సాక్షి, కర్నూలు : సాగునీటి సంఘాల ప్రత్యక్ష ఎన్నికలకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఈ మేరకు 528 జీవోను విడుదల చేసింది. ఏకాభిప్రాయంతోనే నీటి సంఘాల కమిటీలు ఎంపిక చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చెరువులకు నీటి సంఘాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేపట్టారు. జిల్లాలో 2012లో నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి నేటి వరకు ఎన్నికలు జరగలేదు. గతంలో ఆయకట్టుదారులంతా కలిసి సంఘాన్ని ఎన్నుకునేవారు.
ఈ సారి ఎన్నికలు నిర్వహించేందుకు నిధులు వెచ్చిందే పరిస్థితి లేనందున చెరువుల కింద ఉన్న ఓటర్లందరిని పిలిచి గ్రామ సభ నిర్వహించి అందులో ఎంపిక చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం ఓటర్లకు కల్పించింది. గతంలో ఉన్న ఓటరు జాబితానే నీటిపారుదల శాఖ అధికారులకు అందజేయాలని కలెక్టర్ అన్ని మండల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో చిన్నతరహా, మధ్యతరహా నీటిపారుదల శాఖ పరిధిలోని పథకాలతోపాటు, పలు ప్రాజెక్టుల కింద ఉన్న పథకాలకు మొత్తం 384 సంఘాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
సంఘానికి ఆరుగురే :
గతంలో మధ్యతరహా నీటిపారుదల పరిధిలో 12 మంది, చిన్నతరహా పరిధిలో ఆరుగురితో సంఘం ఏర్పడేది. ఈ సంఖ్య ఆరుకు కుదించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు మరో నలుగురు సభ్యులను ఏకాభిప్రాయంతో రైతులు ఎన్నుకోవాల్సి ఉంది. గతంలో టీసీ(టెరిటోరియల్ కానిస్టుయన్సీ) సభ్యులు ఉండేవారు. ఇప్పుడు ఆ విధానం లేదు. ఏకంగా సభ్యులే ఉంటారు. నీటి పారుదల సహాయక ఇంజినీరు స్థాయిలోనే సంఘాల ఎంపిక పూర్తవుతోంది. గ్రామాల్లో ఆయకట్టు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసిన రైతులు సూచించిన వారినే అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎంపిక చేస్తారు.
వారితోపాటు మరో నలుగుర్ని సభ్యులుగా ఎంపిక చేసి సంఘాలను ఖరారు చేస్తారు. వాస్తవానికి సెప్టెంబరు 12వ తేదీలోగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు పూర్తి చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ మారిన విధానంతో వచ్చే నెల 25వ తేదీలోగా ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 4న గ్రామాల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 7వ తేదీ నుంచి గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి సంఘాల ఖరారు చేస్తారు. 25వ తేదీ నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయనున్నారు.
డీఈఈలకు ప్రాజెక్టు కమిటీలు...
ప్రాజెక్టు కమిటీల ఎంపిక డీఈఈలకు అప్పగించారు. సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులవారీ ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. అధ్యక్ష, ఉపాధక్షులతోపాటు మరో నలుగురు సభ్యుల్ని ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షలు ఎన్నుకోవాల్సి ఉంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సాగునీటి సంఘాల అధ్యక్షులు మాత్రమే ప్రాజెక్టు కమిటీ సభ్యులను ఖరారు చేస్తారు. దీనికి డీఈఈలు భాధ్యత వహిస్తారు. సెప్టెంబరు నెల 25వ తేదీలోగా ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి.
ప్రత్యక్ష ఎన్నికలు లేనట్లే!
Published Mon, Aug 31 2015 4:18 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement