పచ్చి అబద్ధాలకు ఫుల్‌ స్టాప్‌ పడాలి | ASSEMBLY SESSION: CM Jagan Slams On TDP Propaganda | Sakshi
Sakshi News home page

పచ్చి అబద్ధాలకు ఫుల్‌ స్టాప్‌ పడాలి

Published Fri, Dec 4 2020 4:43 AM | Last Updated on Fri, Dec 4 2020 4:43 AM

ASSEMBLY SESSION: CM Jagan Slams On TDP Propaganda - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ చేయూత, పెన్షన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కావాలని అబద్ధపు ప్రచారం చేస్తున్న వారికి శాశ్వతంగా సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని స్పీకర్‌ను కోరారు. సంక్షేమ పథకాల ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై గురువారం శాసనసభలో చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పెన్షన్ల సొమ్మును రూ.3 వేలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని, 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్‌ ఇస్తామని ఇవ్వడం లేదని వ్యాఖ్యానించడంపై సీఎం జగన్‌ స్పందించారు. మంచి చర్చను ఎప్పుడైనా స్వాగతించాల్సిందేనని, దుర్బుద్ధితో వక్రీకరించే చర్చ ముమ్మాటికీ తప్పేనన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు ఇచ్చిన పెన్షన్‌ వెయ్యి రూపాయలనేది జగమెరిగిన సత్యమన్నారు. తాను సీఎం అయ్యాక మొట్ట మొదటి నెల నుంచే రూ.2,250 పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత నాలుగేళ్ల పది నెలల పాటు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చి, రూ.2 వేలిచ్చామని గొప్పలు చెప్పుకోవడం మోసం కాదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

వారికి, మాకు ఇదీ తేడా
► ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు (2018 అక్టోబర్‌  దాకా) టీడీపీ ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 44,32,592. ఇవాళ మా ప్రభుత్వం 61,94,000 మందికి పెన్షన్లు ఇస్తోంది. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి.
► చంద్రబాబు హయాంలో పెన్షన్‌ బిల్లు నెలకు రూ. 500 కోట్లు కూడా లేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లే రూ.1,500 కోట్లు. ఇదీ.. ఆ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. ఎన్నికలప్పుడే వాళ్లకు ప్రజలు గుర్తుకొస్తారు. అందుకే ప్రజలు టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు.
సభా హక్కుల తీర్మానం
► శాసనసభలో ఉద్దేశ పూర్వకంగా అబద్ధాలాడుతూ, సభను తప్పుదారి పట్టిస్తున్న టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడిపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నా. ఇలాంటి వ్యక్తికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు.
► రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు చెప్పి, ప్రజలకు కావాలని తప్పుడు సంకేతాలివ్వడాన్ని అనుమతించకూడదు. ఈ చర్యలను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్‌ తరాలకు మంచి సందేశం ఇవ్వలేం. ప్రతిపక్షం పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తోంది.
► ఏం చేస్తామో ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. దాన్ని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి అమలు చేస్తున్నాం. ఇలా అబద్ధాలాడే వ్యక్తిని డ్రామా నాయుడు అనడంలో తప్పేంటి?
► సీఎం ప్రతిపాదించిన సభా హక్కుల తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సమర్థించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు.
నేను చెప్పింది ఇదీ..
► పాదయాత్రలో అనేక మంది బాధలు నా దృష్టికి వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించాం. చంద్రబాబులా వందల కొద్దీ కాకుండా, కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాం. అందులో ఉన్నదే చెప్పి ఓట్లు అడిగాం. ఈ విషయాన్ని గతంలోనూ అసెంబ్లీలో వివరించాను.
►  2018 సెప్టెంబర్‌ 3వ తేదీన పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఈ పథకాన్ని ఎలా మారుస్తామో నిజాయితీగా చెప్పాం. దాన్నే మేనిఫెస్టోలో పెట్టాం. సభా హక్కుల తీర్మానం కోసం సాక్ష్యంగా నేను ఆ రోజు పాదయాత్ర సభలో ఏం మాట్లాడానో వినండి. (మేనిఫెస్టోలో ఏం చెప్పారన్నది వీడియో ప్రదర్శించారు)
► ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని తెస్తాం. అనారోగ్యంతో వాళ్లు వారం రోజులు పనులకు పోలేకపోతే పస్తులుండే పరిస్థితి. వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని గతంలో నేను చెప్పాను. కానీ దాన్ని వెటకారం చేశారు. ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వైఎస్సార్‌ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలికాం.
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దీన్ని అమలు చేస్తాం. 45 ఏళ్లు దాటిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు, కుటుంబాలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పూర్తి పారదర్శకతతో, ఎలాంటి లంచాలకు తావులేకుండా అందేట్టు చేస్తాం. మొదటి ఏడాది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలు పెడతాం. రెండో ఏడాది పూర్తిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, నాలుగు దశల్లో రూ.75 వేలు వచ్చేలా చేస్తాం.

జూలై 8న పెన్షన్‌ రూ.2,500 చేస్తాం
► ప్రస్తుతం ఉన్న పెన్షన్ల వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పాం. అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూ పోతామని తెలిపాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ రూ.2,250 చేశాం. మళ్లీ దాన్ని జూలై 8న మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రూ.2,500 చేస్తాం. చెప్పిన విధంగా ఆ తర్వాత రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాం.
► వైఎస్సార్‌ చేయూత పథకం కింద 24,55,534 మంది అక్క చెల్లెమ్మలకు, దాదాపు కోటి జనాభా(ఇంటికి నలుగురుని లెక్కిస్తే)కు మేలు చేస్తాం. వారికి అక్షరాల రూ.4,604 కోట్లు ఇస్తాం.
► మా పార్టీ వాళ్లు తప్పులు చేసినా కఠినంగానే వ్యవహరిస్తాం. ఈ వాస్తవాలన్నింటినీ వక్రీకరించే ఇలాంటి వ్యక్తికి సభలో శాశ్వతంగా మాట్లాడే హక్కు తీసేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement