అన్ని విధాలా ఆదుకుంటాం: సీఎం జగన్‌ | AP ASSEMBLY SESSIONS 2020: CM Jagan Speech On Sgriculture | Sakshi
Sakshi News home page

అన్నింటా అండగా

Published Tue, Dec 1 2020 5:49 AM | Last Updated on Tue, Dec 1 2020 7:54 AM

AP ASSEMBLY SESSIONS 2020: CM Jagan Speech On Sgriculture - Sakshi

అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: దేశంలో 29 రాష్ట్రాల్లో  ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుల పక్షం వహించి పనిచేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు వాటిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. నివర్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నెల తిరక్కుండానే డిసెంబర్‌ 31న ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తున్నామని గుర్తు చేశారు.

‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రంగు మారిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్నీ గ్రేడెడ్‌ ఎంఎస్‌పీ విధానంలో కొనుగోలు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రైతుల తరపున చంద్రబాబు మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు’’ అని జగన్‌ స్పష్టంచేశారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఎక్కడ తుపాన్‌ వచ్చినా, ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా వెంటనే రోడ్డు మార్గంలోనే వెళ్లేవాడినని జగన్‌ గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌ను వదలటం లేదన్నారు.

అందుకే సీబీఎన్‌ అంటే కరోనాకు భయపడే నాయుడు అని బుగ్గన పేరు పెట్టారని వ్యంగాస్త్రాలు విసిరారు. శాసనసభ ద్వారా రైతులకు ఏం చేయబోతున్నామో చెప్పబోతుంటే.. దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా డైరెక్షన్‌లో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, ఎల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపించడానికి కింద కూర్చుని నేలబారు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అనంతరం.. గత 18 నెలలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతుల మేలు కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలను సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ఆ వివరాలివీ...

చంద్రబాబు డ్రామా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎల్లో మీడియా..
చంద్రబాబు డ్రామాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎల్లో మీడియానేనని జగన్‌ విమర్శించారు. ‘‘చంద్రబాబు యాక్టర్‌ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లందరిదీ కధ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి, దుస్థితి. ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తోంది. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టం కాబట్టే ఈ డ్రామా. చంద్రబాబు ఎందుకంత రెచ్చిపోయారో ఆయనకే తెలియదు. వాళ్ల పార్టీ మనిషే నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఆయన లేవనెత్తిన అంశాలపై క్లారిఫికేషన్‌ ఇచ్చాం. దానిపై రామానాయుడే మాట్లాడాలి. కానీ చంద్రబాబు సడెన్‌గా లేచి నేను మాట్లాడతాననిన్నారు. అదెలా? అది కరెక్ట్‌ కాదని ఆయనక్కూడా తెలుసు. అయినా ఇలా రెచ్చిపోవటం ఆశ్చర్యకరం.

నేను ఐదేళ్లుఉ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఎన్నడూ పోడియమ్‌లోకి రాలేదు. ఆ హుందాతనాన్ని ఎవరైనా అనుసరించాలి. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఆయనే పోడియమ్‌లోకి వచ్చాడు. ఇక రేపు పొద్దున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లలో బ్యానర్లు అవే. అంతేతప్ప రైతుల కోసం ముఖ్యమంత్రి ఏం చెప్పారు? రైతులకు ఏ రకంగా దీని వల్ల మంచి జరుగుతుంది అనేది ఉండదు. మా ఖర్మ!!. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థను ప్రతిపక్ష నాయకుడు నడుపుతున్నాడంటే నిజంగా సిగ్గుపడాలి’’ అని దుయ్యబట్టారు. అనుకోని విపత్తు వచ్చి... క్యాబినెట్లో నిర్ణయాలు కూడా తీసుకున్న సమయంలో అసెంబ్లీలో దీనిపై ఏం చర్చిస్తారన్నది అంతా చూస్తున్నారని, బాబు మాత్రం అదేమీ కనిపించకూడదని డ్రామా చేస్తున్నారని విమర్శించారు.  

పదేళ్లలో లేని విధంగా అంతా సుభిక్షం...
తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిందని, గతంలో ఎప్పుడూ లేనంతగా అన్ని రిజర్వాయర్లు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. భూగర్భ జలాలు కూడా రీఛార్జ్‌ అయ్యాయన్నారు. దురదష్టవశాత్తూ దీపం వెలుగు కింద చీకటి ఉన్నట్లు ఆగస్టు నుంచి నవంబరు వరకు అడపా దడపా కురిసిన వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగిందని, దాన్ని నిజాయితీగా సమీక్షించామని చెప్పారు. రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా, రైతులకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగులు వేస్తోందని చెప్పారు. రైతులకూ తనకూ మధ్య ఉన్న బలమైన ఆత్మీయ అనుబంధంతోనే ఇవన్నీ చేస్తున్నట్లు తెలియజేశారు.

ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో నష్ట పరిహారం చెల్లించడం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి అని సీఎం స్పష్టంచేశారు. ‘‘ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్షరాలా రూ.143 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అక్టోబరు 27న చెల్లించాం. అక్టోబరు నెలలో వచ్చిన అ«ధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నవంబరు 17న ఒక నెల కూడా తిరక్క ముందే రూ.132 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇచ్చాం. నవంబరులో నివర్‌ తుపాను వల్ల పంటలకు, ఇళ్లకు, రోడ్లకు, చెరువులకు కూడా నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది’’ అని చెప్పారు.  

ఈ సందర్భంగా  రైతుల కోసం తీసుకున్న పలు నిర్ణయాలు ముఖ్యమంత్రి వివరించారు. అవి ఆయన మాటల్లోనే...
► భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రతి ఒక్కరికీ వారికి రూ.500 చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం. దీంతో ఒక ఇంట్లో నలుగురుంటే ఇంటికి రూ.2వేలు ఇచ్చినట్లు అవుతుంది. కానీ కొందరు ఈ ఆదేశాలు వచ్చేసరికే శిబిరాల నుంచి ఇళ్లలోకి వెళ్లిపోయారు. వారందరికీ ఇళ్లకు వెళ్లి డబ్బులిస్తాం.

► పంట నష్టాలన్నింటినీ డిసెంబరు 15 నాటికి మదింపు చేసి, పరిహారాన్ని డిసెంబరు 31లోగా రైతులకు ఇవ్వబోతున్నాం. ఇది కూడా కరెక్టుగా చూస్తే నెలలోపే. మళ్లీ పంట వేయడానికి కావాల్సిన విత్తనాలను రైతులకు 80 శాతం సబ్సిడీ మీద అందిస్తున్నాం. ఇళ్లకు జరిగిన నష్టానికి, పశువులు, కోళ్లు నష్టపోయిన వారికి, పడవలు, వలలు నష్టపోయిన వారి అంచనాలు కూడా డిసెంబరు 15 లోగా పూర్తి చేసి, డిసెంబరు 31లోగా పరిహారం కూడా ఇవ్వబోతున్నాం.

► తుపాను వల్ల అనుకోకుండా 8 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని చెప్పి, వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, చెరువులకు జరిగిన నష్టాన్ని కూడా పూర్తిస్థాయిలో అంచనా వేసి, వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్‌ సరఫరా నిల్చిపోయిన చోట్ల యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశాం. మిగిలిన చోట్ల కూడా రెండు, మూడు రోజుల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది.

► ఈ వర్షాల వల్ల రాయలసీమ జిల్లాలే కాకుండా, కష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలోనూ పంటలు దెబ్బ తిన్నాయి. ధాన్యం రంగు మారింది. కొన్ని చోట్ల ధాన్యం మొలకలెత్తి కొందరు రైతులు అవస్థలు పడడం కూడా చూశాం. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడాన్ని గొప్ప ఘనకార్యంగా భావించే పరిస్థితులే తప్ప, ఎన్నడూ కొన్న దాఖలాలు లేవు. అలాంటిది రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. ధాన్యం మొలకెత్తిన రైతులకు కూడా న్యాయం చేసేందుకు గ్రేడెడ్‌ ఎమ్మెస్పీతో ఒక బ్రాకెట్‌ కింద తీసుకువచ్చి ఆ ధాన్యం కొనుగోలు చేస్తాం. ఇవన్నీ కూడా ఈక్రాపింగ్‌ డేటా ఆధారంగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తాం. దానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది.

► ఈ ఖరీఫ్‌... అంటే, 2020 ఖరీఫ్‌ నుంచి బీమా బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. ఎందుకంటే బీమా కంపెనీలు బాధ్యత తీసుకుని మానవత్వంతో స్పందించటం లేదు. 2012కి సంబంధించిన ప్రీమియంలు మన ప్రభుత్వం వచ్చాక కట్టి, క్లెయిమ్‌లకు వెళ్లడం. ప్రీమియమ్‌ ఎక్కువగా ఉండడంతో రైతులు పంటలకు ఇన్సూరెన్సు చేయకపోవడం చూశాం. అందుకే 2020 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఇన్సూరెన్సు బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంటోంది. జనవరి చివరి వరకు క్రాప్‌ కటింగ్‌ జరుగుతుంది కాబట్టి, దాన్ని బట్టి రైతులు ఎంత నష్టపోయారన్నది చూసి, ఫిబ్రవరిలో ప్రణాళిక శాఖ నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు మార్చి, ఏప్రిల్‌లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్‌ కూడా సెటిల్‌ చేస్తాం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. క్రాప్‌ కటింగ్‌ పూర్తైన తర్వాత నెల, రెండు నెలల్లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్‌ అన్నది చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని చెబుతున్నాను.  

► గతంలో పరిస్థితి మరీ ఘోరం. 2014 ఖరీఫ్‌లో నష్టం జరిగితే, ఆ ఇన్‌పుట్‌ సబ్సిడీ జూలై 22, 2015న వచ్చింది. అది కూడా రూ.692 కోట్లు మాత్రమే. మరో విడత 2017లో ఇచ్చారు. అంటే 2014 ఖరీఫ్‌ నష్టానికి పరిహారం రెండున్నర ఏళ్ల తర్వాత ఇచ్చారు. 2015 ఖరీఫ్‌ నష్టం ఒక ఏడాది ఆలస్యంగా 2016 నవంబరులోనూ, అదే సీజన్‌ ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టానికి పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2017 మే నెలలో ఇచ్చారు. 2016 ఖరీఫ్‌లో నష్టానికి తొలి విడత పరిహారం ఏడాది ఆలస్యంగా, అంటే 2017లో ఇవ్వగా, మిగిలిన పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2018లో ఇచ్చారు. 2017 రబీ నష్టం పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. ఇవి కాక 2018 ఇన్‌పుట్‌ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టేశారు. రైతులకు ఏమీ ఇవ్వలేదు. 2018 ఖరీఫ్‌లో రూ.1838 కోట్లు, అదే ఏడాది రబీలో రూ.356 కోట్లు.. మొత్తంగా రూ.2194 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. కానీ ఇపుడు ఏదైనా సీజన్‌లో పంట నష్టం జరిగితే, అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం.


► ఇన్సూరెన్సు పరిస్థితీ అంతే. 2016లో కేవలం 17.79 లక్షల రైతులు నమోదు చేసుకుంటే, ఆ తర్వాత 2019 వరకు మూడేళ్లు వరసగా చూస్తే సగటున 20.28 లక్షల రైతులు కూడా ఇన్సూరెన్సు తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఇపుడు ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్సు సొమ్ము కడతా ఉంది కాబట్టి 58.77 లక్షల రైతులు నమోదు చేసుకున్నారు. అంటే ఒక్కసారిగా 190 శాతం పెరుగుదల. ఏరియా కవరేజ్‌ చూసినా 2016– 17 నుంచి మూడేళ్ల సగటు 23.57 లక్షల హెక్టార్లు మాత్రమే. 2019–20లో మా ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చాక 56.82 లక్షల ఎకరాలకు ఇన్సూరెన్సు చెల్లిస్తున్నాం. ఇది 141 శాతం పెరుగుదల.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement