డైట్‌సెట్ ఎప్పుడు?
రెండు నెలలుగా ఫైలును పెండింగ్‌లో పెట్టిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సుల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు నిర్వహించే డైట్‌సెట్ నోటిఫికేషన్ ఇంతవరకు జారీ కాలేదు. రాష్ట్రంలోని 258 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు, 10 ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ(డైట్) సంస్థల్లో ప్రవేశాల కోసం లక్షన్నర మంది విద్యార్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇందుకోసం విద్యా శాఖ పంపించిన ఫైలును ప్రభుత్వం పక్కనపెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డీఎడ్ ప్రవేశాల కోసం తెలంగాణ డైట్‌సెట్-2015 నిర్వహణకు అనుమతించాలని, డైట్‌సెట్ కన్వీనర్ నియామకానికి ఆమోదం తెలియజేయాలని విద్యా శాఖ నుంచి రెండు నెలల కిందటే సర్కారుకు ఫైలు అందినా.. ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు.
దీంతో ఈసారి డైట్‌సెట్‌ను నిర్వహిస్తారా.. లేదా అన్న అనుమానాలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. అంతేకాదు ఈ ఏడాది ప్రవేశాలే చేపట్టకుండా జీరో ఇయర్‌గా కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైట్‌సెట్ నిర్వహణపై ఏదో ఒకటి త్వరగా తేల్చాలని విద్యార్థులు కోరుతున్నారు. డైట్‌సెట్ కోసం ఎదురుచూస్తూ మరే కోర్సుల్లో చేరక.. విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.