Devon Ke Dev Mahadev
-
చైనాలో మన సీరియళ్లకు ఫుల్ డిమాండ్!
ఇటీవల రాజకీయ విభేదాల వల్ల భారత్-చైనా దౌత్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మన పొరుగుదేశంలో మన సీరియళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కిన మహాభారత్, దేవోంకా దేవ్ మహాదేవ్, నాగిన్ వంటి సీరియళ్లను చైనా వాసులు విపరీతంగా చూస్తున్నారు. దీంతో ఆ సీరియళ్లు చైనాలో సూపర్ హిట్ అయ్యాయని ఆ దేశ ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. "భారతీయ పురాణాలు నాకు ఎంతగానో నచ్చుతాయి. వాటి తత్వం, విశాల ప్రాపంచిక దృక్పథం అబ్బురపరిచేలా ఉంటాయి. అవి నాకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి' అని 29 ఏళ్ల యాంగ్ బూహి తెలిపారు. గేమింగ్ పరిశ్రమలో పనిచేసే భుహి భారతీయ టీవీ సీరియళ్లకు చైనీస్ సబ్ టైటిల్స్ అందించే వాలంటీర్ గ్రూప్ లో పనిచేస్తున్నారు. 2011లో శివపురాణం ఆధారంగా తెరకెక్కిన దేవోంకా దేవ్ మహాదేవ్ సీరియల్ కు మొదట ఆమె పనిచేశారు. ఈ సీరియల్ లోని మొత్తం 820 ఎపిసోడ్లకు ఆమె చైనీస్ సబ్ టైటిల్స్ అందించారు. చైనాలోకి సీరియళ్లు దిగుమతి కావడం కొత్త కాదు. అమెరికా, దక్షిణ కొరియా, బ్రిటన్, జపాన్ నుంచి దిగుమతి అయిన సీరియళ్లను వారు బాగానే ఆదరిస్తారు. కానీ ఇటీవల కొత్తగా దిగుమతి అవుతున్న భారతీయ సీరియళ్లు కూడా చైనీయులను బాగా ఆకట్టుకుంటున్నాయని ఆ పత్రిక తెలిపింది. విద్యారంగంలో పనిచేసే క్వింగ్ క్వింగ్ (35) మాట్లాడుతూ భారతీయ నటులను నేను ఇష్టపడతాను. ఎంతగా అంటే డబ్బింగ్ చేయకుండా, చైనీస్ సబ్ టైటిల్స్ లేకుండా భారతీయ సీరియళ్లను చూస్తానని చెప్పారు. భారతీయ సీరియళ్ల అనువాదానికి చాలా సమయం పడుతుండటంతో వాటిని నేరుగా చూసేందుకు తాను ఇష్టపడతానని, సీరియళ్లలోని ప్రతినాయకులు సైతం అద్భుతంగా నటించి ఆకట్టుకుంటున్నారని ఆమె చెప్పారు. -
పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?
మీరు ప్రముఖమైన టీవీ నటులా? అయితే సోషల్ మీడియలో ఫొటోలు పెట్టే విషయంలో కాస్తా జాగ్రత్త ఉండండి! ఎందుకు అంటారా? ఈ విషయాన్ని సోనారికా భడోరియాను అడిగితే.. ఆమె బాగా చెప్పగలదు. 'దేవోన్ కా దేవ్ మహదేవ్' సీరియల్లో ఆమె పార్వతి పాత్రలో నటించింది. పార్వతిగా ఆమె ప్రేక్షకుల మదిలో ముద్రపడినట్టు ఉంది. ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకొని ఇప్పటికీ మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విహారయాత్రకు వెళ్లిన ఆమె కొన్ని ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. నీలి అలల తీరంలో సముద్ర ఒడ్డున ఆమె బికినీలో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. దీనిపై కొందరు ఆమె అభిమానులు నొచ్చుకున్నారు. ఇదేమిటి? శివుడి ఇల్లాలైన పార్వతీదేవిగా ఎంతో పవిత్రమైన పాత్రలో కనిపించి.. ఇప్పుడిలా కురచ దుస్తులు వేసుకోవడమేమిటని పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె తీరును తప్పుబడుతూ విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. దీంతో సోనిరిక స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 'నేను ఏ ప్రపంచంలో ఉన్నానో తెలియడం లేదు. పాశ్చాత్య దేశాల్లో బాడీషేమింగ్ (శరీరాకృతి గురించి విమర్శలు చేయడం)కు వ్యతిరేకంగా పోరాడుతుండగా ఇక్కడ బాడీ షేమింగ్ మాట పక్కనపెట్టండి. కనీసం బికినీ వేసుకున్నన్నా నేరంగా పరిగణిస్తున్నారు. కొన్ని నిమిషాల కిందట నేను బికినీలో దిగిన కొన్ని ఫొటోలను పెట్టాను. వాటిపై వస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు, శాపనార్థాలు తట్టుకోలేక వాటిని డిలీట్ చేస్తున్నాను. వాటన్నింటినీ నేను విస్మరించవచ్చు. కానీ అంత ప్రతికూలతను భరించే పరిపక్వత నాకు రాలేదు. అందుకే ఫొటోలను తీసేశాను' అని ఆమె పేర్కొన్నారు.