Winter Assembly sessions
-
బెళగావిలో ఇక సెగలే
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): భిన్న సంస్కృతులకు వేదికైన బెళగావిలోని రెండో అసెంబ్లీ భవనం సువర్ణసౌధ శీతాకాల శాసనసభ సమావేశాలకు ముస్తాబైంది. సోమవారం ఉదయం నుంచి పదిరోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం, విపక్ష నేతలు, మంత్రులు సహా ఉన్నతాధికారులు బెళగావికి చేరుకున్నారు. బొమ్మై సీఎం అయ్యాక జరుగుతున్న రెండో అసెంబ్లీ సమావేశాలు కాగా, అనేక ముఖ్య అంశాలతో సర్కారుపై దాడికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సమస్య, మేకెదాటు ఆనకట్ట, బిట్కాయిన్ల స్కాం, వరదల్లో జనం నష్టపోవడం, నిత్యావసర ధరల పెంపు ఇలా అనేక వైఫల్యాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ధీమాగా ఉన్నారు. కమీషన్ల ఆరోపణలు.. రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో 40 శాతం కమీషన్ నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజాపనులు, జలవనరుల శాఖలపై ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదమయం అయ్యాయి. అక్కడి ప్రజలకు పరిహారం అందజేయడంతో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తనున్నారు. రాష్ట్రంలో సుమారు 35 వేల ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇప్పటికి రూ.204 కోట్ల పరిహారం విడుదల చేశారు. మత మార్పిడి చట్టం రగడ.. రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టం తెస్తామని సీఎం ప్రకటించడం వివాదాస్పదమైంది. పలు మత సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. సీఎం బొమ్మై మాత్రం కచ్చితంగా చట్టం చేస్తామని చెబుతున్నారు. తొలిరోజు నుంచే రభస జరిగేలా ఉంది. బెంగళూరు సమీపంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నమేకెదాటు ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఎందుకు అనుమతులను తెచ్చుకోవడం లేదనేది చర్చకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు మంగళవారం విడుదల కానున్న 25 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఈ సమావేశాలపై ప్రభావం చూపవచ్చు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. -
పచ్చి అబద్ధాలకు ఫుల్ స్టాప్ పడాలి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ చేయూత, పెన్షన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కావాలని అబద్ధపు ప్రచారం చేస్తున్న వారికి శాశ్వతంగా సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని స్పీకర్‌ను కోరారు. సంక్షేమ పథకాల ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై గురువారం శాసనసభలో చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పెన్షన్ల సొమ్మును రూ.3 వేలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని, 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని ఇవ్వడం లేదని వ్యాఖ్యానించడంపై సీఎం జగన్ స్పందించారు. మంచి చర్చను ఎప్పుడైనా స్వాగతించాల్సిందేనని, దుర్బుద్ధితో వక్రీకరించే చర్చ ముమ్మాటికీ తప్పేనన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ వెయ్యి రూపాయలనేది జగమెరిగిన సత్యమన్నారు. తాను సీఎం అయ్యాక మొట్ట మొదటి నెల నుంచే రూ.2,250 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత నాలుగేళ్ల పది నెలల పాటు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చి, రూ.2 వేలిచ్చామని గొప్పలు చెప్పుకోవడం మోసం కాదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వారికి, మాకు ఇదీ తేడా ► ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు (2018 అక్టోబర్ దాకా) టీడీపీ ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 44,32,592. ఇవాళ మా ప్రభుత్వం 61,94,000 మందికి పెన్షన్లు ఇస్తోంది. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. ► చంద్రబాబు హయాంలో పెన్షన్ బిల్లు నెలకు రూ. 