కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించకండి
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎన్నికల నిర్వహణపై ఆయన మంగళవారం సమీక్షించారు.
డీఐజీ మాట్లాడుతూ ఈ నెల 30న జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయన్నారు. వీటి తర్వాత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఇప్పటి నుంచే మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించాలని సూచించారు.
ఒత్తిళ్లకు తలొగ్గకండి
ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డీఐజీ బాలకృష్ణ పోలీసులకు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రాజకీయ నాయకులను పోలీసులెవరైనా కలిసినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.
ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఏఆర్ ఏఎస్పీ శేఖర్, డీఎస్పీలు కమలాకర్‌రెడ్డి, హరినాథరెడ్డి, రాఘవరెడ్డి, ఏఆర్ డీఎస్పీ దేవదాస్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ అధికారులు పాల్గొన్నారు.