటీవల మహారాష్ట్రను గడగడలాడించింది. పర్యవసానంగా అక్కడి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కనుక రుణమాఫీ సరైన మార్గం కాదనుకుంటే దాని ప్రత్యామ్నాయాల విషయంలో ఏం ఆలోచిస్తున్నదో కేంద్రం సమగ్రమైన ప్రకటన చేయాలి. తప్పించుకునే ధోరణి వల్ల సమస్య మరింత జటిలమవు తుందని గుర్తించాలి.