ఆయనో భ‘వనమాలి’
మేడపైనే ఆయన పెరడు ∙పూలూ, కూరలూ బోలెడు
రాజమహేంద్రవరం రూరల్ :
ఇల్లంటే.. ఇటుకలూ, కాంక్రీటూ, తలుపులూ, కిటికీలుండి, కొన్ని రంగుల్ని అద్దుకునే కట్టడమే కాదు.. కాసింత పచ్చదనాన్నీ సంతరించుకోవాలనుకునే వారు చాలామందే ఉంటారు. ఏవైనా మెుక్కలు పెంచాలన్న మక్కువా ఉంటుంది. అయితే అలా పెంచి తృప్తిని సొంతం చేసుకునే అవకాశం అందరికీ ఉండదు. ఎందుకంటే.. ఎందరో ఫ్లాట్లలో లేదా పెరడు లేని ఇళ్లలో నివసిస్తున్న ఈరోజుల్లో మెుక్కలు పెంచాలన్న తపన ఉన్నా ఆచరణలో సాధ్యం కాదు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరనగర్కు చెందిన సవిరిగాని కృష్ణమూర్తికీ మెుక్కల పెంపకమంటే ప్రీతి. ఆయన ఇంటికీ పెరడులేదు. అలాగని.. ‘చేసేదేముందిలే’ అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. డాబాపై భాగాన్నే పెరడును సృష్టించుకున్నారు. వివిధ రకాలు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పూలూ పూయిస్తున్నారు. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని పెద్దకుమార్తె ఇంటికి వెళ్ళారు. అక్కడ పక్కనున్న డాబాపై కూరగాయలు సాగు చేయడాన్ని చూసిన కృష్ణమూర్తి అదే స్ఫూర్తితో తానూ భ‘వనాని’కి శ్రీకారం చుట్టారు. పొడవాటి తొట్టెలను తయారు చేయించారు. వాటితో పాటు డబ్బాలు, కుండీలలో మట్టిని నింపి, సేంద్రియ ఎరువులను వేసి బెండ, వంగ, బీర, కాకర, దోస, చిక్కుడు, గోరుచిక్కుడు, బొబ్బరచిక్కుడు, పచ్చి మిరప వంటి మెుక్కలూ, పాదులూ పెంచుతున్నారు. తోటకూర, గోంగూర, బచ్చలి, కొత్తిమీర వంటి ఆకుకూరలనూ పండిస్తున్నారు. కరివేపాకు మొక్కలనూ పెంచారు. అనేక రకాల పూలమెుక్కలతో పాటు పూజ కోసం తమలపాకులను సైతం పండిస్తున్నారు. ఉదయం లేవగానే భ‘వనమాలి’గా మొక్కల సంరక్షణే ఆయన వ్యాపకం. ఆ కృషిలో భార్య దుర్గ చేదోడుగా ఉంటారు. కృష్ణమూర్తి దంపతులు రెండేళ్లుగా తమ కూరల ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడమే కాక.. ‘మేడ మీది పెరడు’లో కాసిన వాటిని ఇరుగుపొరుగుకూ, బంధుమిత్రులకూ ఇస్తున్నారు.