లక్ష మంది డైరెక్టర్లపై అనర్హత వేటు
సాక్షి, న్యూఢిల్లీ : బ్లాక్‌మనీపై పోరాటంలో భాగంగా షెల్ కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నేడు(మంగళవారం) షెల్ కంపెనీలకు చెందిన 1,06,578 మంది డైరెక్టర్లపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనర్హత వేటు వేసింది. ఈ చర్యల్లో భాగంగా డైరెక్టర్లను గుర్తించడానికి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల వద్ద ఉన్న షెల్ కంపెనీల డేటాను మంత్రిత్వ శాఖ మరింత లోతుగా విశ్లేషిస్తోంది. ఇటీవలే 2.09 లక్షల కంపెనీలపై కూడా ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆయా సంస్థల బ్యాంకు అకౌంట్లను కూడా నిర్భందించింది. 1,06,578 మంది డైరెక్టర్లను కంపెనీల చట్టం 2013, సెక్షన్ 164(2) కింద అనర్హులుగా గుర్తించినట్టు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెక్షన్ 164 కింద, ఈ కంపెనీల్లో డైరెక్టర్ ఎలాంటి ఆర్థిక ప్రకటనను లేదా వార్షిక రిటర్నులను మూడేళ్ల వరకు దాఖలు చేయడానికి వీలులేదని, అంతేకాక మరే ఇతర సంస్థకు వీరు ఐదేళ్ల వరకు పునఃనియామకానికి అర్హులు కారని పేర్కొంది.
ఈ కంపెనీలు మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కంపెనీలను తమ కనుసన్నల్లో ఉంచుతున్నట్టు కూడా పేర్కొంది. డైరెక్టర్ల బ్యాక్‌గ్రౌండ్, వారి గతచరిత్ర, ఆ కంపెనీల్లో వారి పనితీరు వంటి అన్నింటిన్నీ ప్రభుత్వం విశ్లేషిస్తోంది. ఈ డిఫాల్టింగ్ కంపెనీల ప్రొఫెషనల్స్‌ను, చార్టెడ్ అకౌంటెంట్లను, కంపెనీ సెక్రటరీలను, కాస్ట్ అకౌంటెంట్లను మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీరిపై కూడా మంత్రిత్వ శాఖ నిఘా ఉంచింది. కొన్ని కేసుల్లో ప్రొఫెషనల్స్ కూడా అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసిందని తెలిపింది. ప్రాధాన్యత క్రమంలో ఈ సమస్యను సంబంధిత ఏజెన్సీలు చేపడతాయని కార్పొరేట్ వ్యవహారాల సహాయమంత్రి పీపీ చౌదరి చెప్పారు.