distribution of alcohol
-
ఏరులై పారిన మద్యం
ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 182 నగదు అక్రమ తరలింపు కేసులు నమోదు కాగా రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.46 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం పంపిణీ కేసులు ఎక్కువగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే నమోదు కావడం విశేషం. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో సుమారు రూ.15 లక్షల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 26న తాడేపల్లిగూడెంలో టీడీపీ నాయకుడు కేవీ సుబ్రమణ్యం నుంచి రూ.లక్షా 25 వేలు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 29న నరసాపురం టౌన్లో టీడీపీ నాయకుడు ఆకుల రమేష్ నుంచి రూ.లక్షా 11 వేలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 30న నరసాపురం టౌన్లో టీడీపీ నాయకుడు కె.ఆదినారాయణ నుంచి రూ.2 లక్షల 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 5న చింతలపూడి మండలం రాఘవపురంలో టీడీపీ నాయకుడు మోరంపూడి వెంకటేశ్వరరావు నుంచి రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 10న నరసాపురంలో టీడీపీ నాయకుడు ఎ.సత్యనారాయణ నుంచి రూ.2 లక్షల 15 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం నాయుడుగూడెంలో ఏప్రిల్ 12న టీడీపీ నాయకుడు టి.విజయ్ వద్ద నుంచి పోలీసులు రూ.13 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 7న నరసాపురంలో టీడీపీ నాయకుడు కోనకంటి సత్యనారాయణ నుంచి పోలీసులు రూ.లక్షా 66 వేలను స్వాధీనం చేసుకున్నారు. -
నేటితో ప్రచారానికి తెర
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొనడంతో ఆయా పార్టీల అభ్యర్థులు కష్ట పడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. పోస్టర్లు, కరపత్రాలు పంచుతూ ఈ ఒక్కసారి తమకు అవకాశం కల్పించాలని, తమను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తామని హామీలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపునకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయని లెక్కలేసుకుంటున్నారు. ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాలకు మంచినీటి పథకాలు, రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేస్తామని, మండలస్థాయిలో ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రచారానికి ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో మందీమార్బలంతో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆయా పార్టీల జిల్లా నాయకులు సైతం తమ అనుచర అభ్యర్థుల విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాగా, గ్రామాల్లో మద్యం, డబ్బు, పలురకాల బహుమతులు పంపిణీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక తెరచాటు రాజకీయం.. బహిరంగ ప్రచారం శుక్రవారంతో ముగియనుండటంతో తెరచాటు రాజకీయానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తరుపున వారి సన్నిహితులు ఓటర్లను కలుసుకుని తాము మళ్లీ కలుస్తామని, ఓటు మాత్రం తమకే వేయాలని హామీలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చే నజరానాలను బేరీజు వేసుకుంటూ పోటీలో ఉన్న అభ్యర్థులు అంతకు మించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనరల్ స్థానాల్లో ఒక్కో ఓటరుకు రూ.3వేల వరకు ముట్టచెపుతున్నట్లు సమాచారం. మద్యం దుకాణాలను బంద్ చేసినప్పటికీ అభ్యర్థులు ముందుగానే వారికి అనుకూలమైన స్థావరాల్లో నిల్వ చేసుకున్నారు. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈసీ నిబంధనలను అభ్యర్థులు తుంగలో తొక్కారు. నిబంధనలు కాదని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. మండలస్థాయిలో ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించినప్పటికీ ఖర్చుల విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించిన దాఖలాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలస్థాయిలో దృష్టి సారించాల్సిన అధికారులు జిల్లాస్థాయిలోనే మకాం వేయడంతో ఎన్నికల ఖర్చులను పూర్తి స్థాయిలో నమో దు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ స్థానాలపైనే పార్టీల ప్రత్యేక దృష్టి... జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఆయా స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. డబ్బు, మద్యం విచ్చలవిడిగా వెదజల్లుతూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆయా స్థానాల్లో నోట్ల కట్టలు వెదజల్లుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎస్సీ రిజర్వు స్థానాలైన వాజేడు, వెంకటాపురం, చర్ల, ఏన్కూరు, అశ్వాపురం స్థానాల్లో భారీస్థాయిలో నగదు పంపిణీకి పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. అక్కడ గెలుపొందిన అభ్యర్థులే చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉండటంతో జిల్లాస్థాయి నాయకులు అక్కడే మోహరించారు. -
