సాక్షి, గుంటూరు : ‘‘హలో..బాస్ ఈ మండలంలో పలానా మద్యం షాపులను మేమే చేయాలి. వాటికి దరఖాస్తులు చేయొద్దు. ఒకవేళ చేసిన తరువాత లాటరీలో వస్తే అందులో సగం వాటా మాకివ్వాల్సి ఉంటుంది. మా మాట కాదని ఎక్కువ చేస్తే వ్యాపారం ఎలా చేస్తావో మేమూ చూస్తాం.’’ ఇదీ మద్యం వ్యాపారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్న తీరు... మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఎంతో మంది వ్యాపారులు డీడీలు తీసి దరఖాస్తు చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, టీడీపీ మండల నాయకులు, ఎమ్మెల్యేలు నేరుగా వారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే దుకాణాలను గుర్తించి వాటికి ఎవరూ పోటీ తగలవద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో గిరాకీ ఉన్న దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు రాకుండా టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టు తెలుస్తోంది. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి దుకాణం అప్పట్లో రూ. 5.20 కోట్లకు టెండర్ వేసి అక్కడి వ్యాపారులు దక్కించుకున్నారు. అంత గిరాకీ ఉన్న దుకాణానికి ప్రస్తుతం ఎవరూ దరఖాస్తు చేయవద్దంటూ అక్కడి టీడీపీ నేతలు వ్యాపారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఎక్సైజ్ అధికారులతోనే రాయబారాలు నడుపుతున్నారు.
ఎక్కడైనా టీడీపీ సిండికేట్ మాత్రమే ఉండాలట...
జిల్లాలో ఏ మండల కేంద్రంలో నైనా సరే ఎవరికి షాపులు వచ్చినా అందులో టీడీపీ నేతలకు వాటాలు ఇచ్చి వారి ఆధ్వర్యంలో మాత్రమే సిండికేట్‌గా ఏర్పాటవ్వాలన్నది టీడీపీ నేతల ఆకాంక్ష. ఏ పార్టీకి చెందిన వారైనా సరే స్లీపింగ్ పార్టనర్లుగా మాత్రమే ఉండాలి. పెత్తనమంతా తమ వారే చేయాలి. లేదంటే ఆ సిండికేట్లపై ఎక్సైజ్ అధికారుల చేత పదేపదే దాడులు చేయించి కేసులు నమోదు చేయిస్తామంటూ నేరుగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఎంతో మంది వ్యాపారులు దరఖాస్తు చేయకుండా వెళుతున్నట్టు సమాచారం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్న తాము వీరి దయాదాక్ష్యణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదంటూ టీడీపీ నేతల తీరుపై వ్యాపారులు మండిపడుతున్నారు.
ఎక్సైజ్ అధికారులపై పెరుగుతున్న ఒత్తిళ్లు...
తమకు కావాల్సిన దుకాణాలకు ఎవరైతే దరఖాస్తు చేస్తారో వారి వివరాలు వెంటనే చెప్పాలంటూ టీడీపీ నేతల నుంచి ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. దరఖాస్తుదారుల అడ్రస్ తెలుసుకుని వారిని నయానో భయానో ఒప్పించి లాటరీ తగిలినా ఆ షాపును తమకు అమ్మే విధంగా మంతనాలు సాగిస్తున్నారు. అయితే దుకాణాలన్నీ టీడీపీ నేతలకే దక్కేలా ఉండటంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ఎక్సైజ్ అధికారులు భయాందోళన చెందుతున్నారు.
మద్యం షాపులకు దరఖాస్తు చేయొద్దు
Published Sat, Jun 27 2015 4:50 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement