పౌరసరఫరా శాఖాధికారుల దాడులు
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి జె. శాంతకుమారి నేతృత్వంలో అధికారులు స్టోన్‌హౌస్‌పేటలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణాలపై సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ షాపులపై కూడా అధికారులు దాడులు నిర్వహిస్తారనే అనుమానంతో పలువురు వ్యాపారులు తలుపులు మూసివేసి పరారయ్యారు. స్థానిక పప్పుల వీధిలో రోజూ ఉదయం విపరీతమైన రద్దీగా ఉంటుంది. అటువంటిది అధికారుల దాడులతో గంట పాటు ఆ ప్రాంతం బోసిపోయింది. పప్పులవీధిలో సుమారు 40 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురాళ్ల వీధిలోని దుకాణాలపై దాడులు నిర్వహించారు. దీంతో అందరు తలుపులు ముసివేసి వెళ్లిపోయారు. చివరకు పంచనామ నిర్వహించి ఇళ్లను తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించడంతో ఒక్కొక్కరుగా వచ్చి తలుపులు తీశారు.
ముందు గదిలో ఇతర వస్తువుల విక్రయం.. లోపలికి పోతే గ్యాస్ సిలిండర్ల వ్యాపారం చేస్తున్నారు. బాత్రూమ్లు, బెడ్రూమ్లు, మంచాల కింద సిలిండర్లను దాచి పెట్టారు. కింద సిలిండర్ల ఉంచి పైన గోతాలు వేసి దాచారు. అధికారులు విస్తృతంగా గాలించి అక్రమంగా ఉన్న 42 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 82 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 20 మందికి పైగా 6ఏ కేసులు నమోదు చేశారు. డీఎస్ఓ శాంతకుమారి మాట్లాడుతూ గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిలిండర్లను పూర్తిస్థాయిలో పరిశీలించి ఏ ఏజెన్సీల నుంచి వచ్చాయో పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏజీపీఓ లక్ష్మణబాబు, సీఎస్డీటీలు పుల్లయ్య, నిరంజన్, లాగరస్ పాల్గొన్నారు.