Divisional Railway Manager
-
'ప్రత్యేక బోగీల ఏర్పాటు వీలుకాదు'
సాక్షి, హైదరాబాద్ : వలస కార్మికుల స్వస్థలాల తరలింపుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వలస కార్మికులకు అదనపు బోగీల ఏర్పాటు విషయమై హైకోర్టు భాటియాను ప్రశ్నించింది. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలు కాదన్నారు. బీహార్‌కు చెందిన 45 మంది వలస కూలీలను రేపు స్వస్థలాలకు చేరుస్తామని తెలిపారు. అత్యవసర కోటాలో రేపటి రైళ్లలో టికెట్లు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కలెక్టర్లు కోరితే రోజుకు 50 మంది వలస కూలీలకు ఈక్యూలో టికెట్లు కేటాయించేదుకు సిద్ధమని ఆనంద్ భాటియా తెలిపారు. వలస కార్మికులందరూ తమ స్వస్థలాలకు చేరే వరకు ఇదే విధానం కొనసాగించాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది. -
రైల్–బోట్.. ఇది రైల్వే రోబో
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆసుపత్రిలో రోబో ఆకట్టుకుంటోంది. సొంతంగా రైల్వే అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో రూపొందించిన ఈ రోబో, కోవిడ్ బాధితులకు వైద్య సేవలు చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది వారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరాన్ని బాగా తగ్గించనుంది. దీనికి రైల్–బోట్ అనే పేరు పెట్టారు. అదనపు డివిజినల్ రైల్వే మేనేజర్ (హైదరాబాద్) హేమ్‌సింగ్ బనోత్‌కు రోబోటిక్ శాస్త్రంలో అవగాహన ఉంది. దీంతో ఆయన తన సిబ్బంది సహకారంతో ఈ రోబోను రూపొందించారు. రోగులకు మందులు, ఆహారం అందించటం, వారి శరీర ఉష్ణోగ్రత చూడటం, వారి వద్దకు వైద్య పరికరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లటం.. తదితరాల్లో దీని ఉపయోగం ఉండనుంది. పాన్ అండ్ టిల్ట్ ఫంక్షన్స్, రియల్ టైం వీడియో అనుసంధానం ఉండటంతో, వైద్యులు, రోగులు దూరంగా ఉండే దీని ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు రికార్డు కూడా అవుతాయి. వారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్టు నమోదైతే అలారం మోగించి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఇది 80 కిలోల బరువును మోసుకెళ్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్, రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్ కంట్రోలర్‌తో దీన్ని ఆపరేట్ చేస్తారు. ప్రయోగాత్మకంగా లాలాగూడలోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆసుపత్రిలో దీనిని వినియోగిస్తున్నారు. రోబో పనితీరును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పరిశీలించి, రూపొందించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
- డీఆర్ఎం ప్రసాద్ - పిడుగురాళ్ళ రైల్వేస్టేషన్లో వసతులపై ఆరా పిడుగురాళ్ల: ఆదర్శ రైల్వేస్టేషన్ అయిన పిడుగురాళ్లలో ప్రయాణికులకు మెరగైన సౌకర్యాలను అందజేసేందుకు తగు చర్యలు చేపడతామని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక రైల్వేస్టేషన్‌కు అధికారుల బృందంతో వచ్చిన డీఆర్ఎం తొలుత రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలపై ఆరాతీశారు. స్టేషన్‌మాస్టర్ కె.వరకృపాకరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన బోరింగు పంపులను, వెయిటింగ్‌హాలు, సిబ్బంది క్వార్టర్లను పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తగుచర్యలు తీసుకోవాలని, పాడైన బోరింగు పంపులను, నీటి కుళాయిలను తక్షణమే బాగుచేయించాలని ఆదేశించారు. గాంధీనగర్‌వద్దనున్న మొండిగేటును డీఆర్ఎం పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పక్కనే జానపాడురోడ్డులో రైల్వే గేటు ఉన్నందున సమీపంలోని గాంధీనగర్ మొండిగేటుకు గేటు ఏర్పాటు సాధ్యం కాదని, అందుకే అక్కడ కాపలాకు ఉద్యోగిని నియమించామన్నారు. ఆ ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వర్తించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో వివిధ సమస్యలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై డీఆర్ఎం ప్రసాద్ అసహనం వ్యక్తంచేశారు. డీఆర్ఎం వెంట ఏసీఎం అలీఖాన్, అధికారులు సతీష్, ఎంఎం ఖాన్ తదితరులు ఉన్నారు.