ఓటరూ మేలుకో, నిన్ను నువ్వేలుకో!
సమకాలీనం
గత చరిత్ర మాత్రం నిరాశ గొలిపేదిగానే ఉంది. 2002లో మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నిక జరిగినపుడు 41 శాతం పోలింగ్ జరిగితే, 2009లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 42 శాతం పోలింగ్ నమోదైంది. మీడియా విస్తృత ప్రచారం, కార్పొరేషన్-ఎన్నికల సంఘం ప్రత్యేక కృషి తర్వాత 2009 ఎన్నికల్లో అది 52.99 శాతానికి పెరిగింది. ఇది కూడా సాధారణ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పోలింగ్ కన్నా చాలా తక్కువ. అందుకే, ఎక్కువ శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు చర్యలు చేపట్టారు.
నాలుగు వందల ఏళ్లకు పైబడ్డ చరిత్ర గల హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాల్సిందెవరు? నేతలు పదే పదే వల్లెవేస్తున్న ఆకర్ష ణీయ నగరంగా మలిచేదెవరు? అలా చేసేలా పాలనా వ్యవస్థల్ని ఐదేళ్లు నియంత్రించేదెవరు? ఇప్పుడెన్ని మాటలు చెప్పినా... వారు అలా చేయ కుండా గాలికి వదిలేస్తే అరకొర వసతుల మధ్య బతుకు సరిపెట్టుకోవాల్సిం దెవరు? రాను రాను నరకమయ్యే నగరంలో నలిగిపోవాల్సిందెవరు?ఎన్నో సవాళ్లు-ప్రతిసవాళ్ల నడుమ కూడా... ఎన్నికల తుది ఫలితంతో నిమిత్తం లేకుండా ఎప్పట్లాగే ముందుకు సాగే రాజకీయ శక్తులేవి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించేది నాలుగు రోజుల్లో జరగనున్న మహానగర ఎన్నికల తర్వాతే! అవును, అంతటి ప్రాధాన్యం కలిగిన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని ఎన్నికల ప్రచార బరిలోకి దూకిన ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రచార వేడిని గురువారం (నిన్న) పతాక స్థాయికి తీసు కొచ్చారు. బలం, బలహీనతల సంగతెలా ఉన్నా.... అధికార పీఠం కైవసం చేసుకునేందుకు బరిలో దిగిన ప్రధాన ప్రత్యర్థి రాజకీయ వర్గాలు తమ తమ బలగాలను మోహరించాయి. శక్తులన్నింటినీ సమీకరించి అదృష్టాన్ని పరీక్షిం చుకునే కడపటి అంకానికి పరుగులెడుతున్నాయి. ఇంకా, పూర్తి స్థాయి చేతన పొందనిది ఓటరే!
ప్రజాస్వామ్య ఎన్నికల రణరంగంలో కీలక భూమిక పోషించే ఓటరుకెందుకింత అచేతన? ఎందుకీ స్తబ్దత? ఓటింగ్ పట్టని జడత్వమెందుకు! అదే అర్థం కాదు. ఇంతకీ ఎన్నికలు ఓటర్ల కోసం కాదేమో! ఎన్నికయ్యే నేతల కోసమేనేమో అని అనుమానం కలిగేంత అలక్ష్యం మన నగర ఓటర్లలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నాగరికులైనవారు, తమకు తాము మేధావి, ప్రభావవంతమైన వర్గంగా భావించేవారిలోనే ఈ నిర్లిప్తత, నిరాసక్తత ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యేంత ఓటింగ్ శాతం కూడా మహానగర ఎన్నికల్లో జరగట్లేదని గత ఎన్నికలన్నీ రుజువుపరి చాయి. ఈ మహానగరంలో కూడా మధ్య-అల్పాదాయ వర్గాలు, పేదలుండే బస్తీల్లో జరిగేపాటి పోలింగ్ శాతం కూడా సంపన్నులు, నాగరిక సమాజా లుండే ప్రాంతాల్లో నమోదు కావటం లేదు.
ఓటేయడం నాగరీకులకు నామో షీయేమో! పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ప్రసార మాధ్యమాలు, ఇతర పౌర సంఘాలు చేసే ప్రయత్నం కూడా ఆశించిన స్థాయిలో ఫలితమివ్వడం లేదు. ఇది చరిత్ర! ఇప్పుడైనా మార్పుం టుందా? ఎక్కువ మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచుతారా? ఆనక, పాలనాపగ్గాలు చేపట్టిన రాజకీయ పార్టీ విధానాల్ని ఒత్తిడి పెంచి శాసిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే!
పొల్గొనకుండా నిలదీసే నైతిక హక్కెక్కడిది?
పాలనలో భాగస్వామ్యాన్ని, నిర్ణయాధికారాన్ని రాజ్యాంగం కల్పిస్తున్నా... ఓటు హక్కు వినియోగించుకోని వారికి, ఎన్నికైన వారిని నిలదీసే నైతిక హక్కెక్కడుంటుంది? ఇది ప్రధాన ప్రశ్న. ‘ఎన్నికై అధికారం చేపట్టాక ఎవరైనా ప్రజలకు పనిచేసి పెట్టాల్సిందే, మేం ఓటేశామా? వేయలేదా? అన్నది వారికెలా తెలుస్తుంది?’ అన్న లాజిక్కే, ఓటేయకుండా ఉండే వారి ధీమా వెనుక కారణమై ఉండొచ్చు! స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేయక పోవడానికి వారికి సవాలక్ష కారణాలుండొచ్చు! కానీ, ఓటు వేయకుండా పాలనా విధానాల్ని విమర్శించే, వ్యవస్థల్ని ప్రశ్నించే హక్కు లేనట్టే లెక్క. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఇటీవల సాక్షి జర్నలిజం విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓ మంచి మాట చెప్పారు.
అతి తక్కువ శాతం ఓటింగ్ వల్ల నాయకులు తాము ప్రసన్నం చేసుకోవాల్సిన వారి సంఖ్య చాలా పరిమితమై పోతోంది. బహుముఖ పోటీల్లో ఎంతో కొంత శాతం ఇతరేతరులకి పోను.... తనకు పార్టీ పరంగా పడేవి, కులం-వర్గం పరంగా వచ్చేవి, స్థానిక కారణాల వల్ల అనుకూలించేవి పోను ఇక తాను శ్రమించి సాధించాల్సిన ఓట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. వివిధ గణాం కాల తర్వాత.... ఆ మాత్రం ఓట్లు ఏదో మార్గంలో సాధించొచ్చులే! అనే తేలిక భావన కలుగుతోంది. అలా ఎత్తుగడలతో గెలిచాక, ఇక ప్రజల పట్ల నిర్లక్ష్యపు భావం బలపడుతోంది.
అలా కాకుండా ఎక్కువ శాతం ఓటింగ్ జరిగితే, ప్రతిసారీ ఎక్కువ మందిని ప్రసన్నం చేసుకుంటే తప్ప ఎన్నికల్లో గెలిచి, గట్టెక్కలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలా జరిగినపుడు భయం, బాధ్యత, జవాబుదారీతనం కచ్చితంగా పెరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. అందుకే, ఎక్కువ శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు ఎన్నికల సంఘం, జీహెచ్ఎమ్సీ వివిధ ప్రోత్సాహక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. నగరంలో 74 లక్షల ఓటర్లుండగా ఇప్పటికే 55 శాతం మందికి పోల్ చీటీలు చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. సిబ్బంది ఓటర్ల ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం, ఇంటర్నెట్, యాప్ ద్వారా తమ పోలింగ్ బూత్, నంబరు తదితర సమాచారం ఓటర్లు పొందినట్టు లెక్క లున్నాయి. ఇందులో ఎంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకుం టారో చూడాలి. గత చరిత్ర మాత్రం నిరాశ గొలిపేదిగానే ఉంది. 2002లో మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నిక జరిగినపుడు 41 శాతం పోలింగ్ జరిగితే, 2009లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 42 శాతం పోలింగ్ నమోదైంది. మీడియా విస్తృత ప్రచారం, కార్పొరేషన్-ఎన్నికల సంఘం ప్రత్యేక కృషి తర్వాత 2009 ఎన్నికల్లో అది 52.99 శాతానికి పెరిగింది. ఇది కూడా సాధారణ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పోలింగ్ శాతం కన్నా చాలా తక్కువ.
