భారీ వర్షాలు కురిశాయి... రైతును నిండా ముంచాయి.. అన్నదాతలు ఎంతెంత నష్టపోయారో ఇప్పటికే ప్రభుత్వం ఓ నివేదిక కేంద్రానికి పంపింది. ఈ నివేదికలో చూపిన నష్టం గోరంత. జిల్లా అధికారులు ఇంకా పూర్తిస్థాయి అంచనాలు వేసేందుకు తంటాలు పడుతున్నారు. ఈ నెల 15వ తేదీకల్లా అంచనాలు పూర్తి చేయాలన్న ఆదేశాలు అమలయ్యేలా లేవు.. ఇపుడు అన్నదాతల భవితవ్యం అధికారుల చేతుల్లోనే ఉంది..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: వ్యవసాయ శాఖకు సరిపడా మండల అధికారులు లేరు.. వ్యవసాయ మండల విస్తరణ అధికారుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.. ఏ రకంగా లెక్కించినా వ్యవసాయ శాస్త్రవేత్తల సంఖ్య నాలుగైదుకు మించడం లేదు.. గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇలా... క్షేత్ర స్థాయి వివరాలు సేకరించేందుకు సరిపడా యంత్రాంగమే లేదు. మరి ఈ నెల 15వ తేదీకల్లా పంట నష్టంపై పూర్తిస్థాయి అంచనాలు ఎలా సిద్ధం చేస్తారన్నది ఇపుడు రైతన్న మదిని తొలుస్తున్న ప్రశ్న. అయితే, ఇప్పటికే సేకరించిన ప్రాథమిక సమాచారంతో ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపించింది. అయితే, ఈ అంచనాలు జరిగిన నష్టం కంటే తక్కువగానే ఉన్నాయన్నది సమాచారం.
గడిచిన రెండు సీజన్లలో కరువుతో చిల్విగవ్వ కూడా వ్యవసాయం నుంచి రాబట్టలేక పోయిన రైతన్న ఈ సారి పుష్కలంగా కురిసిన వర్షాలకు మురిసిపోయాడు. వ్యవసాయ శాఖ అంచనాలు, సాధారణ సాగు విస్తీర్ణానికి మించి పంటలు సాగుచేశారు. దీంతో పంటల దిగుబడి కూడా అనూహ్యంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. కానీ, అనూహ్యంగా విరుచుకుపడిన తుపానుతో జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పంటలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి.
నాగార్జున సాగర్ ఆయక ట్టులో ఆలస్యంగా వేసిన వరి పంట మాత్రమే కొద్దిగా దక్కేలా ఉంది. ఈ సారి పత్తి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగైంది. సహజంగానే ఈ పంటకే ఎక్కువ నష్టం వాటిల్లింది. సుమారు 3.80లక్షల ఎక రాల్లో పత్తి, 92వేల ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. కానీ, పంటలు యాభై శాతానికి పైగా నష్టపోతేనే లెక్కలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలతో నష్టం గుర్తింపులో రైతులకు తీవ్ర అన్యాయం జరిగే ముప్పు పొంచి ఉంది. జరిగిన నష్టం అంచనాల మేరకు చూసినా ఈసారి పత్తి 25.93లక్షల క్వింటాళ్ల దిగుబడి తగ్గనుంది. తద్వారా రైతులు రూ.1037కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నారు. అదే మాదిరిగా, వరి ధాన్యం విషయాన్ని పరిశీలిస్తే 20.70లక్షల క్వింటాళ్ల దిగుబడికి దెబ్బతగలనుంది. దీంతో సుమారు రూ.300కోట్ల మేర అన్నదాతల ఆదాయానికి గండి పడనుంది. అంటే కేవలం ఈ రెండు పంటల దిగుబడి ద్వారా వచ్చే నష్టమే రూ.1337కోట్లు అవుతోంది. ఇది కాకుండా కూరగాయలు, పూలతోటలు, పండ్ల తోటలకు జరిగిన నష్టం ఉండనే ఉంది.
సిబ్బంది కొరతతో ప్రభుత్వ ఆదేశాలకు చుక్కెదురు
పంట నష్టం అంచనాలను శాస్త్రీయంగా వేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. తుపాను తాకిడికి గురైన 32 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గ్రామాల వారీగా పంట నష్టం వివరాలు సేకరించి అంచనాలు సిద్ధం చేయాల్సి ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో పర్యటించి లెక్కలు వేయడానికి సరిపోను సిబ్బంది మాత్రం అందుబాటులో లేరు. ప్రతి గ్రామంలో, ప్రతి రైతు పొలాన్ని సందర్శించి అంచనా వేయాలంటే ఉన్న సిబ్బందితో ఇచ్చిన గడువులోపల అయ్యే పని కాదన్నది అధికార వర్గాల సమాచారం.
కచ్చితంగా డాట్ సెంటర్ శాస్త్రవేత్తలను తీసుకువెళ్లి అంచనాలు వేయాలన్నది ప్రభుత్వ ఆదేశం. కానీ, జిల్లా డాట్ సెంటర్‌లో ఉన్నది ఇద్దరు శాస్త్రవేత్తలు మాత్రమే కావడం గమనార్హం. కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలను పరిగణనలోకి తీసుకున్నా, వీరి సంఖ్య ఆరుకు చేరడం లేదు. మరి తక్కువమంది సిబ్బందితో పక్కాగా పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారో అర్ధంకాని విషయం. యాభై శాతం నష్టం జరిగితేనే పరిగణనలోకి తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇప్పటికే సిద్ధం చేసిన ప్రాథమిక అంచనాల్లో సగానికి సగం తగ్గిపోయి రైతులకు అన్యాయం జరిగే ప్రమాదమూ ఉంది.
తీరని.. కష్టం
Published Thu, Nov 7 2013 4:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement