జేమ్స్‌బాండ్ షూటింగ్లో మళ్లీ ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథానాయక పాత్ర అంటే జేమ్స్ బాండే. తెరపై జేమ్స్‌బాండ్ చేసే వీరోచిత విన్యాసాలకు ముగ్ధులు కానివాళ్లు ఉండరు. ఇప్పటివరకు 23 జేమ్స్ బాండ్ చిత్రాలొస్తే, వాటిలో దాదాపు అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు 24వ బాండ్ తయారవుతున్నాడు. బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ మెండెస్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం వారం రోజుల క్రితం ఓ పోరాట దృశ్యం తీస్తున్నప్పుడు డేనియల్ క్రెగ్ మోకాలికి గాయమైంది.
తాజాగా ఈ షూటింగ్ లొకేషన్లో మరో ప్రమాదం జరిగింది. కెమెరా ఉన్న ఓ ట్రక్ అదుపు తప్పి, దూసుకు రావడంతో సెకండ్ యూనిట్ డెరైక్టర్‌గా చేస్తున్న టెర్రీ మాడ్డెన్కి గాయాలయ్యాయి. ఇవి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన అతణ్ణి ఆస్పత్రిలో చేర్చారు. ప్రాణభయం లేదని డాక్టర్లు పేర్కొనడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.