కాంగ్రెస్‌లో కస్సుబుస్సు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి సీట్ల సర్దుబాటు కొత్త వివాదానికి దారి తీస్తోంది. కూటమిలోని మిత్రపక్షాలు కోరుతున్న స్థానాల విషయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనుకున్న సీట్లను ఎట్టి పరిస్థితిలో వదులుకోవద్దంటూ పార్టీ హైకమాండ్‌ను గట్టిగా కోరుతున్నారు. ఒక్క మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే రెండు నుంచి మూడు సీట్లు మిత్రపక్షాల పేరుతో వదులుకుంటే పార్టీని నమ్ముకుని ఇంతకాలం పనిచేసిన వారి పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు.
కూటమిలోని మిత్రపక్షాలకు స్థానాలు కేటాయిస్తే... ఓడిపోతామంటూ నివేదికలను రూపొందించి పార్టీ పెద్దలకు పంపిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా ఇతరులకు కేటాయించే స్థానాల్లో కచ్చితంగా రెబల్‌గా బరిలోకి దిగుతామంటూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాకూటమి సీట్ల పంపకాల సర్దుబాటు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఇలాం టి కారణాలతో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుండడంతో పార్టీ కేడర్‌లో నిరాశ అలుముకుంటోంది.
చిక్కుముడి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహాకూటమికి సంబంధించి మిత్రపక్షాలన్నీ కూడా మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని సీట్లనే కోరుతున్నాయి. కూటమిలోని టీడీపీ, టీజేఎస్‌లు కొన్ని స్థానాల కోసం పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో మూడు స్థానాలను పెండింగ్‌లో ఉంచుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కూటమిలోని భాగస్వామ్య పార్టీల కోసం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు జడ్చర్ల, మక్తల్ స్థానాలను తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. వీటిలో మక్తల్ నియోజకవర్గం విషయంలో మాత్రం ప్రస్తుతానికి క్లియరెన్స్ ఉన్నట్లు సమాచారం. మక్తల్ స్థానాన్ని టీడీపీ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డికి కేటాయించడం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఇక మహబూబ్‌నగర్, జడ్చర్ల స్థానాల విషయంలో మాత్రం చిక్కుముడి వీడడం లేదు. ఈ రెండు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుతోంది. అయితే మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి కోసం ఇరు పార్టీలు పట్టుబడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో టీజేఎస్‌కు ఒక్క మహబూబ్‌నగర్ స్థానాన్ని పొత్తులో భాగంగా కేటాయించాలని కోరుతోంది. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎర్ర శేఖర్ సైతం జడ్చర్ల వెళ్లే ప్రసక్తే లేదని.. మహబూబ్‌నగర్ స్థానాన్నే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో మిత్రపక్షాలకు కేటాయించే స్థానాల విషయంలో చిక్కుముడి వీడటం లేదు.
స్వతంత్రులుగా...
కూటమిలో భాగంగా మిత్రపక్షాలకు స్థానాలను కేటాయిస్తే.. రెబల్స్‌గా బరిలో దిగడం ఖాయమంటూ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. మక్తల్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తే... సహించేది లేదని స్థానిక నేతలు ప్రకటనలు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైన అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉందని... టీడీపీకి కనుక స్థానాన్ని కేటాయిస్తే రెబర్‌గా బరిలో దిగడం ఖాయమంటూ ప్రకటిస్తున్నారు. ఒకవేళ మక్తల్‌ను పొత్తులో భాగంగా వదులుకుంటే కనుక కాంగ్రెస్ జెడ్పీటీసీ శ్రీహరి రెబల్‌గా బరిలో దిగాలని భావిస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లో కూడా కాంగ్రెస్ టికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. వీరికి కాకుండా మిత్రపక్షాల నేతలకు టికెట్టు కేటాయిస్తే.. రెబల్‌గా బరిలో దిగేందుకు టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద కూటమి చిక్కుముడులు వీడకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.
చెయ్యి గుర్తు మీదే పోటీ చేస్తారా?
మహాకూటమిలో భాగంగా కేటాయించే రెండు లేదా మూడు స్థానాల తరఫున బరిలో దిగాలని భావిస్తున్న అభ్యర్థులు... తమ అనుచరుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలు కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు బలంగా ఉండటం... మహాకూటమిలోని ఇతర పక్షాలు నామమాత్రంగానే ఉండటంతో పోటీ చేసే వారు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీ కానీ టీజేఎస్ తరఫున ఆయా పార్టీల గుర్తుతో పోటీలోకి దిగితే కాంగ్రెస్ కేడర్ పూర్తిగా సహకరిస్తుందా అనే విషయంతో పాటు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉందా అని ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం హస్తం గుర్తుపై పోటీ చేస్తే తప్ప ఇతరులకు సహకరించే పరిస్థితి ఉండదని ఖరాఖండిగా చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యం లో మిత్రపక్షాల అభ్యర్థులు కూడా ‘హస్తం’ గుర్తుపైనే పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడినట్లు రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.