director neeraj pandey
-
డైరెక్టర్ నాలుకపై కోటి రూపాయల నజరానా!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ ప్రాజెక్టులలో 'టాయిలెట్-ఎక్ ప్రేమ్ కథా' ఒకటి. కొన్ని రోజుల కిందట షూటింగ్ మొదటిరోజు టాయిలెట్లో హీరోయిన్ భూమి పెడ్నేకర్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని అక్షయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హల్ చల్ చేసింది. ఆ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి వివాదంతో ముందుకొచ్చింది. సాధువు బెహరీ దాస్ మహరాజ్ ఈ మూవీ డైరెక్టర్ నీరజ్ పాండే నాలుక తెచ్చిన వారికి ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలు, కొన్ని ఏరియాలలో ఇవి లేని కారణంగా ఏకంగా వివాహాలు రద్దయిన విషయం తెలిసిందే. మధుర పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే నందగావ్ పురుషులకు, బర్సానా గ్రామ మహిళలకు వివాహాలు జరగవు. శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ప్రేయసి రాధకి వివాహం కాలేదని, ప్రస్తుతం ఈ మూవీలో హీరోహీరోయిన్లు ఆ గ్రామాల వారైనందున స్టోరీని మార్చాలని బెహరీ దాస్ మహరాజ్ తో పాటు మరికొందరు సాధువులు హెచ్చరించారు. మూవీ స్టోరీని మార్చితీరాల్సిందేనని మూవీ యూనిట్‌ను డిమాండ్ చేస్తున్నారు. మహామండలేశ్వర్ నవల్ గిరి మహరాజ్ మధురలో మాట్లాడుతూ.. సమాజానికి సందేశాన్నిచ్చే స్టోరీ అయితే ఆ మూవీ పేరును 'టాయిలెట్- ఏ స్వచ్ఛ అభియాన్' అని మార్చుకోవాలని అన్నారు. రాధాకృష్ణుల పుట్టి పెరిగిన ప్రాంతాల్లో సినిమా తీస్తూ, పెళ్లి లాంటి విషయాలను టచ్ చేశారని మహంత్ హరిబోల్ మహరాజ్ అన్నారు. టైటిల్ కచ్చితంగా మార్చితీరితేనే నందగావ్, బర్సానా, మధుర ప్రాంతాల్లో షూటింగ్ సజావుగా సాగనిస్తామని సాధువులంతా సోమవారం మధురలో జరిగిన ఓ సమావేశంలో నిర్ణయించారు. ఆ మూవీకి డైరెక్టర్ నీరజ్ పాండే కాగా నిర్మాతలుగా విక్రమ్ మల్హోత్రా, శీతల్ భాటియా, నీరజ్ పాండే వ్యవహరిస్తున్నారు. -
సినిమా రివ్యూ: ఎంఎస్ ధోనీ
కొత్త సినిమా గురూ! ఒక టికెట్ ఇస్తారా ప్లీజ్... లక్ష్యం నిన్ను ఎంచుకుంటుంది. నువ్వు చేయాల్సిందల్లా లక్ష్యాన్ని ఎంచుకోవడమే. ధోనికి అసలు క్రికెట్ అంటే పెద్ద ఇష్టం లేదు. రాంచీ స్కూల్లో ఫుట్‌బాల్ ఆటలో ఆసక్తి కలిగి ఉంటాడు. గోల్ కీపర్‌గా మంచి చలాకీ. కాని ఆ స్కూల్ క్రికెట్ టీమ్‌లో వికెట్ కీపర్ లేకపోవడంతో స్కూల్ స్పోర్ట్స్ టీచర్ కన్ను ధోని మీద పడుతుంది. ‘క్రికెట్ ఆడతాడేమో కనుక్కో’ అని కబురు చేస్తే ‘పెద్ద బాల్ని వదిలేసి చిన్నబాల్తో ఆడతారా ఎవరైనా?’ అని జవాబు చెప్తాడు. కాని లక్ష్యం అతని కోసం కాచుకుని ఉంది. అది పదే పదే అతడి వెంట పడింది. చివరకు ధోని ఫుట్బాల్ని వదిలి క్రికెట్లోకి వస్తాడు. చేతికి గ్లవ్స్... దూసుకొచ్చే బాల్‌ను ఒడిసి పట్టడం డ్యూటీ. ‘సార్... నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం’ అని టీచర్‌కు చెప్తే ‘నీ ముఖం... కీపింగ్ చెయ్’ అని చెప్తాడు. సంతలో దేవుని పటాలన్నింటి మధ్య సచిన్ పోస్టర్ ఉంటే కొనుక్కున్న కొడుకును చూసి తండ్రికి దిగులు. వీడు బాగా చదువుతాడా... చదువులో పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాడా అని. తల్లికి మాత్రం తెలుసు- వాడికి ఆనందం ఆటల్లోనే అని. ధోని లోకల్ గల్లీలలో హీరో అవుతాడు. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో నిలబడితే కొడుతూనే ఉంటాడు. చివరకు స్కూళ్లకు సెలవులిచ్చి జనమంతా వచ్చి నిలుచునేంత క్రేజ్. కాని చిన్న ఊరి కుర్రవాడు. మధ్యతరగతి కుటుంబం. బతుకు భయం. ఎదగాలంటే ఎన్నో అడ్డంకులు. రైల్వే అధికారి ఒకరు అతడి ప్రతిభను గుర్తించి రైల్వేలో టిసి ఉద్యోగం ఇచ్చి రైల్వే క్రికెట్ టీమ్‌లో ఎంపిక చేసుకుంటాడు. నెలకు ఐదు వేల జీతం. ఖాళీ ఉన్నప్పుడల్లా క్రికెట్ ప్రాక్టీస్. డౌన్ వచ్చే రైలు... అప్ వెళ్లే రైలు... మధ్యలో టికెట్ కలెక్షన్... లేని వాళ్లకు ఫైన్ వేయడం... రోజులు గడుస్తున్నాయి. కొంత ఏమరపాటుకు లోనైతే ఇక్కడే ఫినిష్ అయిపోయే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఇలాంటి సందర్భం ప్రతి మనిషి జీవితంలోనూ వస్తుంది. ఉండాలా... వదిలేసి వెళ్లాలా... అందరి దగ్గరా టికెట్ కలెక్ట్ చేసే మనిషి తన లక్ష్యం కోసం తెగింపు అనే టికెట్‌ను కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరకు ధోని నిర్ణయం తీసుకుంటాడు. రైలుకు టాటా. డియర్ క్రికెట్... అయామ్ కమింగ్. ప్రతిభ నగరాల్లో మాత్రమే ఉండదు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉంటారు. దాల్మియా హయాంలో బి.సి.సి.ఐ చిన్న ఊళ్లలో ఉన్న టాలెంట్‌ను వెతికి పట్టే కార్యక్రమం తీసుకోవడం ధోనికి లాభిస్తుంది. ఒక దేశవాళీ ట్రోఫీ క్రికెట్‌తో ధోని ఎక్కడైతే సెలెక్టర్లు కూచున్నారో వాళ్ల నెత్తిన పడేలా సిక్సర్లను బాదుతాడు. అక్కడి నుంచి హైదరాబాద్ ఏ టీమ్, ఆ తర్వాత భారత జట్టు, ఆ తర్వాత వరుస విజయాల వరుస... ఆ తర్వాత చెరపలేని ఒక చరిత్ర స్థాపన. ఎంఎస్ ధోని సినిమా 2011 వరల్డ్ కప్ ఫైనల్స్‌తో మొదలయ్యి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి తిరిగి ఫైనల్స్‌తో ముగుస్తుంది. మూడు ముఖ్యమైన వికెట్లను పోగొట్టుకుని జట్టు ఒత్తిడిలో ఉన్న తరుణాన ఒక కెప్టెన్‌గా కసి ఉన్న ఆటగాడిగా దేశానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడవరాదనే సంకల్పంతో చేతులకు గ్లవ్స్ బిగించుకుంటూ ధోని క్రీజ్‌లోకి దిగి బ్యాట్‌తో బంతి మాడు పగిలేలా మోదడం, యువరాజ్ సింగ్‌తో కలిసి జట్టును విజయం వైపు నడిపించడం... చివరి బాల్‌ను బౌండరీ లైన్ ఆవలికి తరలించడం... ఇటీవలి జ్ఞాపకంగా మన కళ్ల ముందు కదలాడినా మళ్లీ ఆ క్షణాలు ఉజ్జీవనమై ఉద్వేగం కలుగుతుంది. ఛాతీ ఉప్పొంగుతుంది. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచం కప్‌ను సాధించి పెట్టిన ఈ కుర్రవాడు ఒక చిన్న ఊళ్లో... ఒక దిగువ శ్రేణి ప్రభుత్వ క్వార్టర్ల నుంచి పుట్టుకొచ్చాడని తెలియడం ఎవరికైనా స్ఫూర్తి... తమ లక్ష్యాన్ని ఎంచుకోవడానికి అవసరమయ్యే ఉత్సాహాన్ని ఇస్తుంది. మహేంద్ర సింగ్ ధోనిగా ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుట్ నటించాడు. అతడికి ఇది జీవిత కాలపు అవకాశం. దానిని అతడు నిలబెట్టుకున్నాడు. ఇక మీదట ధోని, సుశాంత్ అవిభాజ్యం. గత స్పోర్ట్స్ బయోపిక్‌ల వలే కాకుండా ఈ సినిమా అంతా రియల్ ఫుటేజ్ వాడారు. అందులో ధోనికి బదులుగా సుశాంత్‌ను గ్రాఫిక్స్‌తో మార్పిడి చేశారు. కాని గ్రాఫిక్స్ ఉన్నతశ్రేణిలో ఉండటం వల్ల ఎఫెక్ట్ అద్భుతంగా వచ్చింది. అలాగే స్కూల్ ప్లేయర్‌గా సుశాంత్ ముఖాన్ని ఆ వయసు కుర్రాడికి గ్రాఫిక్స్‌తో అమర్చి చాలా మంచి అనుభూతిని రాబట్టగలిగారు. తర్వాతి కాలంలో జట్టులో హోరాహోరీగా పేరు తెచ్చుకున్న యువరాజ్ సింగ్, ధోనిలు రంజి స్థాయిలో పోటీ పడటం ఈ సినిమాలో చూడటం చాలా ముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా 84 పరుగులు కొట్టి ఔట్ అయిన ధోని టీమ్‌ని పంజాబ్ టీమ్ తరఫున బ్యాటింగ్‌లో దిగిన యువరాజ్ సింగ్ ఉతికి ఆరేయడం ఆ విషయాన్ని ధోని చాలా మురిపెంగా చెప్పడం చాలా బాగుంటుంది. ముఖ్యంగా యువరాజ్‌లా వేసిన కుర్రాడు యువరాజ్లాగే కనిపిస్తూ చాలా బాగా చేశాడు. ధోని తను కెప్టెన్ అయ్యాక ఎవరి హయాంలో అయితే తాను పైకి వచ్చాడో ఆ ప్లేయర్స్ (నేరుగా పేర్లు చెప్పరు... కాని మనకు తెలుసు వాళ్లు... రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్)ను పక్కన పెట్టడంలో కఠినంగా వ్యవహరించడం అది విమర్శలకు దారి తీయడం చూచాయగా కనిపిస్తుంది. ‘నాకు ఆటగాళ్లు కాదు కావలసింది... విజయం కోసం ఆకలిగొన్న వ్యక్తిత్వాలు’ అని ధోని సెలక్టర్లతో చెప్తాడు. ‘నాకు స్వతంత్రం ఇస్తే తప్ప భారత్‌ను ప్రపంచ కప్ కోసం సిద్ధం చేయలేను’ అని ధోని కుండ బద్దలు కొడతాడు. అతడి నిర్ణయం సబబే అని చరిత్ర నిరూపించింది. ‘వెన్స్ డే’, ‘బేబీ’ వంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమాను కంగారు లేకుండా మోసకారి తనంతో కాకుండా నిజాయితీగా తీసే ప్రయత్నం చేశాడు. మూడు గంటల నిడివితో తీరిగ్గా చెప్తాడు. ఫస్ట్ హాఫ్ మనం మైమరపుతో చూస్తాం. సెకండ్ హాఫ్‌లో డ్రమెటిక్‌గా పైకి లేచే కథనం కథలోనే లేకపోవడం వల్ల కొంచెం నిరాసక్తంగా అనిపించినా నటీనటుల ప్రతిభ, దర్శకుడి ప్రావీణ్యం సినిమాను గట్టెక్కించేస్తాయి. ముఖ్యంగా ఇవాళ మన ఎదుట హీరోలుగా నిలిచిన వ్యక్తులు అలా ఉత్త పుణ్యానికి హీరోలు అయిపోరనీ దాని వెనుక ఎంతో కఠోరమైన పరిశ్రమ ఉంటుందనీ ఎవరైనా ఏ రంగంలో అయినా పైకి రావాలంటే అటువంటి పరిశ్రమ అవసరమని ఈ సినిమా ఈనాటి యువతకు బడి పిల్లలకు చెబుతుంది. దుర్వ్యసనాల జోలికి పోకుండా లక్ష్య శుద్ధికి కట్టుబడి ఉండాలని కూడా ఈ సినిమా చాలా బలంగా చెప్తుంది. స్మోకింగ్ అయితే అసలు కనిపించలేదు. ధోనిని కుటుంబం మొత్తం చూడొచ్చు. ముఖ్యంగా పిల్లలకు చూపించవచ్చు. తల్లిదండ్రులకు పిల్లలను ఏ ట్రైన్ ఎక్కించాలో తెలుస్తుంది. పిల్లలకు ఏ ట్రైన్‌ను వదిలిపెట్టాలో తెలుస్తుంది. గుడ్ ఎటెంప్ట్. పదికి ఎనిమిది మార్కులు. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
30న తెరపైకి ఎంఎస్.ధోని
భారత క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోని జీవితం ఒక సంచలనమే కాదు ఈ తరం యువతకు గొప్ప స్ఫూర్తి కూడా. వీధి క్రికెట్ క్రీడగా పేర్కొనే రంజీ ట్రోఫీ నుంచి ప్రపంచ స్థాయి గొప్పక్రీడాకారుడిగా చరిత్ర కెక్కిన ధోని 2011లో భారత క్రికెట్ క్రీడ జట్టుకు కెప్టెన్‌గా సారథ్యం వహించి ప్రపంచ కప్‌ను సాధించి కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కలను నిజం చేశారు. పలు మైలు రాళ్లను అధిగమించిన అసాధారణ క్రీడాకారుడు ధోని. ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహేంద్రసింగ్ ధోనీని ఆయన తండ్రి బాగా చదువుకుని మంచి ఉద్యోగస్తుడిగా చూడాలనుకున్నారు. అయితే ధోనిలో మంచి క్రికెట్ కీపర్ ఉన్నాడని ఆయన పాఠశాల శిక్షకుడు భావించారు. అలా పలువురు శిక్షకుల ఆకాంక్ష, స్నేహితుల ప్రోత్సాహం ధోనీని ఒక గొప్ప క్రికెట్ కెప్టెన్‌గా నిలబెట్టాయి.ధోనికి భారతదేశంపై అపార ప్రేమ. ఆయన జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం ఎంఎస్.ధోని. నీరజ్‌పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్న్రా స్టార్‌స్టూడియోస్ సమర్పణలో ఇన్స్పైర్డ్ ఎంటర్టెయిన్మెంట్స్, ఫ్రైడ్ ఫిల్మ్‌వర్క్స్ సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 30న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.