500 కోట్లు కూడా లేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లే రూ.1,500 కోట్లు. ఇదీ.. ఆ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. ఎన్నికలప్పుడే వాళ్లకు ప్రజలు గుర్తుకొస్తారు. అందుకే ప్రజలు టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. సభా హక్కుల తీర్మానం ► శాసనసభలో ఉద్దేశ పూర్వకంగా అబద్ధాలాడుతూ, సభను తప్పుదారి పట్టిస్తున్న టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడిపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నా. ఇలాంటి వ్యక్తికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. ► రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు చెప్పి, ప్రజలకు కావాలని తప్పుడు సంకేతాలివ్వడాన్ని అనుమతించకూడదు. ఈ చర్యలను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇవ్వలేం. ప్రతిపక్షం పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తోంది. ► ఏం చేస్తామో ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. దాన్ని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి అమలు చేస్తున్నాం. ఇలా అబద్ధాలాడే వ్యక్తిని డ్రామా నాయుడు అనడంలో తప్పేంటి? ► సీఎం ప్రతిపాదించిన సభా హక్కుల తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం సమర్థించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. నేను చెప్పింది ఇదీ.. ► పాదయాత్రలో అనేక మంది బాధలు నా దృష్టికి వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించాం. చంద్రబాబులా వందల కొద్దీ కాకుండా, కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాం. అందులో ఉన్నదే చెప్పి ఓట్లు అడిగాం. ఈ విషయాన్ని గతంలోనూ అసెంబ్లీలో వివరించాను. ► 2018 సెప్టెంబర్ 3వ తేదీన పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ పథకాన్ని ఎలా మారుస్తామో నిజాయితీగా చెప్పాం. దాన్నే మేనిఫెస్టోలో పెట్టాం. సభా హక్కుల తీర్మానం కోసం సాక్ష్యంగా నేను ఆ రోజు పాదయాత్ర సభలో ఏం మాట్లాడానో వినండి. (మేనిఫెస్టోలో ఏం చెప్పారన్నది వీడియో ప్రదర్శించారు) ► ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలకు వైఎస్సార్ చేయూత పథకాన్ని తెస్తాం. అనారోగ్యంతో వాళ్లు వారం రోజులు పనులకు పోలేకపోతే పస్తులుండే పరిస్థితి. వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని గతంలో నేను చెప్పాను. కానీ దాన్ని వెటకారం చేశారు. ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలికాం. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దీన్ని అమలు చేస్తాం. 45 ఏళ్లు దాటిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు, కుటుంబాలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పూర్తి పారదర్శకతతో, ఎలాంటి లంచాలకు తావులేకుండా అందేట్టు చేస్తాం. మొదటి ఏడాది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలు పెడతాం. రెండో ఏడాది పూర్తిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, నాలుగు దశల్లో రూ.75 వేలు వచ్చేలా చేస్తాం. జూలై 8న పెన్షన్ రూ.2,500 చేస్తాం ► ప్రస్తుతం ఉన్న పెన్షన్ల వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పాం. అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూ పోతామని తెలిపాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.2,250 చేశాం. మళ్లీ దాన్ని జూలై 8న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రూ.2,500 చేస్తాం. చెప్పిన విధంగా ఆ తర్వాత రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాం. ► వైఎస్సార్ చేయూత పథకం కింద 24,55,534 మంది అక్క చెల్లెమ్మలకు, దాదాపు కోటి జనాభా(ఇంటికి నలుగురుని లెక్కిస్తే)కు మేలు చేస్తాం. వారికి అక్షరాల రూ.4,604 కోట్లు ఇస్తాం. ► మా పార్టీ వాళ్లు తప్పులు చేసినా కఠినంగానే వ్యవహరిస్తాం. ఈ వాస్తవాలన్నింటినీ వక్రీకరించే ఇలాంటి వ్యక్తికి సభలో శాశ్వతంగా మాట్లాడే హక్కు తీసేయాలి. -
బాబూ వంద కోట్ల ఫైన్ అప్పుడే మర్చిపోయారా..?
