సాక్షి, బెంగళూరు(కర్ణాటక): భిన్న సంస్కృతులకు వేదికైన బెళగావిలోని రెండో అసెంబ్లీ భవనం సువర్ణసౌధ శీతాకాల శాసనసభ సమావేశాలకు ముస్తాబైంది. సోమవారం ఉదయం నుంచి పదిరోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం, విపక్ష నేతలు, మంత్రులు సహా ఉన్నతాధికారులు బెళగావికి చేరుకున్నారు.
బొమ్మై సీఎం అయ్యాక జరుగుతున్న రెండో అసెంబ్లీ సమావేశాలు కాగా, అనేక ముఖ్య అంశాలతో సర్కారుపై దాడికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సమస్య, మేకెదాటు ఆనకట్ట, బిట్‌కాయిన్ల స్కాం, వరదల్లో జనం నష్టపోవడం, నిత్యావసర ధరల పెంపు ఇలా అనేక వైఫల్యాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ధీమాగా ఉన్నారు.
కమీషన్ల ఆరోపణలు..
రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో 40 శాతం కమీషన్ నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజాపనులు, జలవనరుల శాఖలపై ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదమయం అయ్యాయి. అక్కడి ప్రజలకు పరిహారం అందజేయడంతో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తనున్నారు. రాష్ట్రంలో సుమారు 35 వేల ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇప్పటికి రూ.204 కోట్ల పరిహారం విడుదల చేశారు.
మత మార్పిడి చట్టం రగడ..
రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టం తెస్తామని సీఎం ప్రకటించడం వివాదాస్పదమైంది. పలు మత సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. సీఎం బొమ్మై మాత్రం కచ్చితంగా చట్టం చేస్తామని చెబుతున్నారు. తొలిరోజు నుంచే రభస జరిగేలా ఉంది. బెంగళూరు సమీపంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నమేకెదాటు ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఎందుకు అనుమతులను తెచ్చుకోవడం లేదనేది చర్చకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు మంగళవారం విడుదల కానున్న 25 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఈ సమావేశాలపై ప్రభావం చూపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment