13 వేల పాఠశాలల మూసివేత
పింప్రి, న్యూస్‌లైన్: ప్రభుత్వం పాఠశాలల్లో 20 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉంటే మూసివేయాలని డీఐఎస్ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ ఇలాంటి పాఠశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీన్ని అమలు చే యాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయానికే వదిలేసింది. పాఠశాలలు నడవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం కూడా మూసివేత దిశగా రంగం సిద్ధం చేస్తుంది. ఆయా పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, మూతపడే పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 13 వేల పైచిలుకు ఉన్నాయి. ఈ మేరకు ఆయా జిల్లా విద్యాధికారులు ఆయా పాఠశాలకు నోటీసులను అందజేశారు.
గత సంవత్సరమే సూచన
విద్యార్థులు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని గత సంవత్సరమే డీఐఎస్ఈ (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రభుత్వానికి సూచించింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకొంది. ఇందులో భాగంగా ఆయా పాఠశాలల్లో వివిధ పథకాల ద్వారా విద్యార్థులను పెంచడం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. గ్రామాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు విద్యార్థులను చేరవేసేందుకు వాహనాల ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పించింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. విద్యార్థులు పాఠశాలలకు రాని పరిస్థితులను అధ్యయనం చేసింది. చివరకు మూసివేత వైపే మొగ్గుచూపుతోంది.
అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే..
వెంటనే ఈ పాఠశాలలను మూసివేయ వద్దని రాష్ట్ర శిక్షణ మంత్రాలయం చెబుతున్నా, ప్రభుత్వం మాత్రం మూసివేసేందుకే మొగ్గు చూపుతోంది. గత సంవత్సరం ఉపాధ్యాయులు సేకరించిన వివరాల ప్రకారం 13,905 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మరాఠీ, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సింధి, తమిళం, తెలుగు పాఠశాలలు ఉన్నాయి.
3,700 పాఠశాలల్లో పది మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. 20 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలను ప్రభుత్వం స్థానిక స్వరాజ్య సంస్థలకు అప్పగించింది. ఇట్లాంటివి 13 వేల పాఠశాలలు ఉన్నాయి. పుణే, కొంకణ్ జిల్లాలో ఈ పాఠశాలల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇందులో తెలుగు మీడియం పాఠశాల పుణే దేహు రోడ్ కంటెన్మెంట్లో ఉంది. మూతబడే పాఠశాలలు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.