విద్యార్థినిల మృతిపై సమగ్ర దర్యాప్తు
కడప: కడప నగర శివార్లలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఈనెల 17న విద్యార్థినులు సాయి మనీషా, నందినిల మృతిపై సమగ్రంగా విచారించి త్వరలో నిజానిజాలు వెల్లడిస్తామని కడప, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎస్పీ, డీఎస్పీలు స్వయంగా వెళ్లి పరిశీలించారన్నారు. ఈ నెల 18న తాను కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించానన్నారు. ఈ వ్యవహారం బాలికల విషయం కాబట్టి ప్రొద్దుటూరు మహిళా డీఎస్పీ పూజిత నీలంను ప్రత్యేకంగా విచారణ కోసం నియమించామన్నారు. సహాయంగా ఎస్సీ ఎస్టీ సెల్, కడప ఇన్‌ఛార్జి డీఎస్పీ ఎల్.సుధాకర్‌ను నియమించామన్నారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పంచాయతీదారులు, విద్యార్థినిల తల్లిదండ్రుల సమక్షంలోనే ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహాలను కిందకు దించామని, నందినికి సంబంధించిన నోటు పుస్తకంలో రాసుకున్న సూసైడ్ నోట్‌ను సీజ్ చేశామని చెప్పారు. ఆ గదిలో ఉంటున్న వారిని పిలిపించి విచారిస్తామన్నారు. నందిని సూసైడ్ నోట్‌ను పూర్తిగా బహిర్గత పరచలేమని, వారి తల్లిదండ్రులతో సంప్రదించి తెలియజేస్తామని చెప్పారు. నారాయణ విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు జరిగిన మరణాలపై ఐఏఎస్ స్థాయి అధికారి విచారిస్తున్నారని వివరించారు. అదే గదిలో ఉంటున్న సహ విద్యార్థిని 5.30 గంటలకు వెళ్లినపుడు వారు గదిలోనే ఉన్నారని, తర్వాత కొద్దిసేపటికి ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.