ఏరులుగా పారి
కామారెడ్డి, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికలలో పోలైన ఓట్లు 2,39,486 కాగా పోటీలో నిల్చున్న అభ్యర్థులు వాటి కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 50 కోట్లుగా అంచనా. పురపోరులో విచ్చలవిడి ఖర్చు మూలంగా ఒక్కో ఓటుకు రూ. 2 వేలకు పైగా అభ్యర్థు లు వెచ్చించినట్లు తె లుస్తోంది. ఎన్నికల ఖర్చు విషయంలో ఎ లక్షన్ కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా, అభ్యర్థులు మాత్రం డబ్బు ప్రవాహాన్ని పారించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధ న్, ఆర్మూర్ మున్సిపాలిటీలకు గత నెల 30న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే ఆశావహులు ప్రలోభాలకు తెరలేపారు. అడ్డగోలుగా బరిలో నిలిచినవారు పెట్టిన ఖర్చు అడ్డగోలుగా ఉన్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి పట్టణంలో 33 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ప్రతి వార్డులో కనీసం ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది పోటీలో నిల్చున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పని చేశారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు గరిష్టంగా రూ. 20 లక్షలు, మరి కొంత మంది తక్కువలో తక్కువ రూ. 5 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పట్టణంలోని 33 వార్డులలో అభ్యర్థులంతా కలిసి చేసిన ఖర్చు రూ. 10 కోట్లకు పై మాటే అంటున్నారు. కామారెడ్డిలో 39,832 మంది మాత్రమే ఓటు వేశారు. ఇక్కడ ఒక్కో ఓటుకు రూ. రెండు వేలకు పైచిలుకు ఖర్చు చేసినట్లు అంచనా. నగరం... గరం గరం నిజామాబాద్ నగరంలో 50 డివిజన్లకు ఎన్నికలు జరుగగా 1,32,617 మం ది ఓటు వేశారు. అక్కడ అభ్యర్థులు చేసిన ఖర్చు రూ. 20 కోట్లకు పైగా ఉం దని తెలుస్తోం ది. ఆర్మూర్‌లో 26,246 మంది ఓటు హక్కు వినియోగించుకోగా అక్కడ రూ. 10 కోట్లకు పైగా ఖర్చయ్యింది. బోధన్ పట్టణంలో 40,791 మంది ఓటు వేయగా అక్కడ కూడా రూ. 10 కోట్లకు పైగా ఖర్చు చేశారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఖర్చులో ఎక్కువ శాతం ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందే జరిగింది. అంతకుముందు కేవలం ఓట ర్లకు మద్యం తాగించడం, ఇతర ఖర్చులు మాత్రమే అయ్యాయి. అయితే అధిక ఖర్చు కేవలం ఓటర్లను ప్రలోభపెట్టడానికే అయినట్టు తెలుస్తోంది. ఓటుకు వెయ్యి! పోటీ తీవ్రంగా ఉండి ప్రతిష్టాత్మకంగా మారిన కొన్ని వార్డులలో ఓటర్లకు నేరుగా ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు అందజేశారని సమాచార. మరికొన్ని చోట్ల వెండి నాణేలు, కుక్కర్లు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. పలుకుబడి ఉన్న వారు నివసించే కాలనీలలో అయితే విలువైన మద్యం బాటిళ్లను సరఫరా చేశారు. ము రికివాడలు, ఇతర వార్డులలో మహిళలకు చీరెలు, ఇతర సామగ్రిని పంచారు. అభ్యర్థులు గెలుపో.. ఓటమో తేల్చుకునేందుకు సిద్ధమై డబ్బును వెదజల్లినట్లు ఆయా పా ర్టీల కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారు.తాము పెట్టిన ఖర్చు ఎంత? ఎన్ని ఓట్లు వస్తాయి? అంచనాల్లో మునిగి పోయారు. అమలు కాని ఎన్నికల నియమావళి ఎన్నికల కమిషన్ నిర్దేశాల ప్రకారం మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు రూ. 1 లక్షకు మించి ఉండరాదు. అది కూడా బ్యాంక్ అకౌంట్ తెరిచి లావాదేవీ లు జరపాలి. అయితే ఏ ఒక్కచోట కూడా ఆ నిబంధనలు అమలు కాలేదు. అభ్యర్థులు పోటీపడి డబ్బును నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. ఎన్నికల నియమావళి అమలు కావడం లేదని తెలిసినా అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనలతో అయ్యేదేమి లేదన్న రీతిలో అభ్యర్థులు ఖర్చు పెట్టారు.