శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3వేల మంది బందోబస్తు
– డీఐజీ ప్రభాకరరావు
సాక్షి, తిరుమల: అక్టోబరు 3 నుండి 11వ తేది వరకు జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకరరావు వెల్లడించారు. బుధవారం ఆయన తిరుపతి అర్బన్జిల్లా ఎస్పి జయలక్ష్మితో కలసి తిరుమలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి భక్తుల రద్దీ అధికంగా వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈసారి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. టీటీడీ సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఏ ఒక్క చోటా తోపులాట లేకుండా పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. గరుడ సేవతోపాటు అవసరాన్ని బట్టి భద్రతా చర్యలు పెంచుతామన్నారు.