చీటింగ్ కేసులో బండ్ల గణేష్‌కు నోటీసులు
హైదరాబాద్ : చీటింగ్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు బుధవారం బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా హక్కుల విషయమై బండ్ల గణేశ్ తనను మోసం చేశారని ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ మొన్న హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గణేశ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనను పోలీసులు ఆదేశించారు. స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చిరించారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ సినిమా ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించాడు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరొకరికి గణేశ్ విక్రయించి వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడు.
ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా గణేశ్ స్పందించలేదు. పైగా ఫైనాన్సియర్‌ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు గణేశ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గణేశ్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే.