Direct Cash Transfer Scheme
-
నగదు బదిలీ అద్భుతం: ఐఎంఎఫ్
వాషింగ్టన్: కేంద్రం చేపట్టిన ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు నిజంగా అద్భుతమంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కొనియాడింది. అంతటి సువిశాల దేశంలో ఇంత భారీ పథకాలను అత్యంత కచ్చితత్వంతో అమలు చేయడం అద్భుతమేనని ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ పావులో మారో అన్నారు. ‘‘ఈ విషయంలో భారత్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సంక్టిష్ట సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వాడుకుంటూ ప్రపంచానికి భారత్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది’’ అని బుధవారం ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ పథకాల్లో చాలావరకు మహిళలకు సంబంధించినవే. మరికొన్ని వృద్ధులకు, రైతులకు ఉద్దేశించిన పథకాలూ ఉన్నాయి. వీటి సమర్థ అమలుకు ఆధార్‌ను చక్కగా వినియోగించుకోవడం అభినందనీయం’’ అన్నారు. కేంద్రం 2013 నుంచి ఇప్పటిదాకా రూ.24.8 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసింది. -
పచ్చి అబద్ధాలకు ఫుల్ స్టాప్ పడాలి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ చేయూత, పెన్షన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కావాలని అబద్ధపు ప్రచారం చేస్తున్న వారికి శాశ్వతంగా సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని స్పీకర్‌ను కోరారు. సంక్షేమ పథకాల ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై గురువారం శాసనసభలో చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పెన్షన్ల సొమ్మును రూ.3 వేలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని, 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని ఇవ్వడం లేదని వ్యాఖ్యానించడంపై సీఎం జగన్ స్పందించారు. మంచి చర్చను ఎప్పుడైనా స్వాగతించాల్సిందేనని, దుర్బుద్ధితో వక్రీకరించే చర్చ ముమ్మాటికీ తప్పేనన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ వెయ్యి రూపాయలనేది జగమెరిగిన సత్యమన్నారు. తాను సీఎం అయ్యాక మొట్ట మొదటి నెల నుంచే రూ.2,250 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత నాలుగేళ్ల పది నెలల పాటు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చి, రూ.2 వేలిచ్చామని గొప్పలు చెప్పుకోవడం మోసం కాదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వారికి, మాకు ఇదీ తేడా ► ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు (2018 అక్టోబర్ దాకా) టీడీపీ ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 44,32,592. ఇవాళ మా ప్రభుత్వం 61,94,000 మందికి పెన్షన్లు ఇస్తోంది. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. ► చంద్రబాబు హయాంలో పెన్షన్ బిల్లు నెలకు రూ. 500 కోట్లు కూడా లేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లే రూ.1,500 కోట్లు. ఇదీ.. ఆ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. ఎన్నికలప్పుడే వాళ్లకు ప్రజలు గుర్తుకొస్తారు. అందుకే ప్రజలు టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. సభా హక్కుల తీర్మానం ► శాసనసభలో ఉద్దేశ పూర్వకంగా అబద్ధాలాడుతూ, సభను తప్పుదారి పట్టిస్తున్న టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడిపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నా. ఇలాంటి వ్యక్తికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. ► రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు చెప్పి, ప్రజలకు కావాలని తప్పుడు సంకేతాలివ్వడాన్ని అనుమతించకూడదు. ఈ చర్యలను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇవ్వలేం. ప్రతిపక్షం పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తోంది. ► ఏం చేస్తామో ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. దాన్ని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి అమలు చేస్తున్నాం. ఇలా అబద్ధాలాడే వ్యక్తిని డ్రామా నాయుడు అనడంలో తప్పేంటి? ► సీఎం ప్రతిపాదించిన సభా హక్కుల తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం సమర్థించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. నేను చెప్పింది ఇదీ.. ► పాదయాత్రలో అనేక మంది బాధలు నా దృష్టికి వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించాం. చంద్రబాబులా వందల కొద్దీ కాకుండా, కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాం. అందులో ఉన్నదే చెప్పి ఓట్లు అడిగాం. ఈ విషయాన్ని గతంలోనూ అసెంబ్లీలో వివరించాను. ► 2018 సెప్టెంబర్ 3వ తేదీన పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ పథకాన్ని ఎలా మారుస్తామో నిజాయితీగా చెప్పాం. దాన్నే మేనిఫెస్టోలో పెట్టాం. సభా హక్కుల తీర్మానం కోసం సాక్ష్యంగా నేను ఆ రోజు పాదయాత్ర సభలో ఏం మాట్లాడానో వినండి. (మేనిఫెస్టోలో ఏం చెప్పారన్నది వీడియో ప్రదర్శించారు) ► ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలకు వైఎస్సార్ చేయూత పథకాన్ని తెస్తాం. అనారోగ్యంతో వాళ్లు వారం రోజులు పనులకు పోలేకపోతే పస్తులుండే పరిస్థితి. వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని గతంలో నేను చెప్పాను. కానీ దాన్ని వెటకారం చేశారు. ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలికాం. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దీన్ని అమలు చేస్తాం. 45 ఏళ్లు దాటిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు, కుటుంబాలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పూర్తి పారదర్శకతతో, ఎలాంటి లంచాలకు తావులేకుండా అందేట్టు చేస్తాం. మొదటి ఏడాది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలు పెడతాం. రెండో ఏడాది పూర్తిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, నాలుగు దశల్లో రూ.75 వేలు వచ్చేలా చేస్తాం. జూలై 8న పెన్షన్ రూ.2,500 చేస్తాం ► ప్రస్తుతం ఉన్న పెన్షన్ల వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పాం. అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూ పోతామని తెలిపాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.2,250 చేశాం. మళ్లీ దాన్ని జూలై 8న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రూ.2,500 చేస్తాం. చెప్పిన విధంగా ఆ తర్వాత రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాం. ► వైఎస్సార్ చేయూత పథకం కింద 24,55,534 మంది అక్క చెల్లెమ్మలకు, దాదాపు కోటి జనాభా(ఇంటికి నలుగురుని లెక్కిస్తే)కు మేలు చేస్తాం. వారికి అక్షరాల రూ.4,604 కోట్లు ఇస్తాం. ► మా పార్టీ వాళ్లు తప్పులు చేసినా కఠినంగానే వ్యవహరిస్తాం. ఈ వాస్తవాలన్నింటినీ వక్రీకరించే ఇలాంటి వ్యక్తికి సభలో శాశ్వతంగా మాట్లాడే హక్కు తీసేయాలి. -
ఆంధ్రప్రదేశ్ రైతులకూ నేరుగా సబ్సిడీ
న్యూఢిల్లీ: 14 రాష్ట్రాల్లో గత నెలలో కేంద్రం ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని వచ్చే నెలనుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు 5 రాష్ట్రాల్లో అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఎరువుల రాయితీని నేరుగా రైతుల ఖాతాలోకే ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రతియేటా రూ. 70వేల కోట్ల ఎరువులను కేంద్రం రైతులకు సబ్సిడీమీద అందజేస్తోంది. వచ్చే నెల నుంచి పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఏపీలోని రైతులకు ఈ డీబీటీ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. -
రేపటి నుండి ఏపీలో మళ్లీ నగదు బదిలీ
-
మళ్లీ ఆధార్‌తో ప్రత్యక్ష నగదు బదిలీ
న్యూఢిల్లీ: ఆధార్‌తో అనుసంధానించిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించే అంశంపై కేంద్రం శనివారం సమీక్షించింది. ప్రజలకు సబ్సిడీ పథకాల ప్రయోజనాలను అందించే వ్యవస్థను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆధార్ అనుసంధాన పథకాన్ని తిరిగిప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆధార్ ప్రాజెక్ట్‌పై ప్రధాని మోడీ శనివారం ఢిల్లీలో జరిపిన ఉన్నతస్థాయి సమీక్షలో, సబ్సిడీ పథకాల ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీకి ఆధార్ ను ప్రాతిపదికగా వినియోగించుకునే సాధ్యాసాధ్యాలపై చర్చించినట్టు తెలిసింది. మంత్రులు రాజ్‌నాథ్, రవిశంకర్ ప్రసాద్, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) డెరైక్టర్ జనరల్ విజయ్ ఎస్ మదన్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. విధినిర్వహణలో ప్రభుత్వ అధికారుల హాజరును ఆధార్ అనుసంధానంతో పర్యవేక్షించే అంశంపై కూడా వారు ఈ సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఈ నెల 14 నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించబోతున్నట్టు సమాచారం. -
వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు బిగించేందుకు యత్నం
-
పైరుకు వైర్ కట్
ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పేరుతో ఆ పథకం లక్ష్యాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంకు దర్శకత్వంలో ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నగదు బదిలీ పేరుతో కొన్ని యూనిట్లకే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేసి రైతులపైనా భారం మోపటంతో పాటు అంతిమంగా వ్యవసాయానికి మీటర్లు బిగించేందుకే ఈ తతంగం నడుస్తోంది. ఇందుకోసం ప్రపంచబ్యాంకు తయారుచేసిన ‘వ్యవసాయానికి నేరుగా నగదు బదిలీ’ ముసాయిదా నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నివేదికపై ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన జరిగిన సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహు పాల్గొన్నారు. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు తాము సిద్ధమని ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిసింది. దీనిని అమలులోకి తెస్తే.. రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా మీటర్లు బిగిస్తారు. వ్యవసాయానికి వినియోగించుకున్న కరెంటులో నిర్ణీత యూనిట్ల మేరకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని నిర్ణయిస్తారు. ఆ సబ్సిడీని కూడా.. రైతులు ముందుగా బిల్లు మొత్తం కట్టేయాలని, ఆ తర్వాత తాము సబ్సిడీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్తారు. ప్రస్తుతం వంట గ్యాస్ సబ్సిడీకి నగదు బదిలీ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు గ్యాస్ సిలిండర్‌కు పూర్తి మొత్తం చెల్లించాక.. సబ్సిడీ సొమ్మును బ్యాంకుల్లో జమచేస్తున్నారు. అయితే.. నెలలు గడుస్తున్నా గ్యాస్ సబ్సిడీ సొమ్ము బ్యాంకులో జమకావడం లేదు. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ అమలు చేస్తే ఇదే తరహాలో సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక అధ్యయనం పూర్తి..! ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ఇంధనశాఖ ప్రాథమిక అధ్యయనాన్ని పూర్తిచేసింది. నాలుగు నెలల కిందట ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి మృత్యుంజయ్సాహు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ) విద్యుత్ సౌధలోసమావేశమయింది. నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నగదు బదిలీ పథకం అమలు చేయాలంటే.. ప్రాథమికంగా ఏయే రైతు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలియాల్సి ఉంటుందని, ఇందుకోసం మీటర్లు బిగించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సమర్పించిన నివేదిక తేల్చింది. తద్వారా ఎంత విద్యుత్‌ను వినియోగించారనే విషయం తేలుతుందని.. మొదట రైతు బిల్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అనంతరం ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంటులోకి సబ్సిడీని జమ చేయవచ్చునని చెప్పింది. అంటే కరెంటు భారాన్ని మొదట రైతు చెల్లించిన తర్వాతే సబ్సిడీ వస్తుందన్నమాట. రైతులపైనా భారం వేసేందుకే..! రాష్ట్రంలో 31.5 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేవు. కేవలం గుండుగుత్తగా ఇంత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని లెక్కిస్తూ.. ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే.. నగదు బదిలీ పథకం అమలుకు ఇది అడ్డంకిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేకపోవటంతో ఫలానా రైతు కచ్చితంగా ఎంత విద్యుత్‌ను వినియోగించాడనే విషయం తెలియడం లేదు. ప్రస్తుతం ఉచిత విద్యుత్ వినియోగాన్ని ఈ విధంగా లెక్కిస్తున్నారు.. 5 హార్స్ పవర్ (హెచ్‌పీ) మోటారు రోజుకు 7 గంటలు విద్యుత్‌ను వినియోగిస్తే 5.25 యూనిట్ల విద్యుత్ కాలుతోందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదిలో 300 రోజులకు గాను ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ 1,575 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుందని అంచనా కట్టారు. ఇన్ని యూనిట్లకు గాను విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును లెక్కించి.. ఆ మొత్తం సబ్సిడీని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఇస్తోంది. అయితే.. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేకపోవటం వల్ల కచ్చితంగా ఇంత విద్యుత్‌ను వినియోగిస్తున్నారన్న లెక్కలు లేవు. నగదు బదిలీ పథకం పేరుతో వ్యవసాయానికి మీటర్లు బిగించడంతో పాటు కరెంటు బిల్లును మొదట రైతులు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. అదేవిధంగా మొత్తం భారాన్ని సబ్సిడీగా భరించలేమని.. కొన్ని యూనిట్ల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చి అంతకు మించితే మొత్తం బిల్లును రైతులే చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధనను కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల తరహాలోనే ఉచిత విద్యుత్‌కూ పరిమితులు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్ భారాన్ని రైతుపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నమాట. చంద్రబాబు బాటలోనే..! వాస్తవానికి విద్యుత్ పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రయివేటు పరం చేయాలని ప్రపంచ బ్యాంకు ఎప్పటి నుంచో చెప్తోంది. ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా బ్యాంకు వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ఉచిత విద్యుత్ పథకానికి ప్రపంచ బ్యాంకు ఒప్పుకోదని.. అందుకే ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే.. 2004 ఎన్నికల అనంతరం ప్రపంచ బ్యాంకు పెత్తనాన్ని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యతిరేకించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటీకరించబోమని తేల్చిచెప్పారు. కానీ ఆయన మరణానంతరం తిరిగి రాష్ట్ర విద్యుత్ రంగంపై ప్రపంచ బ్యాంకు పెత్తనం చేయటం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పేరుతో మీటర్లు బిగించడం ద్వారా పరిమితులు విధించాలని కుట్ర పన్నిందనే విమర్శలు ఉన్నాయి. తీవ్రంగా ప్రతిఘటిస్తాం ప్రజలకు అందిస్తున్న సబ్సిడీలను ఎగవేసేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చింది. ఇందుకు ఉదాహరణ వంట గ్యాస్‌కు నగదు బదిలీ. గ్యాస్‌కు నగదు బదిలీ పేరుతో 50 రూపాయల వ్యాట్‌ను ప్రజలపై రుద్దారు. నగదు బదిలీ విధానంలో ధరలను పెంచేందుకు, సబ్సిడీలకు కోత పెట్టేందుకూ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం రూ. 3,000 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీని వర్తింపచేస్తే.. అన్ని పంపుసెట్లకు మీటర్లు పెట్టాలి. మీటరు రీడింగ్‌ను బట్టి చార్జీ వేస్తారు. ఉదాహరణకు ఒక రైతు రూ. 200 చెల్లిస్తే.. నగదు బదిలీగా మొదటి నెలలో రూ. 200 ఇస్తారు. ఆ తర్వాత నెలలో కేవలం రూ. 150 ఇస్తారు. దానిని తర్వాత 100 రూపాయలకు తగ్గిస్తారు. ఆ తర్వాత 50 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఆనక పూర్తిగా ఎగవేస్తారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేయాలని ప్రపంచ బ్యాంకు చాలా సీరియస్‌గా ఉంది. నాగార్జునసాగర్ ఆధునీకరణకు ఇచ్చిన రుణంలో ప్రపంచ బ్యాంకు విధించిన మొదటి షరతు ఉచిత విద్యుత్ ఎత్తివేయడం. ఇందుకు కిరణ్ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో రైతుసంఘాలు తీవ్ర ఉద్యమాన్ని చేపడతాం. - సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు ‘ఉచిత’ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడ ప్రస్తుతం వ్యవసాయంలో ఎవరు ఎంత వినియోగిస్తున్నారనే లెక్కలు లేవు. ఎందుకంటే మీటర్లు లేవు కాబట్టి. నగదు బదిలీ పథకం పేరుతో మీటర్లు పెట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. తర్వాత దీనికి రైతులను అలవాటు చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. వాస్తవానికి రైతులు అడుగుతున్నవి ఇవి కాదు. వారికి నాణ్యమైన కరెంటు రావడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు పాడైతే బాగు చేసేవారు లేరు. లో-ఓల్టేజీ, లైన్లు తెగిపోవడం వంటి సమస్యలున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు? మొత్తంగా ఇది రైతుకు ఉపయోగపడదని వారికి (ప్రభుత్వానికి) కూడా తెలుసు. ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకే ఈ ప్రయత్నాలని అర్థమవుతోంది. - నర్సింహారెడ్డి, చేతన సొసైటీ వ్యవస్థాపకుడు