‘అదృశ్యం’ కేసులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, ముంబై: తప్పిపోయిన పిల్లలను వెదికేందుకు ముంబై పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాలు అన్ని పోలీసు స్టేషన్లలో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో చదుపుపై ఒత్తిడి, తల్లిదండ్రులపై ఉన్న అసంతృప్తి ఇలా వివిధ కారణాలవల్ల పిల్లలు ఇల్లు వదిలిపోతారు.
ఇలాంటి పిల్లలను వెదికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పిల్లను వెదికే పని ముంబై పోలీసు శాఖకు చెందిన ‘మిస్సింగ్ పర్సన్ బ్యూరో’ చేస్తోంది. కాని ఇలా నగరంలోని పోలీసు స్టేషన్లలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని మారియా అన్నారు. ఈ బృందాలు నవంబర్, డిసెంబర్, జనవరి 31 వరకు పనిచేస్తాయి.
ముంబై నుంచి ప్రతీ యేడాది దాదాపు వేయి మంది పిల్లలు అపహరణకు గురవుతారు. నగరంలో వివిధ పర్యాటక ప్రాంతాలతోపాటు బాలీవుడ్ ప్రముఖ నటీనటుల నివాసాలున్నాయి. వారిని చూసేందుకు ఇంట్లో చెప్పకుండా పిల్లలు పారిపోయి వస్తారు. ఇందులో అత్యధిక శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలే ఉంటారు. వీరంతా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో బస చేస్తారు. తర్వాత మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఇక్కడే ఉండిపోతారు.
ఇలాంటి పిల్లలను వెదికే పని మిస్సింగ్ పర్సన్ బ్యూరో చేస్తుంది. కాని ఈ మూడు నెలల కాలవ్యవధిలో అన్ని పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు వారిని గాలించే పనులు చేపడతాయి. సాధ్యమైనంత మంది పిల్లలను వెదికి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారని డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి చెప్పారు.
2007లో దాదాపు నాలుగు వేల మందికిపెగా పిల్లలు ముంబై, నవీముంబైలలో తప్పిపోయినట్లు రికార్డుల ద్వారా వెల్లడైంది. ఈ సంఖ్యపై మానవ హక్కుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిల్లలను వెదికేందుకు ఒక మార్గదర్శన నియమావళిని అమలు చేయాలని సంఘం ఆదేశించింది. ఆ మేరకు అన్ని పోలీసు స్టేషన్లలో ప్రత్యేక బృందాలను నియమించినట్లు కులకర్ణి చెప్పారు.
తప్పిపోయిన పిల్లల వివరాలు (18 సంవత్సరాల లోపు).....
సంవత్సరం బాలురు బాలికలు
2013 1,200 1,900
2014 600 900
దొరికిన వారి వివరాలు...
2013 1000 1,700
2014 450 700