అందని ద్రాక్షగా గోదావరి జలాలు
శుద్ధ జలాల కోసం ఎదురుచూస్తున్న మూడు మండలాల ప్రజలు
డీఫ్లోరైడ్ ప్రాజెక్టు ప్రారంభించి మూడు నెలలైనా గొంతు తడపని నీళ్లు
వెక్కిరిస్తున్న లీకేజీలు
శాయంపేట, న్యూస్‌లైన్ : లక్ష్యం ఎంత గొప్పదైనా చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం ఉండదని చెప్పడానికి మండలంలోని జోగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు మంచి ఉదాహరణ. ఏళ్లు గడుస్తున్నా శుద్ధి చేసిన గోదావరి జలాలు ప్రజల గొంతును తడపలేకపోతున్నాయి. మొదటి దశలో రూ. 9కోట్లతో పనులు ప్రారంభించిన అధికారులు అన్ని పనులు పూర్తయినట్లు ప్రకటించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆర్భాటంగా దీనిని ప్రారంభించారు.
అయితే అప్పటి నుంచే పనుల్లో నాణ్యత కూడా బయటపడుతూ ఉంది. ట్రయల్న్ ప్రారంభించి మూడు నెలల గడుస్తున్నా నీళ్లు లీకేజీల గండాన్ని దాటలేకపోతున్నాయి. దీంతో మూడు మండలాల్లోని 15 గ్రామాల ప్రజలకు గోదావరి జలాలు కలగానే మిగిలాయి. గోదావరి జలాలను శుద్ధిచేసి పరకాల, మొగుళ్లపల్లి, శాయంపేట మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీరు అందించాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జోగంపల్లి వద్ద డీఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మాణానికి 2009, ఫిబ్రవరి 19న శంకుస్థాపన చేశారు.
రూ.23కోట్లతో నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతిచ్చారు. మొదటి విడతగా రూ.9కోట్లు విడుదల చేశారు. 2011లోగా ఈ ప్రాజెక్టు పనులను పూర్తిచేసి ప్రజలకు తాగునీరందించాలని సూచించారు. కానీ గడువు పూర్తయినా పనులు మాత్రం పూర్తికాలేదు. కానీ ఈఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును అప్పటి ఎమ్మెల్యే గండ్ర హడావుడిగా ప్రారంభించారు. అలాగే రెండోదశలో మంజూరైన రూ.23 కోట్లతో తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు.
తీరా మోటార్లు స్టార్ట్ చేయగానే ఎక్కడికక్కడ లీకేజీలు బయటపడడంతో అధికారులు వెంటనే మోటార్లు ఆఫ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి ఇదే తంతు. దీంతో శుద్ధ జలం కోసం ఆశలు పెట్టుకున్న మూడు మండలాల ప్రజలకు నిరాశే మిగిలింది. అధికారులు వెంటనే లీకేజీలకు మరమ్మతులు చేయించి తాగునీరు అందించేందుకు కృష్టి చేయాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. కనీసం వచ్చే ఏడాది నాటికైనా గొంతు తడిపేలా కృషి చేయాలని ముక్తకంఠంతో అభ్యర్థిస్తున్నారు.