
ఏరులై పారిన మద్యం
ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 182 నగదు అక్రమ తరలింపు కేసులు నమోదు కాగా రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.46 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం పంపిణీ కేసులు ఎక్కువగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే నమోదు కావడం విశేషం. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో సుమారు రూ.15 లక్షల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 26న తాడేపల్లిగూడెంలో టీడీపీ నాయకుడు కేవీ సుబ్రమణ్యం నుంచి రూ.లక్షా 25 వేలు స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 29న నరసాపురం టౌన్‌లో టీడీపీ నాయకుడు ఆకుల రమేష్ నుంచి రూ.లక్షా 11 వేలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 30న నరసాపురం టౌన్‌లో టీడీపీ నాయకుడు కె.ఆదినారాయణ నుంచి రూ.2 లక్షల 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 5న చింతలపూడి మండలం రాఘవపురంలో టీడీపీ నాయకుడు మోరంపూడి వెంకటేశ్వరరావు నుంచి రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 10న నరసాపురంలో టీడీపీ నాయకుడు ఎ.సత్యనారాయణ నుంచి రూ.2 లక్షల 15 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం నాయుడుగూడెంలో ఏప్రిల్ 12న టీడీపీ నాయకుడు టి.విజయ్ వద్ద నుంచి పోలీసులు రూ.13 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 7న నరసాపురంలో టీడీపీ నాయకుడు కోనకంటి సత్యనారాయణ నుంచి పోలీసులు రూ.లక్షా 66 వేలను స్వాధీనం చేసుకున్నారు.