పౌరులు నిర్దేశించే ఎజెండాయే లేదు!
ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రతి దశలోనూ ఇదొక ప్రహస నంలా సాగుతోంది తప్ప ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తున్న చర్య ఒక్కటీ లేదు. రిజర్వేషన్ల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రణాళికల వెల్లడి, ప్రచారం ఇలా... అన్ని దశల్లోనూ రాజకీయ అట్టహాసమే! ఇక ప్రధాన రాజకీయ పక్షాల నేతలు విమర్శలు-ప్రతి విమర్శలతోనే ప్రచార పర్వం సాగుతోంది. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు గానీ, నిర్దిష్టమైన విధాన ప్రకటనలు గానీ, మేధావి వర్గాన్ని మెప్పించే ప్రజా ఎజెండా వెల్లడించడం గానీ లేదు. నగర పౌరులకు ఇదేదీ పట్టడం లేదు. చాలా చోట్ల ఎన్నికల ప్రచారాన్ని ఒక రాజకీయ తమాషాగా, వినోద కార్యక్రమంగా చూస్తున్న జాడలే ఎక్కువ! నాయకులు, అభ్యర్థులు కూడా గల్లీలకు వెళ్లినపుడు... బట్టలు ఇస్త్రీ చేయడం, బజ్జీలు గోలించడం, మిషన్‌పై గుడ్డలు కుట్టడం వంటి పనులు చేస్తూ, ఆ క్షణంలో ఓటర్లను మెప్పించే చిల్లర చర్యలతో వినోదం పంచుతున్నారు. బరిలో దాదాపు డెబ్బై మంది అభ్యర్థులు నేర చరితులున్నట్టు తగు పరిశీలన తర్వాత సుపరిపాలనా వేదిక వెల్లడించింది. స్థానికులు, ప్రజాదరణ ఉన్న వాళ్లు, సేవా దృక్పథం కలిగినవాళ్లు అన్న అంశాల్ని ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడదు.
ఇక వారి విద్యార్హతల విషయానికొస్తే.... అభ్యర్థుల్లో డెబ్బై శాతం మంది ఇంటర్ లోపు విద్యార్హతలు కలిగిన వారని ఓ అధ్యయనం చెబుతోంది. పార్టీ విధానాలు, పౌర అవసరాలు, హైదరాబాద్ మహానగర మౌలిక సమస్యలపై వారికున్న శాస్త్రీయ అవగాహన ఎంత? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. పార్టీల బడా నాయకులు చెబుతున్న పెద్ద పెద్ద హామీలు, గంభీరమైన రాజకీయ ప్రకటనల్నే కింది స్థాయి నేతలు, అభ్యర్థులు వల్లెవేస్తున్నారు. ‘అరవై ఏళ్లుగా సాధించలేనిది పద్దెనిమిది నెలల్లో సాధిం చాం’ అని ఒకరంటే, ‘అసలు హైదరాబాద్‌కు దశ, దిశ నిర్దేశించి, ప్రపంచ పటంలో స్థానం కల్పించిందే మేమ’ని మరొకరు జబ్బలు చరుస్తున్నారు. పలుమార్లు ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా, ‘అభివృద్ధికి మేమే పర్యా యపదం. అభివృద్ధి అంటే మేము, మేమంటేనే అభివృద్ధి’ అని మరో పక్షం ఢంకా బజాయిస్తోంది. విశ్వనగరం చేస్తామని ఒకరు భూతల స్వర్గం చూపి స్తుంటే, ఉచితంగా తాగునీళ్లు, ఇంటింటికీ పైప్‌లైన్‌లో వంట గ్యాస్, స్వేచ్ఛగా పశుమాంసం తినే యోగం.... ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతూ గారడీ విద్యను ప్రదర్శిస్తున్నారు. ఎత్తులు-పై ఎత్తులు, ఏం చేసయినా ఎక్కువ స్థానాలు సాధించాలనే తపన తప్ప ప్రజాసమస్యలు ఎవరికీ పట్టడం లేదు.
నిర్ణయించేవాడు నిమిత్తమాత్రుడా?
పోలింగ్‌లో పాల్గొని ఓటు ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించడం మినహా యిస్తే... నగర పౌరుడికి పాత్రే లేదన్నట్టు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఢిల్లీలో ప్రైవేటు పాఠశాలల భరతం పడతామని, అవన్నీ పద్ధతిగా, ప్రజా ప్రయోజనాలకనుగుణంగా పనిచేసేట్టు చూస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నాణ్యతకు భరోసా లేకుండా, విచ్చలవిడి ఫీజుల వసూళ్లతోపాటు ప్రైవేటు విద్యా వ్యవస్థలు అరాచకం సృష్టిస్తున్న పరిస్థితి మన నగరంలోనూ ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలు నిర్వీర్య మవడం మరో జాడ్యంగా మారింది. మచ్చుకిదొక ఉదాహరణ మాత్రమే! నగరజీవి సమస్యలెన్నో! నగరంలో రెండు ప్రధాన తాగునీటి వనరులైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ ఎండిపోయి, మంజీరాలో నీళ్లు లేక సరఫరా నిలిచిపోయి, భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి దుర్భరమైన పరిస్థితులున్నాయి. నగరంలో ఉన్న రైతు బజార్లలో రైతులు కాకుండా దళారులే రాజ్యమేలుతున్నా పట్టించుకున్న వారు లేరు. వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, ట్రాఫిక్ నరకయాతన, పెచ్చుమీరిన వాయు కాలుష్యం, అడ్డదిడ్డంగా మురుగునీటి వ్యవస్థ.... ఇలా నగరజీవి జీవన ప్రమాణాల్ని దిగజారుస్తున్న జటిల సమస్యలెన్నో, ఎన్నెన్నో ఉన్నాయి.
ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే శాస్త్రీయ ప్రతిపాదనలు, వాటిపై విపులమైన చర్చ, హామీల సాధ్యాసాధ్యాలపై లోతైన పరిశీలన, నిర్దిష్ట కార్యాచరణ, పౌరులకి విశ్వాసం కలిగించడం... ఇవేవీ లేకపోవడం ప్రస్తుత మహానగర ఎన్నికల్లో ఒక పెద్ద లోపంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌర చైతన్యం పెరగాలంటున్నారు, పాలనా వ్యవస్థలపై నిరంతర నిఘా, తమకు కావాల్సింది సాధించుకునేలా పౌరులు ఒత్తిళ్లు పెంచడమే సముచిత మార్గ మంటున్నారు. అధికారం దక్కించుకొని, ప్రజాధనం పై అజమాయిషీ చేసే పాలకులు ఓటర్లకు ఇచ్చే హామీలన్నింటినీ కార్యాచరణ కిందకు మళ్లించే శక్తి, బాధ్యత ఓటర్లయిన పౌరులదే! వారు అలసత్వం ప్రదర్శిస్తే, ఫలితం శూన్యం. వచ్చే ఐదేళ్లు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పౌరులు కర్తవ్యం మరచి ‘ఒక రోజు జాతర’ అనుకుంటే ఎన్నికల ప్రక్రియ అంతా ప్రహసనమే! పౌరులూ తస్మాత్ జాగ్రత్త!
అలిశెట్టి ప్రభాకర్ అన్నట్టు..... ‘‘అట్టపర్వతం/ఎత్తి పట్టుకున్న వాడు/ ఆంజనేయుడూ కాదు/ నెత్తిలో/ నెమలీక పెట్టుకున్నోడు/క్రిష్ణ పరమాత్ముడూ కాదు/ అదంతా/ ఎన్నికల ‘అట్ట’హాసం!’’
దిలీప్ రెడ్డి, ఈమెయిల్: dileepreddy@sakshi.com