సాక్షి, ముంబై: శాసనసభ శీతాకాల సమావేశాలు వచ్చే నెల తొమ్మిదో తేదీనుంచి నాగపూర్‌లో ప్రారం భం కానున్నాయి. ఈ సమావేశాలను రెండు వారాలకు బదులుగా మూడు వారాలు నిర్వహించేలా చూడాలని శాసనసభ కార్యకలాపాల సలహాదారుల సమితి సమావేశంలో ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. 2001 నుంచి నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు రెండు వారాలు మాత్రమే జరుగుతున్నాయని, అందువల్ల రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తిస్థాయిలో చర్చకు రాని పరిస్థితి కొనసాగుతోందని ప్రతిపక్షాలు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశాయి. 1995లో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమి హయాం లో మినహా కేవలం ఎనిమిది నుంచి 12 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. 1995లో శీతాకాల సమావేశాలు డిసెంబరు ఏడో తేదీ నుంచి 22దాకా కొనసాగాయి. ఇందులో ఉభయ సభల్లో 14 చొప్పున సమావేశాలు జరిగాయి.