ఆగని విభజన రగడ
నల్లగొండ: జిల్లాలు, మండలాల విభజన నేపథ్యంలో డిమాండ్ల సాధనకు పలు ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో కొత్తగా ఏర్పడిన మాడ్గులపల్లి మండలంలో కాకుండా పాత మండలమైన తిప్పర్తిలోనే కొనసాగించాలని కొత్తగూడెం గ్రామస్తులు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. గట్టుప్పల మండలాన్ని తుది జాబితా నుంచి తొలగించడంపై గ్రామస్తులు ఆందోళనలు ఉధృతం చేశారు.
ఆత్మకూరు(ఎం) మండలం చాడ, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలను మోటకొం డూరు మండలంలో కలపొద్దని ఆయా గ్రామస్తులు రాయిగిరి-మోత్కూరు మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. రామన్నపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దిలావర్‌పూర్, ఇక్కుర్తి గ్రామాలను కొత్తగా ఏర్పడే మోటకొండూర్‌లో కలపొద్దని ఆయా గ్రామస్తులు యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రామాయంపేటలో 48 గంటల బంద్
రామాయంపేట: రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మెదక్ జిల్లా రామాయంపేటలో ఉద్యమం తీవ్రస్థారుుకి చేరుకుంది. 48 గంటల బంద్‌లో భాగంగా గురువారం పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వందలాది మంది రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలు 44వ నంబర్ జాతీయ రహదారిపై అరగంటపాటు రాస్తారోకో చేశారు.