TS Election 2023: ఎన్నికలు సమీపిస్తుండగా.. డివిజన్ల పోరు!
మెదక్: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లు చేసి దుబ్బాకను డివిజన్ చేయకపోవడంతో సాధన సమితి నాయకులు పోరుబాట పట్టారు. రెవెన్యూ డివిజన్‌కు అన్ని విధాలుగా అర్హత ఉన్నప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో 2016లో దుబ్బాక పట్టణంలో 45 రోజుల పాటు ఉద్యమం తీవ్రంగా జరిగింది. జిల్లాల పునర్విభజన సమయంలో దుబ్బాక డివిజన్ ఆలోచన ఉన్నప్పటికీ చివరి నిమిషంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేట జిల్లా లో కలిపి హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేశారు.
6 మండలాలతో దుబ్బాక డివిజన్..
దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉన్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి–అక్బర్పేట మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలో, అలాగే.. చేగుంట, నార్సింగ్ మండలాలు మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి అక్బర్పేట మండలాలు సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో, దౌల్తాబాద్, రాయపోల్ మండలం గజ్వేల్ డివిజన్లో చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్లో ఉన్నాయి.
దీంతో నియోజకవర్గంలోని మండలాలు రెండు జిల్లాల్లో మూడు డివిజన్లలో ఉండటంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన అక్బర్పేట–భూంపల్లి మండలాలను కలిపి ఆరు మండలాలతో దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని , అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉద్యమానాకి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ అంశం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు డివిజన్ సాధన సమితి నాయకులు యత్నిస్తున్నారు.