నాగభార్గవి, ఫన్‌బకెట్, హారిక అలేఖ్యదేత్తడి సెలబ్రిటీ, దివ్య అన్వేషిత ఫేస్‌బుక్ సెలబ్రిటీ
ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు విజయం సాధించాలంటే దానికి ఎన్నో ప్రయాసలు పడి మరెన్నో దారులు వెతకాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతిభ మనదైతే ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగం విజయపు మార్గాలను సమూలంగా మార్చేసింది. సామాన్యుల్ని సైతం ఒక్క రోజులో సెలబ్రిటీలుగా మార్చే శక్తితో రోజుకో కొత్త టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇదే క్రమంలో సోషల్ సైట్లే వేదికగా అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకున్న నగరవాసులు కొందరితో ముచ్చటించినప్పుడు ‘విజయ’ విశేషాలను పంచుకున్నారు.
హిమాయత్‌నగర్ : ఒకరు ఫేస్‌బుక్‌లో స్టార్ అయితే.. ఇంకొకరు యూట్యూబ్‌కు రిలేటెడ్‌గా ఉన్న ఛానల్స్‌లో స్టార్. ఫేస్‌బుక్‌లో ఒక్క పోస్ట్ పెట్టినా.. ఛానల్‌లో ఒక్క డైలాగ్‌తో వీడియో పోస్ట్ చేసినా వేలల్లో లైక్‌లు, లక్షల్లో వ్యూస్ రావడం ఖాయం. ఫేస్‌బుక్ సెలబ్రిటీగా దిల్‌సుక్‌నగర్‌కు చెందిన దివ్య అన్వేషిత కొమ్మరాజు పేరుపొందితే.. హిమాయత్‌నగర్‌కు చెందిన హారిక అలేఖ్య దేత్తడి ఛానల్‌లో దుమ్మురేపుతోంది. మల్కాజ్‌గిరి వాసి నాగభార్గవి ఫన్‌బకెట్‌లో పాగా వేసింది. వీళకున్న క్రేజ్‌కి టాలీవుడ్ స్టార్లు సైతం విస్తుబోతున్నారు.
ఒక్క ఎపిసోడ్‌తో స్టార్‌డమ్
రావాలని లేకున్నా అనుకోకుండా ఇలా వచ్చా. ఇప్పుడు విడిచిపెట్టలేకపోతున్నా. ‘అమ్మాయి ఇంటికి దారేది’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశా. ఈ ఫిల్మ్ నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరువాత ఫన్‌బకెట్‌లో 13వ ఎపిసోడ్‌లో అడుగుపెట్టా. ఇప్పుడు 139 ఎపిసోడ్ నడుస్తోంది. ఫన్‌బకెట్‌లో నా స్టార్‌డమ్ చూసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు అందరూ నాకు దగ్గరయ్యారు. నేను ఎక్కడకు వెళ్లినా.. ప్రేక్షకులు నన్ను గుర్తించి నాతో సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో చాలా సంతోషంగా ఉంది. ఇది చూసిన మా అమ్మ గర్వంగా ఫీలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
– నాగభార్గవి, ఫన్‌బకెట్ సెలబ్రిటీ
దేత్తడి అమ్మాయిగా గుర్తింపు
మా ‘దేత్తడి’ ఛానల్‌కు 3 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ ఉన్నారు. ఈ ఛానల్‌లో నేను ఇప్పటి వరకు పది వీడియోలు చేశాను. వీటిలో ‘ఫ్రస్టేషన్ తెలంగాణ పిల్ల, హుషార్‌పిల్ల, తెలంగాణ పిల్ల బేరామాడితే, సేల్స్ గర్ల్స్, ఫ్రస్టేషన్ ఎంబీబీఎస్ స్టూడెంట్’ వంటివి బాగా క్లిక్కయ్యాయి. ఎక్కడికెళ్లినా దేత్తడిలో చేసిన అమ్మాయి.. అంటూ గుర్తు పట్టి మరీ పలకరిస్తున్నారు. యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌తోనే సోషల్ మీడియా బాట పట్టాను. నేను చేసిన ప్రతి వీడియోకు పది లక్షలకు పైగా వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. – హారిక అలేఖ్య, దేత్తడి సెలబ్రిటీ
ఫేస్‌బుక్ మార్చేసింది..
నేను 2016 వరకు చాలా సాధారణ అమ్మాయినే. ఫేస్‌బుక్‌లో ‘లైవ్ వీడియో’ ఆప్షన్ వచ్చినప్పుడు ఒకరోజు లైవ్ చేశా. రెండు గంటల పాటు చేసిన లైవ్‌కి అదే టైంలో 70 వేల మందికి పైగా చూశారు. ఈ స్ఫూర్తితోనే లైవ్‌ని కంటిన్యూ చేశా. ఇప్పుడు పది నుంచి పదిహేను లక్షల మంది వ్యూస్ రావడం చాలా గర్వంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్‌బుక్ నన్ను స్టార్‌గా మార్చేసింది. నాకు ఏ సమస్య ఉన్నా.. ఇతరులకు ఎదైనా సమస్య వచ్చినా నేను ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచానికి చెప్పి పరిష్కరించడం ఆనందంగా ఉంది. – దివ్య అన్వేషిత,ఫేస్‌బుక్ సెలబ్రిటీ
Comments
Please login to add a commentAdd a comment