సాక్షి, అమరావతి: ఇసుక గురించి మాట్లాడే నైతికత చంద్రబాబుకి, టీడీపీ నేతలకి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత అయిదేళ్ల పాలనలో ఇసుకను బంగారంగా మార్చింది మీరు కాదా..?. టీడీపీ పాలనలో రాష్డ్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇష్టానుసారంగా దోచుకున్నారు. కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసానికి ఆనుకుని డ్రెడ్జర్లతో ఇసుక తవ్వేస్తే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల ఫైన్ విధించింది అది అప్పుడే మర్చిపోయారా. ఉచిత ఇసుక పాలసీ పేరుతో ఇసుకని దోచుకున్న మీరు ఎలా మాడ్లాడతారు. చదవండి: (ఏపీ అసెంబ్లీ: కీలక బిల్లులు ఆమోదం) మీ హయాంలో ప్రారంభమైన ఇసుక దోపిడీని అరికట్టడానికే మేము అనేక ప్రయత్నాలు చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వరుసగా వరదలు, తుఫాన్ల వల్ల ఇసుక వెలికితీయడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రతిపక్షంగా సూచనలివ్వాలి కానీ అసెంబ్లీ బయట ర్యాలీ పేరుతో డ్రామాలు కాదు. చచ్చిపోయిన టీడీపీని బ్రతికించుకోవడానికి ఇసుక పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. అన్నిలోపాలని అధిగమించి కొత్త ఇసుక పాలసీ ద్వారా అందరికీ ఇసుక దొరికేలా చర్యలు తీసుకుంటాం. మాది పారదర్శకమైన ప్రభుత్వం. అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. -
అన్ని విధాలా ఆదుకుంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుల పక్షం వహించి పనిచేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు వాటిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నివర్ తుఫాన్ ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నెల తిరక్కుండానే డిసెంబర్ 31న ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రంగు మారిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్నీ గ్రేడెడ్ ఎంఎస్పీ విధానంలో కొనుగోలు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రైతుల తరపున చంద్రబాబు మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు’’ అని జగన్ స్పష్టంచేశారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఎక్కడ తుపాన్ వచ్చినా, ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా వెంటనే రోడ్డు మార్గంలోనే వెళ్లేవాడినని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌ను వదలటం లేదన్నారు. అందుకే సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని బుగ్గన పేరు పెట్టారని వ్యంగాస్త్రాలు విసిరారు. శాసనసభ ద్వారా రైతులకు ఏం చేయబోతున్నామో చెప్పబోతుంటే.. దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా డైరెక్షన్లో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, ఎల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపించడానికి కింద కూర్చుని నేలబారు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అనంతరం.. గత 18 నెలలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతుల మేలు కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలను సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఆ వివరాలివీ... చంద్రబాబు డ్రామా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎల్లో మీడియా.. చంద్రబాబు డ్రామాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎల్లో మీడియానేనని జగన్ విమర్శించారు. ‘‘చంద్రబాబు యాక్టర్ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లందరిదీ కధ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి, దుస్థితి. ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తోంది. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టం కాబట్టే ఈ డ్రామా. చంద్రబాబు ఎందుకంత రెచ్చిపోయారో ఆయనకే తెలియదు. వాళ్ల పార్టీ మనిషే నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఆయన లేవనెత్తిన అంశాలపై క్లారిఫికేషన్ ఇచ్చాం. దానిపై రామానాయుడే మాట్లాడాలి. కానీ చంద్రబాబు సడెన్‌గా లేచి నేను మాట్లాడతాననిన్నారు. అదెలా? అది కరెక్ట్ కాదని ఆయనక్కూడా తెలుసు. అయినా ఇలా రెచ్చిపోవటం ఆశ్చర్యకరం. నేను ఐదేళ్లుఉ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఎన్నడూ పోడియమ్‌లోకి రాలేదు. ఆ హుందాతనాన్ని ఎవరైనా అనుసరించాలి. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఆయనే పోడియమ్‌లోకి వచ్చాడు. ఇక రేపు పొద్దున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లలో బ్యానర్లు అవే. అంతేతప్ప రైతుల కోసం ముఖ్యమంత్రి ఏం చెప్పారు? రైతులకు ఏ రకంగా దీని వల్ల మంచి జరుగుతుంది అనేది ఉండదు. మా ఖర్మ!!. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థను ప్రతిపక్ష నాయకుడు నడుపుతున్నాడంటే నిజంగా సిగ్గుపడాలి’’ అని దుయ్యబట్టారు. అనుకోని విపత్తు వచ్చి... క్యాబినెట్లో నిర్ణయాలు కూడా తీసుకున్న సమయంలో అసెంబ్లీలో దీనిపై ఏం చర్చిస్తారన్నది అంతా చూస్తున్నారని, బాబు మాత్రం అదేమీ కనిపించకూడదని డ్రామా చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లలో లేని విధంగా అంతా సుభిక్షం... తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిందని, గతంలో ఎప్పుడూ లేనంతగా అన్ని రిజర్వాయర్లు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ అయ్యాయన్నారు. దురదష్టవశాత్తూ దీపం వెలుగు కింద చీకటి ఉన్నట్లు ఆగస్టు నుంచి నవంబరు వరకు అడపా దడపా కురిసిన వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగిందని, దాన్ని నిజాయితీగా సమీక్షించామని చెప్పారు. రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా, రైతులకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగులు వేస్తోందని చెప్పారు. రైతులకూ తనకూ మధ్య ఉన్న బలమైన ఆత్మీయ అనుబంధంతోనే ఇవన్నీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో నష్ట పరిహారం చెల్లించడం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి అని సీఎం స్పష్టంచేశారు. ‘‘ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్షరాలా రూ.143 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అక్టోబరు 27న చెల్లించాం. అక్టోబరు నెలలో వచ్చిన అ«ధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నవంబరు 17న ఒక నెల కూడా తిరక్క ముందే రూ.132 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చాం. నవంబరులో నివర్ తుపాను వల్ల పంటలకు, ఇళ్లకు, రోడ్లకు, చెరువులకు కూడా నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది’’ అని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల కోసం తీసుకున్న పలు నిర్ణయాలు ముఖ్యమంత్రి వివరించారు. అవి ఆయన మాటల్లోనే... ► భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రతి ఒక్కరికీ వారికి రూ.500 చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం. దీంతో ఒక ఇంట్లో నలుగురుంటే ఇంటికి రూ.2వేలు ఇచ్చినట్లు అవుతుంది. కానీ కొందరు ఈ ఆదేశాలు వచ్చేసరికే శిబిరాల నుంచి ఇళ్లలోకి వెళ్లిపోయారు. వారందరికీ ఇళ్లకు వెళ్లి డబ్బులిస్తాం. ► పంట నష్టాలన్నింటినీ డిసెంబరు 15 నాటికి మదింపు చేసి, పరిహారాన్ని డిసెంబరు 31లోగా రైతులకు ఇవ్వబోతున్నాం. ఇది కూడా కరెక్టుగా చూస్తే నెలలోపే. మళ్లీ పంట వేయడానికి కావాల్సిన విత్తనాలను రైతులకు 80 శాతం సబ్సిడీ మీద అందిస్తున్నాం. ఇళ్లకు జరిగిన నష్టానికి, పశువులు, కోళ్లు నష్టపోయిన వారికి, పడవలు, వలలు నష్టపోయిన వారి అంచనాలు కూడా డిసెంబరు 15 లోగా పూర్తి చేసి, డిసెంబరు 31లోగా పరిహారం కూడా ఇవ్వబోతున్నాం. ► తుపాను వల్ల అనుకోకుండా 8 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని చెప్పి, వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, చెరువులకు జరిగిన నష్టాన్ని కూడా పూర్తిస్థాయిలో అంచనా వేసి, వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్ సరఫరా నిల్చిపోయిన చోట్ల యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశాం. మిగిలిన చోట్ల కూడా రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. ► ఈ వర్షాల వల్ల రాయలసీమ జిల్లాలే కాకుండా, కష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలోనూ పంటలు దెబ్బ తిన్నాయి. ధాన్యం రంగు మారింది. కొన్ని చోట్ల ధాన్యం మొలకలెత్తి కొందరు రైతులు అవస్థలు పడడం కూడా చూశాం. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడాన్ని గొప్ప ఘనకార్యంగా భావించే పరిస్థితులే తప్ప, ఎన్నడూ కొన్న దాఖలాలు లేవు. అలాంటిది రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. ధాన్యం మొలకెత్తిన రైతులకు కూడా న్యాయం చేసేందుకు గ్రేడెడ్ ఎమ్మెస్పీతో ఒక బ్రాకెట్ కింద తీసుకువచ్చి ఆ ధాన్యం కొనుగోలు చేస్తాం. ఇవన్నీ కూడా ఈక్రాపింగ్ డేటా ఆధారంగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తాం. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ► ఈ ఖరీఫ్... అంటే, 2020 ఖరీఫ్ నుంచి బీమా బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. ఎందుకంటే బీమా కంపెనీలు బాధ్యత తీసుకుని మానవత్వంతో స్పందించటం లేదు. 2012కి సంబంధించిన ప్రీమియంలు మన ప్రభుత్వం వచ్చాక కట్టి, క్లెయిమ్‌లకు వెళ్లడం. ప్రీమియమ్ ఎక్కువగా ఉండడంతో రైతులు పంటలకు ఇన్సూరెన్సు చేయకపోవడం చూశాం. అందుకే 2020 ఖరీఫ్ సీజన్ నుంచి ఇన్సూరెన్సు బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంటోంది. జనవరి చివరి వరకు క్రాప్ కటింగ్ జరుగుతుంది కాబట్టి, దాన్ని బట్టి రైతులు ఎంత నష్టపోయారన్నది చూసి, ఫిబ్రవరిలో ప్రణాళిక శాఖ నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు మార్చి, ఏప్రిల్‌లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్ కూడా సెటిల్ చేస్తాం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. క్రాప్ కటింగ్ పూర్తైన తర్వాత నెల, రెండు నెలల్లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్ అన్నది చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని చెబుతున్నాను. ► గతంలో పరిస్థితి మరీ ఘోరం. 2014 ఖరీఫ్‌లో నష్టం జరిగితే, ఆ ఇన్పుట్ సబ్సిడీ జూలై 22, 2015న వచ్చింది. అది కూడా రూ.692 కోట్లు మాత్రమే. మరో విడత 2017లో ఇచ్చారు. అంటే 2014 ఖరీఫ్ నష్టానికి పరిహారం రెండున్నర ఏళ్ల తర్వాత ఇచ్చారు. 2015 ఖరీఫ్ నష్టం ఒక ఏడాది ఆలస్యంగా 2016 నవంబరులోనూ, అదే సీజన్ ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టానికి పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2017 మే నెలలో ఇచ్చారు. 2016 ఖరీఫ్‌లో నష్టానికి తొలి విడత పరిహారం ఏడాది ఆలస్యంగా, అంటే 2017లో ఇవ్వగా, మిగిలిన పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2018లో ఇచ్చారు. 2017 రబీ నష్టం పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. ఇవి కాక 2018 ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టేశారు. రైతులకు ఏమీ ఇవ్వలేదు. 2018 ఖరీఫ్‌లో రూ.1838 కోట్లు, అదే ఏడాది రబీలో రూ.356 కోట్లు.. మొత్తంగా రూ.2194 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. కానీ ఇపుడు ఏదైనా సీజన్లో పంట నష్టం జరిగితే, అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ► ఇన్సూరెన్సు పరిస్థితీ అంతే. 2016లో కేవలం 17.79 లక్షల రైతులు నమోదు చేసుకుంటే, ఆ తర్వాత 2019 వరకు మూడేళ్లు వరసగా చూస్తే సగటున 20.28 లక్షల రైతులు కూడా ఇన్సూరెన్సు తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఇపుడు ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్సు సొమ్ము కడతా ఉంది కాబట్టి 58.77 లక్షల రైతులు నమోదు చేసుకున్నారు. అంటే ఒక్కసారిగా 190 శాతం పెరుగుదల. ఏరియా కవరేజ్ చూసినా 2016– 17 నుంచి మూడేళ్ల సగటు 23.57 లక్షల హెక్టార్లు మాత్రమే. 2019–20లో మా ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చాక 56.82 లక్షల ఎకరాలకు ఇన్సూరెన్సు చెల్లిస్తున్నాం. ఇది 141 శాతం పెరుగుదల. -
9 నుంచి నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు
సాక్షి, ముంబై: శాసనసభ శీతాకాల సమావేశాలు వచ్చే నెల తొమ్మిదో తేదీనుంచి నాగపూర్‌లో ప్రారం భం కానున్నాయి. ఈ సమావేశాలను రెండు వారాలకు బదులుగా మూడు వారాలు నిర్వహించేలా చూడాలని శాసనసభ కార్యకలాపాల సలహాదారుల సమితి సమావేశంలో ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. 2001 నుంచి నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు రెండు వారాలు మాత్రమే జరుగుతున్నాయని, అందువల్ల రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తిస్థాయిలో చర్చకు రాని పరిస్థితి కొనసాగుతోందని ప్రతిపక్షాలు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశాయి. 1995లో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమి హయాం లో మినహా కేవలం ఎనిమిది నుంచి 12 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. 1995లో శీతాకాల సమావేశాలు డిసెంబరు ఏడో తేదీ నుంచి 22దాకా కొనసాగాయి. ఇందులో ఉభయ సభల్లో 14 చొప్పున సమావేశాలు జరిగాయి.