Divya Anveshita
-
షి ఈజ్ సెలబ్రిటీ క్వీన్
సాక్షి,సిటీబ్యూరో: ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి దివ్య అన్వేషిత కొమ్మరాజు. ‘ఫేస్బుక్’లో లైవ్ ఆప్షన్ వచ్చాక భారతీయ సంప్రదాయంతో ముస్తాబై లైవ్‌లోకి వచ్చింది. మొదటి వీడియోలోనే నెటిజన్లను తన చక్కని రూపంతో ఆకట్టుకుంది. ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ నెటిజన్లు అక్కున చేర్చుకున్నారు. ‘ఫేస్బుక్’ ద్వారా తను చేస్తున్న మంచి పనులను గుర్తిస్తూ గతేడాది ‘సాక్షి’ ‘షీ ఈజ్ ఫేస్బుక్ క్వీన్’ అంటూ ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ‘యస్.. షీ ఈజ్ రియల్లీ ఫేస్బుక్ క్వీన్’ అంటూ సాక్షాత్తు ‘ఫేస్బుక్’ కంపెనీనే అంగీకరించింది. ఒక సాధారణ యువతికి ఫేస్బుక్ అధికారికంగా ‘బ్లూ టిక్’ ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుంటుంది. పదేళ్ల క్రితం ట్రంకు పెట్టెతో ఖమ్మం నుంచి సిటీకి వచ్చిన దివ్య అన్వేషిత ఈ రోజు టాప్ సెలబ్రిటీలకు దీటూగా ‘బ్లూటిక్’ని సాధించడంపై ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలకు దక్కిన గౌరవం తనకు దక్కడం హైదరాబాదీగా గర్వంగా ఉందంటోంది దివ్య అన్వేషిత. -
ఫేస్బుక్ లైవ్‌తో కేరళకు రూ.5లక్షలు సాయం
హిమాయత్ నగర్: కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఫేస్బుక్ సెలబ్రిటీ, దిల్షుక్నగర్ వాసి కొమ్మరాజు దివ్య అన్వేషిత ఇచ్చిన పిలుపునకు అనేకమంది స్పందించారు. సుమారు గంటన్నర్ర పాటు ఆమె ఫేస్బుక్ లైవ్ షో నిర్వహించింది. రూపాయి నుంచి మీ శక్తి మేరకు ఎంతైనా సాయం చేయోచ్చని కోరిందిం. స్పందించిన నెటిజన్లు పేటీఎం ద్వారా రూ.10 నుంచి రూ.20వేల చొప్పున తోచినంత నగదును ట్రాన్స్ఫర్ చేశారు. సుమారు రూ.5లక్షలు దివ్య అన్వేషిత ఫేస్బుక్ లైవ్‌ద్వారా కేరళకు సాయం చేయడం గమనార్హం. -
వీరి క్రేజ్‌కు సెలబ్రిటీలు సైతం అవాక్కు..
ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు విజయం సాధించాలంటే దానికి ఎన్నో ప్రయాసలు పడి మరెన్నో దారులు వెతకాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతిభ మనదైతే ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగం విజయపు మార్గాలను సమూలంగా మార్చేసింది. సామాన్యుల్ని సైతం ఒక్క రోజులో సెలబ్రిటీలుగా మార్చే శక్తితో రోజుకో కొత్త టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇదే క్రమంలో సోషల్ సైట్లే వేదికగా అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకున్న నగరవాసులు కొందరితో ముచ్చటించినప్పుడు ‘విజయ’ విశేషాలను పంచుకున్నారు. హిమాయత్‌నగర్ : ఒకరు ఫేస్బుక్లో స్టార్ అయితే.. ఇంకొకరు యూట్యూబ్‌కు రిలేటెడ్‌గా ఉన్న ఛానల్స్‌లో స్టార్. ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెట్టినా.. ఛానల్లో ఒక్క డైలాగ్‌తో వీడియో పోస్ట్ చేసినా వేలల్లో లైక్‌లు, లక్షల్లో వ్యూస్ రావడం ఖాయం. ఫేస్బుక్ సెలబ్రిటీగా దిల్‌సుక్‌నగర్‌కు చెందిన దివ్య అన్వేషిత కొమ్మరాజు పేరుపొందితే.. హిమాయత్‌నగర్‌కు చెందిన హారిక అలేఖ్య దేత్తడి ఛానల్లో దుమ్మురేపుతోంది. మల్కాజ్గిరి వాసి నాగభార్గవి ఫన్బకెట్లో పాగా వేసింది. వీళకున్న క్రేజ్‌కి టాలీవుడ్ స్టార్లు సైతం విస్తుబోతున్నారు. ఒక్క ఎపిసోడ్‌తో స్టార్డమ్ రావాలని లేకున్నా అనుకోకుండా ఇలా వచ్చా. ఇప్పుడు విడిచిపెట్టలేకపోతున్నా. ‘అమ్మాయి ఇంటికి దారేది’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశా. ఈ ఫిల్మ్ నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరువాత ఫన్బకెట్లో 13వ ఎపిసోడ్లో అడుగుపెట్టా. ఇప్పుడు 139 ఎపిసోడ్ నడుస్తోంది. ఫన్బకెట్లో నా స్టార్డమ్ చూసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు అందరూ నాకు దగ్గరయ్యారు. నేను ఎక్కడకు వెళ్లినా.. ప్రేక్షకులు నన్ను గుర్తించి నాతో సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో చాలా సంతోషంగా ఉంది. ఇది చూసిన మా అమ్మ గర్వంగా ఫీలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. – నాగభార్గవి, ఫన్‌బకెట్ సెలబ్రిటీ దేత్తడి అమ్మాయిగా గుర్తింపు మా ‘దేత్తడి’ ఛానల్‌కు 3 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ ఉన్నారు. ఈ ఛానల్లో నేను ఇప్పటి వరకు పది వీడియోలు చేశాను. వీటిలో ‘ఫ్రస్టేషన్ తెలంగాణ పిల్ల, హుషార్పిల్ల, తెలంగాణ పిల్ల బేరామాడితే, సేల్స్ గర్ల్స్, ఫ్రస్టేషన్ ఎంబీబీఎస్ స్టూడెంట్’ వంటివి బాగా క్లిక్కయ్యాయి. ఎక్కడికెళ్లినా దేత్తడిలో చేసిన అమ్మాయి.. అంటూ గుర్తు పట్టి మరీ పలకరిస్తున్నారు. యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌తోనే సోషల్ మీడియా బాట పట్టాను. నేను చేసిన ప్రతి వీడియోకు పది లక్షలకు పైగా వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. – హారిక అలేఖ్య, దేత్తడి సెలబ్రిటీ ఫేస్బుక్ మార్చేసింది.. నేను 2016 వరకు చాలా సాధారణ అమ్మాయినే. ఫేస్బుక్లో ‘లైవ్ వీడియో’ ఆప్షన్ వచ్చినప్పుడు ఒకరోజు లైవ్ చేశా. రెండు గంటల పాటు చేసిన లైవ్‌కి అదే టైంలో 70 వేల మందికి పైగా చూశారు. ఈ స్ఫూర్తితోనే లైవ్‌ని కంటిన్యూ చేశా. ఇప్పుడు పది నుంచి పదిహేను లక్షల మంది వ్యూస్ రావడం చాలా గర్వంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్బుక్ నన్ను స్టార్‌గా మార్చేసింది. నాకు ఏ సమస్య ఉన్నా.. ఇతరులకు ఎదైనా సమస్య వచ్చినా నేను ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి చెప్పి పరిష్కరించడం ఆనందంగా ఉంది. – దివ్య అన్వేషిత,ఫేస్బుక్ సెలబ్రిటీ -
ఫేస్బుక్ క్వీన్
ఈ అమ్మాయి పేరు దివ్య అన్వేషిత. ఈమె సెలబ్రిటీ కాదు.. హీరోయిన్ అంతకన్నా కాదు. కానీ.. ఫేస్ బుక్‌లో విపరీతమైన ఫాలోయింగ్. దివ్య ప్రతిరోజు నిర్వహించే లైవ్ డిస్కషన్‌కు లక్షల్లో లైకులు, కామెంట్లు. అసలేంటీ దివ్య ప్రత్యేకత? ఎందుకింత ఫాలోయింగ్? లంగావోణి ధరించి, నుదిటిపై బొట్టు పెట్టుకొని.. అచ్చమైన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తయారైన ఓ అమ్మాయి హాయ్ అంటూ ఓరోజు ఫేస్బుక్లో నెటిజనులను పలకరించింది. ఎవరీ అమ్మాయి? అని ఆసక్తితో అందరూ ఫాలో అయ్యారు. అలా ప్రారంభించిన తొలిరోజే 70వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈమె లైవ్ డిస్కషన్లో ఏవో సరదా కబుర్లు ఉండవు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై చర్చోపచర్చలు ఉంటాయి. అందుకే దివ్య డిస్కషన్‌కు లక్షల్లో వ్యూస్వస్తున్నాయి. ఆమె లైవ్‌ను 10లక్షల మంది ఫాలో అవుతుండడం విశేషం. హిమాయత్‌నగర్: దిల్‌సుఖ్‌నగర్‌లోని మధురాపురీ కాలనీకి చెందిన దివ్య అన్వేషిత కొమ్మరాజుమ్యూజిక్లో డిప్లొమా చేసింది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక రంగంలో రాణించి, అందరి మన్ననలు అందుకోవాలనే తపన. ఈ కోరికతోనే మ్యూజిక్ నేర్చుకుంటూ, పాటలు పాడేది. ఫేస్బుక్లో లైవ్ ఆప్షన్ వచ్చాక, ఆమె దానిపై దృష్టి కేంద్రీకరించింది. ప్రతిరోజు సాయంత్రం ఫేస్బుక్ ద్వారా దివ్య లైవ్‌లోకి వస్తుంది. ఈ లైవ్‌లో ఎందరినో పలకరిస్తూ.. వారితో మమేకం అవుతుంది. లైవ్‌లోనే కాల్స్ మాట్లాడుతూ... సలహాలు, సూచనలు ఇస్తుంది. నెటిజనులు తాము వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను దివ్యతో పంచుకుంటారు. ఈమె ఇచ్చే సలహాలు, సూచనల కోసం కొన్ని లక్షల మంది లైవ్‌లో చాట్ చేయడంహాట్టాపిక్గా మారింది. గత రెండేళ్లలో ఈమె లైవ్‌లలో ఇప్పటివరకు 20–30 సార్లు 17లక్షలవ్యూస్ రాగా, 60–70సార్లు 5–7లక్షల వ్యూస్ ఉండడం గమనార్హం. ఆప్యాయంగా... అండగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ లైవ్ ప్రారంభించే దివ్య... ఎంతోమందికి అండగా నిలుస్తోంది. జీవితంపై విరక్తితో, వివిధ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి దృక్పథాన్ని మార్చి భరోసా ఇస్తోంది. ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు తన ప్రేమ విఫలమైందని, ఇక తనకు బతకాలని లేదని ఫేస్బుక్ లైవ్‌లో దివ్యతో ఫోన్లో మాట్లాడాడు. ‘తల్లిదండ్రుల కంటే ప్రేమ, అమ్మాయి గొప్పది కాదంటూ’ దివ్య అతనికి వివరించింది. ఇప్పుడా యువకుడు వ్యాపారం చేసుకుంటూ హాయిగా ఉన్నాడని ఆనందం వ్యక్తం చేసింది దివ్య. ఈమె లైవ్ డిస్కషన్ ఎప్పుడూ కరెంట్ ఇష్యూస్పైనే ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన కథువా ఘటనపై దివ్య లైవ్ ఏకంగా నాలుగు గంటలు కొనసాగింది. ఓ అమ్మాయిగా తాను బయట ఎదుర్కొనే సమస్యలను సైతం ఆరోజు లైవ్‌లో ఆమె వివరించింది. యాడ్‌లో నాగ్‌తో... ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ యాడ్‌లో యాంకర్‌గా దివ్య చేసింది. అందులో హీరో నాగార్జునతో కలిసి చేసే అవకాశం దక్కింది. ఈ షూటింగ్ సందర్భంగా నాగ్ తనను అభినందించారని తెలిపింది. దివ్య లైవ్‌కు ప్రతిరోజు కనీసం రెండు లక్షలకు వ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘92.7 బిగ్ ఎఫ్ఎం’ డిజిటల్ రాక్‌స్టార్ అవార్డుతో ఆమెను ఇటీవల సత్కరించింది. దివ్య ఫేస్బుక్ లైవ్‌తో ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చిందని ఆర్జే శేఖర్ చెప్పారు. లక్ష్యం.. 24 గంటలు ఏకదాటిగా 24గంటలు లైవ్ నిర్వహించి రికార్డు నెలకొల్పాలని ఉంది. దీనికోసం ఫేస్బుక్ ప్రతినిధులను సంప్రదిస్తున్నాను. నా లైవ్ ద్వారా ఎంతోమందికి భరోసా ఇస్తున్నాను. నేను చెప్పే మాటలు స్ఫూర్తిగా చాలామంది జీవితంలో పైకి ఎదగడం, నిరాశావాదం నుంచి బయటపడడం నాకు సంతృప్తిని ఇస్తోంది. -
ఫేస్బుక్ లైవ్‌తో సెలబ్రిటీ హోదా