ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొనడంతో ఆయా పార్టీల అభ్యర్థులు కష్ట పడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. పోస్టర్లు, కరపత్రాలు పంచుతూ ఈ ఒక్కసారి తమకు అవకాశం కల్పించాలని, తమను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తామని హామీలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపునకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయని లెక్కలేసుకుంటున్నారు. ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామాలకు మంచినీటి పథకాలు, రోడ్లు, డ్రెయిన్‌లు ఏర్పాటు చేస్తామని, మండలస్థాయిలో ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రచారానికి ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో మందీమార్బలంతో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆయా పార్టీల జిల్లా నాయకులు సైతం తమ అనుచర అభ్యర్థుల విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాగా, గ్రామాల్లో మద్యం, డబ్బు, పలురకాల బహుమతులు పంపిణీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
ఇక తెరచాటు రాజకీయం..
బహిరంగ ప్రచారం శుక్రవారంతో ముగియనుండటంతో తెరచాటు రాజకీయానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తరుపున వారి సన్నిహితులు ఓటర్లను కలుసుకుని తాము మళ్లీ కలుస్తామని, ఓటు మాత్రం తమకే వేయాలని హామీలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చే నజరానాలను బేరీజు వేసుకుంటూ పోటీలో ఉన్న అభ్యర్థులు అంతకు మించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనరల్ స్థానాల్లో ఒక్కో ఓటరుకు రూ.3వేల వరకు ముట్టచెపుతున్నట్లు సమాచారం. మద్యం దుకాణాలను బంద్ చేసినప్పటికీ అభ్యర్థులు ముందుగానే వారికి అనుకూలమైన స్థావరాల్లో నిల్వ చేసుకున్నారు.
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈసీ నిబంధనలను అభ్యర్థులు తుంగలో తొక్కారు. నిబంధనలు కాదని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. మండలస్థాయిలో ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించినప్పటికీ ఖర్చుల విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించిన దాఖలాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలస్థాయిలో దృష్టి సారించాల్సిన అధికారులు జిల్లాస్థాయిలోనే మకాం వేయడంతో ఎన్నికల ఖర్చులను పూర్తి స్థాయిలో నమో దు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎస్సీ స్థానాలపైనే పార్టీల ప్రత్యేక దృష్టి...
జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఆయా స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. డబ్బు, మద్యం విచ్చలవిడిగా వెదజల్లుతూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆయా స్థానాల్లో నోట్ల కట్టలు వెదజల్లుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎస్సీ రిజర్వు స్థానాలైన వాజేడు, వెంకటాపురం, చర్ల, ఏన్కూరు, అశ్వాపురం స్థానాల్లో భారీస్థాయిలో నగదు పంపిణీకి పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. అక్కడ గెలుపొందిన అభ్యర్థులే చైర్‌పర్సన్ అయ్యే అవకాశం ఉండటంతో జిల్లాస్థాయి నాయకులు అక్కడే మోహరించారు.
నేటితో ప్రచారానికి తెర
Published Fri, Apr 4 2014 1:50 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement