గోదావరికి వరదపోటు
కొవ్వూరు : గోదావరి నదికి మరోసారి వరద పోటు తగిలింది. ఎగువన గల ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం పెరిగింది. దీంతో ఆది వారం సాయంత్రం 1,72,420 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు వచ్చిచేరే ప్రవాహ జలాల్లో పెరుగుదల కనిపించడంతో సోమవారం సాయంత్రం ఆరుగంటల నుంచి 2,46, 268 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సోమవారం సాయంత్రం 6 గంటలకు 9 అడుగుల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం ఆర్మ్లోని 70గేట్లను అరమీటరు, మద్దూరు, విజ్జేశ్వరం, ర్యాలీ ఆర్మ్ గేట్లను 0.60 మీటర్ల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 9,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
నీటి విడుదల కుదింపు
జిల్లాలో భారీ వర్షాలు కురవడం, పేముల కాలువ పొగటంతో పంటలు ముంపుబారిన పడ్డాయి. దీంతో పశ్చిమ డెల్టాకాలువకు సోమవారం ఉదయం నుంచి నీటి విడుదలను భారీగా కుదించారు. ఆదివారం సాయంత్రం 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు సోమవారం ఉదయం నుంచి 2 వేల క్యూసెక్కుల మాత్రమే విడుదల చేస్తున్నారు. చాగల్లు మండలంలో పేముల కాలువ పరీవాహక ప్రాంతంలో సుమారు 1,500 ఎకరాలు పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన రైతులు, ఎమ్మెల్యే కేఎస్ జవహర్ తో కలిసి ఆర్డీవో బి.శ్రీనివాసరావును కలిశారు. దీంతో నీటి విడుదలను కుదించారు. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో నీటిమట్టం అధికంగా ఉండటంతో అప్పారావు కాలువను పేముల కాలువ నీరు దిగువకు తీసుకోవడం లేదు. దీంతో పశ్చిమ డెల్టాకాలువ నీటి విడుదల తగ్గించాలని రైతులు కోరారు. ఈ మేరకు నీటి విడుదలను భారీగా తగ్గించినట్లు శెట్టిపేట ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. మధ్యాహ్నం నుంచి 3,500 క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచినట్లు ఆయన వెల్లడించారు. క్రమేణా దిగువన కాలువల పరిస్థితులను తెలుసుకుని సాయంత్రానికి 5,500 క్యూసెక్కులకు పెంచనున్నట్టు ఆయన వివరించారు.
కాలువలకు భారీగా నీటి విడుదల తగ్గింపు
జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న కాలువలకూ సోమవారం ఉదయం నుంచి
అధికారులు నీటి విడుదలను భారీగా తగ్గించారు. ఏలూరు కాలువకు 1,133 క్యూసెక్కుల నుంచి
683 క్యూసెక్కులకు, ఉండి కాలువకు 1,826 నుంచి 704 క్యూసెక్కులకు నరసాపురం (కాకరపర్రు) కాలువకు 1,983 నుంచి 1,437కు జీ అండ్ వీ (గోస్తనీ) 636 నుంచి 297కు, అత్తిలి (గొడిచర్ల) కాలువకు 677 నుంచి 559 క్యూసెక్కులకు తగ్గించారు. సాయంత్రం నుంచి మళ్లీ క్రమేణా నీటివిడుదల పెంచుతామని అధికారులు చెబుతున్నారు. కాలువలకు నీటి విడుదల పూర్తిగా తగ్గించడంతో కాలువల్లో ప్రవాహ వేగం తగ్గింది.